వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక నగరంలోని ప్రజలంతా ఒకే భవనంలో నివసించే రోజులు వస్తాయా, ఇది ఎలా సాధ్యం?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నయా నగరాలు

భవిష్యత్‌లో మన ఇళ్లు ఇలా ఉండబోతున్నాయి అనడానికి ఉదాహరణలుగా సైన్స్ ఫిక్షన్‌లో ఎన్‌క్లోజ్డ్ సిటీలు కనిపిస్తుంటాయి. అవి స్వయం నియంత్రిత నగరాలు. ఇందులోనే మనకు అవసరమైన సౌకర్యాలు అంటే, విద్యుత్తు, నీరు, ఆహారోత్పత్తి, వ్యర్థాల నిర్వహణలాంటి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి.

ఆర్కిటెక్చర్‌ను, ఎకాలజీని మిళితం చేస్తూ ఆర్కాలజీ అనే పదం పుట్టుకొచ్చింది. ఈ పదాన్ని ఆర్కిటెక్ట్ పాలో సోలెరి 1969లో ప్రతిపాదించారు. నిర్మాణాలను, పర్యావరణాన్ని కలపడానికి ఆయన ప్రయత్నించారు. ఒక ఏడాది తర్వాత అమెరికాలోని 'ఆర్కోసాంటి' అనే పేరుతో ఒక ప్రయోగాత్మక పట్టణాన్ని నిర్మించే పని మొదలు పెట్టారు సోలెరి. ఇది ఆయన ఆలోచనలకు ప్రతిరూపం.

భవిష్యత్ నగరాల గురించి సోలెరి సాగించిన ఆలోచనలు సైన్స్ ఫిక్షన్‌కు ప్రేరణగా నిలిచాయి. ఈ మోనోలితిక్(ఏకశిలా) నగరాలలో జనం తమ అవసరాల కోసం బయటకు వెళ్లాల్సిన పని ఉండదు. ఇలాంటి భారీ నిర్మాణాలు అక్కడక్కడా సినిమాలో కనిపిస్తుంటాయి. వీటి పనితీరు ఎలా ఉంటుందో డ్రెడ్, స్కైస్క్రేపర్ లాంటి సినిమాలలో లీలామాత్రంగా చూపిస్తారు.

అయితే, సైన్స్ ఫిక్షన్ వాస్తవ ప్రపంచంలో కొందరిని ప్రేరేపించి ఉండొచ్చు కూడా. సౌదీ అరేబియా ప్రతిపాదించిన 'ది లైన్' నగరం ఆ కోవలోకే వస్తుంది. 200మీ వెడల్పు, 170 కిలో మీటర్ల పొడవు, 500మీ ఎత్తులో విస్తరించి ఉన్న ఒకే భవనంలో తొంభై లక్షలమంది నివసించగలిగే భారీ స్మార్ట్ సిటీకి ప్లాన్ చేశారు. ఈ 'లైన్' నగరానికి సౌరశక్తి, వాయు టర్బైన్‌ల ద్వారా విద్యుచ్ఛక్తిని అందిస్తారు. కాకపోతే ఇది పూర్తి స్వయం సమృద్ధంగా ఉండదు. ఇందులో నివసించే వారికి ఆహారం, ఇతర సామాగ్రి బయటి నుంచే సేకరించాల్సి ఉంటుంది.

ఆర్కాలజీ మాదిరి కొన్ని నిర్మాణాలు ఇప్పటికే ఉన్నాయి. ఉదాహరణకు, అంటార్కిటిక్ లోని పరిశోధనా కేంద్రాలు కొంత వరకు స్వయం సమృద్ధి కలిగిన కమ్యూనిటీలు. చుట్టుపక్కల ఉన్న వాతావరణం, సుదూరంగా ఉండటం వల్ల వాటికి స్వీయ నియంత్రణ అవసరం. మెక్‌ముర్డో స్టేషన్ దాదాపు 3,000 మంది పరిశోధకులు, సహాయక సిబ్బందికి ఇల్లులాగా పని చేస్తుంది. అయితే, ఈ స్టేషన్‌కు ఇప్పటికీ ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఆహారం, ఇంధనం అందిస్తూ ఉండాలి.

ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, న్యూక్లియర్ సబ్‌మెరైన్‌లు, ఆయిల్ రిగ్‌ల వంటి ఇతర నిర్మాణాలు వీలైనంత స్వయం-సమృద్ధిగా ఉండేలా రూపొందిస్తారు. ఇవి సిబ్బందికి అవసరమైన నివాసాలు, వర్క్ ప్లేస్‌ల సమ్మేళనంగా ఉంటాయి. అయితే, ఇవి స్వల్పకాలిక ఉపయోగం కోసమే.

ఒక విమాన వాహక నౌకను కొన్ని వారాలకొకసారి ఇంధనాన్ని సరఫరా చేయాల్సి ఉంటుంది. అణు జలాంతర్గామి నాలుగు నెలల వరకు నీటి అడుగున ఉంటుంది. అయితే, ఈ రెండూ అందరూ నివసించడానికి ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలు కావు. ముఖ్యంగా జలాంతర్గాములు మరీ ఇరుకుగా, దుర్వాసనతో ఉంటాయి. పడుకునే గదులను అందరూ షేర్ చేసుకోవాలి. పగటి వెలుతురు లేకపోవడం వల్ల సిబ్బందికి విటమిన్ డి సప్లిమెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది.

నయా నగరాలు

మరి మనం నిజంగా ఆర్కాలజీని నిర్మించగలమా? అటువంటి నిర్మాణం సైజును, దాని బరువును తట్టుకోవడానికి భారీ పునాదులు అవసరం.

''ఏది నిర్మించాలన్నా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా ఏదీ మనం సాధించలేనిది కాదు. కానీ, పునాదుల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది'' అని బీఎస్పీ కన్సల్టింగ్‌కు చెందిన స్ట్రక్చరల్ ఇంజనీర్ మోనికా అన్స్‌పెర్గర్ అన్నారు.

భవనం ఎత్తుగా ఉండటం ఏర్పడే మొదటి సవాలు గాలి ప్రభావం. విండ్ లోడ్ అనేది ఒక సాధారణ ఇంటికి ఆందోళన కలిగించే అంశం కాదు. కానీ దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వంటి భారీ టవర్లు నిర్మించేటప్పుడు గాలి వేగాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. సుడిగాలి భవనం ఉపరితలాన్ని తాకడం, ఎదురుగా అల్పపీడన ప్రాంతాన్ని సృష్టించడం, ఆపై దాన్ని పూరించడానికి చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల భవనంపై ప్రభావం పడుతుంది. ఈ వోర్టెక్స్ చర్యల వల్ల ఎత్తైన భవనాలు భారీ గాలుల సమయంలో ఊగుతాయి.

ఊగిసలాట ప్రభావాలు డ్రింక్స్ ఒలికిపోవడం నుంచి బిల్డింగ్ కూలిపోవడం వరకు ఉంటుంది. 1940లో వాషింగ్టన్‌లోని టాకోమా నారోస్ బ్రిడ్జి కూలిపోయింది. బలమైన గాలులు వంతెనపై అధిక పౌనఃపున్యంతో ప్రకంపనలకు కారణమైంది. దీంతో బ్రిడ్జి కూలింది. ఇలాంటి కదలికను తగ్గించడానికి ట్యూన్డ్ మాస్ డంపర్ (వైబ్రేషన్‌లను తగ్గించే పరికరం)ని ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వీటితోపాటు, గాలి ప్రవాహానికి అంతరాయం కలిగించేలా నిర్మాణాన్ని చేపట్టడం కూడా ఒక మార్గం.

బుర్జ్ ఖలీఫాతో సహా అనేక పెద్ద భవనాల వాస్తుశిల్పి అయిన అడ్రియన్ స్మిత్ దీని గురించి మాట్లాడారు. "సుడిగుండాలను తగ్గించడానికి ఒక మార్గం భవనం పైకి వెళ్లే కొద్దీ దాని ఆకారాన్ని మార్చడం. "మీరు భవనం ఆకారాన్ని మార్చకపోతే, ఆ దానికదే సుడిగుండం ఏర్పడటానికి, కదలికలకు అవకాశం ఉంది. అవి భవనంతో సింక్ అవుతాయి. అప్పుడు బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది'' అని ఆయన వెల్లడించారు.

నయా నగరాలు

అందువల్ల, డ్రెడ్‌ సినిమాలో చూపించినట్లు షీర్-వాల్డ్ స్ట్రక్చర్‌లాగా ఆర్కాలజీని నిర్మించడం కంటే, పురాతన మెసోఅమెరికన్ నిర్మాణాల వంటి మెట్ల నిర్మాణాన్ని ఉపయోగించడం వంటి గాలి ప్రవాహానికి అంతరాయం కలిగించేందుకు అవకాశం ఉంటుంది.

ఇక మరో ప్రధానమైన సమస్య ఇంధన ఉత్పత్తి. సౌర ఫలకాలు, విండ్ టర్బైన్‌ల వంటి పునరుత్పాదక శక్తి టెక్నాలజీని ఆర్కాలజీ వెలుపలి భాగంలో సులభంగా అమర్చవచ్చు. కానీ, వాటి సొంతంగా పూర్తి స్థాయిలో ఇంధన అవసరాలను అవి తీర్చలేకపోవచ్చు. అవి నిర్దిష్ట సమయాల్లో మాత్రమే యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి, బ్యాకప్ పవర్ జనరేషన్ లాంటివి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ల కొరత ఏర్పడినప్పుడు అవసరమవుతాయి.

అణు రియాక్టర్లు కూడా ఎనర్జీ ఉత్పాదనకు మరో మార్గం. అధునాతన అణు రియాక్టర్లను చిన్నగా రూపొందించగా ఏర్పడినవే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (SMRs). ఇవి పెద్ద రియాక్టర్‌ల కంటే మెరుగైన భద్రతను కలిగి ఉంటాయి. అయితే, అన్ని అణు విచ్ఛిత్తి రియాక్టర్ల మాదిరిగానే, అణు వ్యర్థాలను ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం ఒక సవాలు. ప్రత్యామ్నాయంగా, ఫ్యూజన్ రియాక్టర్‌లు సురక్షితమైన, స్వచ్ఛమైన ఎనర్జీని అందిస్తాయి. అయితే ప్రస్తుత డిజైన్‌లు బరువు పరంగాను, ఆర్థికంగా లాభదాయకం కాదు. ఇవి అవసరానికి మించి శక్తిని ఉత్పత్తి చేయలేవు.

ఆహార ఉత్పత్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక భవనంలో సంప్రదాయ వ్యవసాయం అసాధ్యం. అందువల్ల నిలువుగా ఉండే హైడ్రోపోనిక్ పొలాలను ఉపయోగించవచ్చు. ఇది సహజమైన ఎయిర్ రీసైక్లింగ్‌ను కూడా అందిస్తుంది. అయితే, దీనికి వెలుతురు అవసరం కావడం వల్ల ఎనర్జీ వినియోగం పెరుగుతుంది. స్థలాభావం లాంటి పరిస్థితులు ఆహారోత్పత్తి మీద ప్రభావం చూపుతాయి.

పాలో బాసిగలుపి నవల "వాటర్ నైఫ్‌"లో చిత్రీకరించిన ఆర్కాలజీలో నీటిని రీసైకిల్ చేయడానికి వడపోత చెరువులను ఉపయోగించడం కనిపిస్తుంది. ఇది ఆమోదయోగ్యమైనది కూడా. అయితే, ఏ రీసైక్లింగ్ వ్యవస్థలోనైనా నష్టాలు అనివార్యం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రతిరోజూ మూత్రం, చెమట సహా సుమారుగా17.3 లీటర్ల నీటిని రీసైకిల్ చేస్తుంది. ఇంత చేసినా, కొన్ని నెలలకు సరిపడా మంచినీటిని దానికి క్రమం తప్పకుండా సరఫరా చేయాల్సి వస్తోంది.

అయితే, ఇలాంటి ఎత్తయిన భవనాలకు భవిష్యత్తు ఉందని అందరూ నమ్మడం లేదు. ఉదాహరణకు చైనా 500 మీటర్లకన్నా ఎత్తయిన భవనాల నిర్మాణాన్ని 2021 నుంచి నిషేధించింది. అలాగే 250 మీటర్లకన్నా ఎత్తున్న భవనాలకు అనేక నిబంధనలు విధించింది.

నయా నగరాలు

అయితే, భూమిపై పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ కొత్త చర్యలన్నీ ఉండాలి. కొత్త భూమిలో నిర్మించడం ద్వారా నగరాలను విస్తరింపజేయడం(అడ్డంగా) ఎల్లకాలం కుదరదు. అందువల్ల కొత్త నగరాలను(నిలువుగా) నిర్మించాల్సిన అవసరం ఏర్పడుతోంది.

ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టాల్ బిల్డింగ్స్ అండ్ వర్టికల్ అర్బనిజం డైరెక్టర్, కౌన్సిల్ ఆన్ టాల్ బిల్డింగ్స్ అండ్ అర్బన్ హాబిటాట్ ప్రెసిడెంట్ ఆంటోనీ వుడ్ దీని గురించి మాట్లాడారు. "నగరాలు భారీగా విస్తరిస్తున్నాయి, జనాభా పది లక్షల నుంచి కోట్లకు చేరుకుంటోంది. ఇక అడ్డంగా విస్తరించడం కుదరదు. భూ సమాంతరంగా నగరాన్ని నిర్మించి, వాటిని మేనేజ్ చేయడం కష్టం. అందువల్ల నిలువు నగరాలే దానికి పరిష్కారం'' అని ఆంటోనీ వుడ్ అన్నారు.

ఇండిపెండెంట్ టవర్ బ్లాక్‌లకు బదులు, భవనాలను ల్యాండ్ బ్రిడ్జెస్ అనుసంధానించి, వాటి మధ్య పచ్చని ప్రదేశాలను సృష్టించవచ్చు. అయితే, ల్యాండ్ బ్రిడ్జ్‌ల నెట్‌వర్క్‌తో ఎత్తయిన నగరాలను నిర్మిస్తూ పోవడం వల్ల కింది ప్రాంతాలు నీడలో ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది.

''నగరాలు నిలువుగా, అడ్డంగా రెండు విధాలుగా పెరగడం మంచిది'' అని ఆడ్రియన్ స్మిత్ అభిప్రాయపడ్డారు.

వాతావరణ మార్పు ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నందున, నగరాలను నిర్మించే పదార్థాలు కూడా మారవచ్చు. సిమెంట్ పరిశ్రమ నుండి వచ్చే కార్బన్ ఉద్గారాలు విమానయాన రంగం నుండి వెలువడే వాటి కంటే ఎక్కువగా ఉన్నాయి. మాస్ టింబర్ లాంటి ఒక ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రి రావచ్చు. " మాస్ టింబర్ ను తయారు చేయడానికి ఉపయోగించే ఎనర్జీ, ఉక్కు, కాంక్రీట్ లాంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగించే ఎనర్జీలో అణువంత ఉంటుంది'' అని వుడ్ అన్నారు.

ఆర్కాలజీని నిర్మించడం సిద్ధాంతపరంగా సాధ్యమే అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలను, అవసరాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, సమీప భవిష్యత్తులో ఆర్కాలజీలను ఆర్థికంగా ఎలా లాభదాయకంగా మార్చవచ్చో చూడటం కష్టమని విమర్శకులు అంటున్నారు. ఎన్‌క్లోజ్డ్ సిటీలలో శాశ్వతంగా నివసించడం అంత ఆనందకరంగా ఏమీ ఉండదనే వాదన కూడా ఉంది.

"ఏదైనా నిర్మించడానికి అసాధ్యమని చెప్పలేను. అయితే, దీని కోసం ప్రత్యేక దృష్టి ఉండాలి" అని అన్స్‌పెర్గర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Will the days come when all the people of a city live in one building, how is this possible?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X