వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రొఫెసర్ సాయిబాబా నిరాహార దీక్షపై భార్య వసంత ఆందోళన... మౌలిక వసతులు కల్పించాలని జైలు అధికారులకు లేఖ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జీఎన్ సాయిబాబా

ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నాగ్‌పుర్ అక్టోబర్ 21 నుంచి సెంట్రల్ జైలులో నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించినప్పటి నుంచి ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలులో మౌలిక హక్కులు కూడా కల్పించకుండా వేధిస్తున్నందుకే ఆయన ఈ దీక్ష చేపడుతున్నారని ఆయన కుటుంబం చెబుతోంది.

మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో సాయిబాబాను 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు. 2017 మార్చిలో ఆయనకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ప్రస్తుతం నాగ్‌పుర్ జైలులోని ''అండా సెల్''లో ఆయన్ను ఉంచారు.

కొంత కాలంగా ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విరసం నేత వరవరరావు ఆరోగ్య విషయంలో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వారికి జైలులో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలేదని, కరోనావైరస్ పేరుతో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే, వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కేస్లుల్లో తీవ్రత దృష్ట్యా వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో వాదిస్తూ వస్తోంది.

తాజా దీక్ష ఎందుకు?

వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. 2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

తన ఆరోగ్యం రీత్యా బెయిల్‌ ఇవ్వాలని ఆయన గతంలో కూడా కోరారు. అయితే ఆయనపై మోపిన ఆరోపణల దృష్ట్యా వికలాంగుడనే కారుణ్య కారణాలతో బెయిల్ ఇవ్వలేమని ఒక సందర్భంలో గడ్చిరౌలి సెషన్స్‌ కోర్టు వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం ఆయనకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలేదని, అందుకే ఆయన నిరాహార దీక్ష చేపడుతున్నారని సాయిబాబా భార్య ఏఎస్ వసంత కుమారి చెప్పారు. నాగ్‌పుర్ జైలు సూపరింటెండెంట్‌కు ఆమె ఓ లేఖ రాశారు.

''అక్టోబరు 21 నుంచి సాయిబాబా నిరహార దీక్ష చేస్తానని చెప్పారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి. ఆయనకు మౌలిక హక్కులు కల్పించాలి'' అని ఆమె ఆ లేఖలో కోరారు.

వసంత సాయిబాబా లేఖ

వసంత రాసిన లేఖలోని ముఖ్యాంశాలు

''జైలులో మౌలిక హక్కులు కూడా కల్పించడంలేదని ఆయన నాకు ఫోన్‌లో చెప్పారు. ఆయన చెబుతున్న వివరాల ప్రకారం.. కొన్ని నెలలుగా ఆయనకు మందులు ఇవ్వడం లేదు. వైద్యులు సూచించినట్లుగా ఆయనకు ఎలాంటి సహాయకులను నియమించలేదు. ఆయన రోజూ ఫిజియోథెరపీ చేయాలని వైద్యులు సూచించారు. కానీ, మీరు దానికి అనుమతించడంలేదు. అంతేకాదు మేం పంపించిన కొన్ని పుస్తకాలు, లేఖలు మీరు మధ్యలో ఆపేసినట్లు తెలిసింది. అందుకే, తాను నిరాహార దీక్ష చేపడతానని చెప్పారు''.

''ఒక ఖైదీగా తనకు మౌలిక హక్కులు కల్పించడంలేదని, వేధింపులకు గురిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆయన దిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. నిరంతరం ఆయన పుస్తకాలు చదివేవారు. వాటి నుంచి ఆయన్ను దూరం చేయొద్దు. మేం ప్రఖ్యాత రచయితల రచనలనే పంపిస్తున్నాం. దయచేసి అవి ఆయనకు అందించండి''.

''ఆయనకు హృద్రోగాలు ఉన్నాయి. ఆయనకు మందులు ఎప్పటికప్పుడు అందించాలి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మేం చాలా బాధపడుతున్నాం. ఆయన నిరాహార దీక్ష చేపట్టకూడదని మేం భావిస్తున్నాం. దీని గురించి ఆయనకు మేం లేఖ కూడా రాశాం. దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఆయనకు ప్రాథమిక హక్కులు కల్పించాలి''.

''ఆయనతో వెంటనే ఫోన్‌కాల్ మాట్లాడేందుకు కుటుంబాన్ని అనుమతించాలి. ఆయన దీక్ష కొనసాగించకుండా మేం ఒప్పిస్తాం. మా అభ్యర్థనలపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. ఆయన సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం''అని వసంత వివరించారు.

మరోవైపు ప్రొఫెసర్ సాయిబాబాకు వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని 'కమిటీ ఫర్ ద డిఫెన్స్ అండ్ రిలీజ్ ఫర్ డాక్టర్ జీఎన్ సాయిబాబా' చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ కూడా జైలు సూపరింటెండ్‌కు లేఖ రాశారు.

''నిరాహార దీక్ష వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆందోళనగా ఉంది. ఆయన దీక్ష చేపట్టకూడదని మేం భావిస్తున్నాం. దయచేసి మా అభ్యర్థనను ఆయనకు తెలియజేయండి''అని లేఖలో కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు.

''జైలు అనేది ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి.. అంతేకానీ వారిని శిక్షించడానికి కాదు. సాయిబాబా డిమాండ్లను పరిష్కరించాలని మేం కోరుతున్నాం''.

కమిటీ లేఖలో కోరిన అంశాలు

కుటుంబ సభ్యులు పంపిస్తున్న పుస్తకాలను సాయిబాబాకు అందించాలి. వాటిలో నిషిద్ధ ప్రచురణలేవీ లేవు.

ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు పంపే లేఖల్ని మధ్యలోనే అడ్డుకోవద్దు.

కోవిడ్-19 వ్యాప్తి నడుమ పత్రికలను నిలిపివేశారు. రోజూ ఆయనకు దినపత్రికలు ఇవ్వండి.

నెలలో నాలుగుసార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఆయన్ను అనుమతించండి. ఆయనకు అవసరమైనప్పుడు అడ్వొకేట్‌లను కలిసేందుకు వీలు కల్పించండి.

అత్యవసర మందులు, కుటుంబ సభ్యులు అందించే ఇతర సామగ్రిని ఎప్పటికప్పుడు అందించే సదుపాయం కల్పించండి.

ఆయన తల్లి మరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన పెట్టుకున్న పెరోల్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Wife Vasantha's concern over Professor Saibaba's hunger strike,writes Letter to jail authorities to provide basic facilities
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X