భర్తతో గొడవ.. ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి ఏం చేసిందంటే..?
భార్య-భర్తల మధ్య గొడవలు అనేవి ప్రతి ఇంట్లోనూ జరిగే సహజమైన అంశం. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు ఆలోచనలతో, వేర్వేరు అలవాట్లతో ఒకే ఇంట్లో జీవించడం అంటే చిన్నపాటి విభేదాలు తప్పవు. కానీ ఈ గొడవలు పరస్పర అవగాహనతో పరిష్కారమైతే, అది సంబంధాన్ని బలపరుస్తుంది. అయితే హద్దులు దాటి, రోజువారీగా తగువులు జరగడం మాత్రం కాపురాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.
అందుకు ఉదాహరణ ఈ ఘటన.
భర్తతో తరచూ గొడవలు జరుగుతుండటంతో.. భరించలేకపోయిన ఓ ఇల్లాలు తన ముగ్గురు పిల్లలతో కలిసి అఘాయిత్యానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బండా జిల్లాలోని రిసౌరా గ్రామంలో చోటుచేసుకుంది. తనతో పాటు తన ముగ్గురు చిన్నారుల ప్రాణాలను సైతం చేజేతులా వదులుకోవడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా అఖిలేశ్, రీనా (30) దంపతులు నివసిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు హిమాన్షు (9), అన్షి (5), ప్రిన్స్ (3) ఉన్నారు. పెళ్లి తర్వాత ప్రారంభమైన చిన్న చిన్న విభేదాలు, కాలక్రమేణా పెద్ద గొడవలుగా మారాయి. పెద్దలు ఎంత సర్దిచెప్పినా, ఆ సమస్యలు తగ్గకపోగా రోజురోజుకీ మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 8 (శుక్రవారం) రాత్రి కూడా రీనా, అఖిలేశ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో, ఆవేదనతో రీనా ముగ్గురు పిల్లలతో కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఉదయం అత్తమామలు లేచి చూసే సరికి కోడలు, మనవళ్లు కనిపించలేదు.
కెన్ కాలువ వద్ద అనుమానాస్పద దృశ్యం..
సమీపంలో వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కెన్ కాలువ వద్ద రీనా, పిల్లల బట్టలు, గాజులు, చెప్పులు కనిపించాయి. దీంతో వారంతా కాలువలోకి దూకి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమైంది. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సహాయంతో సుమారు ఆరు గంటల పాటు గాలింపు జరిపారు. చివరికి రీనా, ముగ్గురు పిల్లల మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, భర్త అఖిలేశ్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తరచూ జరుగుతున్న గొడవలకు కారణాలు, ఆ రాత్రి జరిగిన తగువులపై సమగ్ర విచారణ చేస్తున్నారు.
ఒకే కుటుంబంలో నలుగురు మృతదేహాలు రావడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications