వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేనను పక్కనపెట్టి కాపులు కొత్త పార్టీ పెడతారా, ఫోరం ఫర్ బెటర్ ఏపీ లక్ష్యం ఏంటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

'ఫోరం ఫర్ బెటర్ ఏపీ' పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు కాపు నేతలు ఆదివారం విశాఖపట్నంలో సమావేశమయ్యారు. వీరిలో మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ పోలీసు అధికారులు ఉన్నారు.

దీంతో కాపుల రాజకీయ పార్టీ అనే అంశం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్స్‌లో దీనిపై తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి.

ఇటీవల కాలంలో హైదరాబాద్, విశాఖలలో అనేక సమావేశాలు నిర్వహించారు కాపు నేతలు. వాటిలో కూడా కాపుల రాజకీయ పార్టీ మీదే ప్రధానంగా చర్చ నడిచింది.

కాపులను ఒకే వేదిక మీదకు తీసుకురావడంపై ఆదివారం విశాఖలో సమావేశాలు నిర్వహించామని ఫోరం ఫర్ బెటర్ ఏపీ చైర్మన్ నండూరి సాంబశివరావు అన్నారు. సాంబశివరావు మాజీ డీజీపీ కూడా.

''రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తిగతంగా, చిన్నచిన్న సముహాలుగా తమ సమస్యలపై కాపులు పోరాటాలు చేస్తున్నారు. ఇలా కాకుండా అందరినీ కలిపి ఒక వేదిక మీదకు చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాలు ఏర్పాటు చేశాం’’ అని సాంబశివరావు అన్నారు.

ఇప్పుడు కాపులతో పాటు బహుజనులను కలుపుకుని వారందరి సమస్యలను కొత్త మార్గాల్లో పరిష్కరించే విధంగా వేదిక ఏర్పాటు చేశామని, దాని పేరే 'ఫోరం ఫర్ బెటర్ ఏపీ' అని ఆయన తెలిపారు.

'బహుజనులను కలుపుకొని పోతాం'

గతంలో మాదిరి కాకుండా ఈసారి బహుజనుల కోసం కూడా పని చేయనున్నట్లు సాంబశివరావు వెల్లడించారు.

''కాపులు అంటే ఆ సామాజిక వర్గం మాత్రమే కాకుండా బహుజనులందరూ బలోపేతమవ్వడమే లక్ష్యంగా పని చేస్తాం. ఇది ఒక నూతన పంథాలో జరుగుతుంది. రాజకీయంగా మాత్రమే కాకుండా ప్రభుత్వం, వివిధ శాఖలతో కలిసి ఏ విధంగా సమస్యలను పరిష్కరించాలో కనుక్కుంటాం. అయితే ఇదంతా రాజకీయాల కోసం కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నాయో గమనిస్తే అందరికి అర్థమవుతుంది’’ అన్నారాయన.

కాపులు, బహుజనులు అసమానతలు ఎదుర్కొంటున్నారని, వీటిని ఎదుర్కొనేందుకే ఈ ఫోరం కృషి చేస్తుందని సాంబశివరావు వెల్లడించారు. రాజ్యాంగం చెప్పినట్లుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరూ ఎదగాలనే స్ఫూర్తితోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

'ముద్రగడ పద్మనాభం ఎందుకు రాలేదు'

కాపులు తరచూ సమావేశాలు పెట్టుకోవడం, రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంతో పని చేయాలని ప్రతిజ్ఞలు చేయడం ఇటీవలి కాలంలో తరచూ జరుగుతూ ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి రాజకీయ, వ్యాపార, సినీ రంగాల్లో ఉన్నవారంతా తరచూ పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఇలాంటి సమావేశాలు జరగడం కొత్తకాకపోయినా, వాటి 'అవుట్ పుట్' మాత్రం ఉండటం లేదని కాపు నేత వి.రమణ అంటున్నారు.

''విశాఖ సమావేశంలో గంటా, బొండా, వట్టి వసంతకుమార్ వంటి నేతలు పాల్గొన్నారు. కాపు కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు, కాపులకు జరుగుతున్న అన్యాయం వంటి అంశాలు చర్చించడానికే కలిశామని వారు చెబుతున్నారు. అంతేకానీ అసలు భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఏమైనా ఉందా అనే అంశంపై వారు నోరు మెదపడం లేదు’’ అని రమణ వ్యాఖ్యానించారు.

ఏళ్ల తరబడి సరైన వేదిక, భవిష్యత్తు కార్యాచరణ అంటూ ఏవో పదాలు వాడుతూ డొంక తిరుగుడు వ్యవహారాలతో కాలం గడిపేస్తే ఉపయోగం ఉండదని రమణ అన్నారు.

''విశాఖ సమావేశంలో రాజకీయ అవసరాలున్న వాళ్లే సమావేశమైనట్లు కనిపిస్తోంది. కానీ నిజంగా కాపుల కోసం పోరాడే వాళ్లు ఎవరున్నారు'' అని రమణ ప్రశ్నించారు.

కాపుల కోసం పోరాటాలు చేసిన ముద్రగడ పద్మనాభం ఈ సమావేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నించిన రమణ, అందర్ని కలుపుకుని పోకపోతే ఇటువంటి మీటింగుల వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు.

ముద్రగడ పద్మనాభం ఈ సమావేశంలో పాల్గొనలేదు

కాపులపై బీజేపీ దృష్టి పెట్టిందా?

'ఫోరం ఫర్ బెటర్ ఏపీ' పేరుతో ఏర్పాటైన సమావేశానికి హాజరైన కాపు నాయకులందరూ కూడా వైసీపీకి దూరంగా ఉన్నవాళ్లే. ''పైగా వీళ్లంతా ప్రలోభాలకో, భయాలకో లొంగేవారు కాదు. వాళ్ల అవసరాల మేరకు వాళ్లకేమి కావాలో ఏదీ చేయాలో తెలిసిన వాళ్లే. ఇలా చూస్తే ఇది బీజేపీ స్కెచ్‌లా కూడా కనిపిస్తోందని రమణ అంటున్నారు. 'ఫోరం ఫర్ బెటర్ ఏపీ' సమావేశానికి ఆయన హాజరుకాలేదు.

''కాపుల ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో బలంగా నాటుకుపోవాలని బీజేపీకి చాలా ఆశలే ఉన్నట్లు కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలే అధికారాన్ని దశాబ్ధాలుగా పంచుకుంటూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా రెడ్లు, కమ్మలు తర్వాత బలంగా ఉన్నది కాపులే. అందుకే వీరి ద్వారా ఏపీలో ఓట్ల వేట సాగించాలని అనుకుంటోంది బీజేపీ. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన రాష్ట్ర పదవులు పరిశీలిస్తే వారు కాపులపై దృష్టి పెట్టారనే విషయం అర్థమవుతోంది'' అని రమణ విశ్లేషించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ జనసేన, బీజేపీ దోస్తీని ఆయన గుర్తు చేశారు.

'కాపులకు చిక్కని అధికారం'

రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి గతంలో అవకాశాలు వచ్చినా కూడా వాటిని వినియోగించుకోలేక పోయామని కాపు సంఘం నాయకులు అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో కాపుల జనాభా ఉన్నప్పటికీ అధికారానికి మాత్రం దూరంగా ఉండిపోతున్నామని వారు అంటున్నారు.

''రాష్ట్రంలో రెడ్లు, కమ్మ సామాజిక వర్గాల తర్వాత బలమైన వర్గం కాపులే. జనాభా పరంగా కూడా కాపులకన్నా రెడ్లు, కమ్మ వారి సంఖ్య తక్కువ. అయినా, కుర్చీలాటలాగ ఆ రెండు కులాలే ఒకరి తర్వాత మరొకరు ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటున్నారు. సంఖ్యా పరంగా బలంగా ఉన్న కాపులకు ముఖ్యమంత్రి పదవి కలగానే ఉండిపోయింది. వంగవీటి రంగాతో మొదలైన కాపుల ప్రభావం తర్వాత దాసరి నారాయణ రావు, చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల రూపంలో కనిపిస్తోంది కానీ ప్రభంజనంలాగా మారడం లేదు. దీనికి కారణాలు అన్వేషించాల్సి ఉంది'' అని రాష్ట్ర కాపు సంఘం నాయకుడు బి.మూర్తి అన్నారు.

పవన్ కల్యాణ్‌ను నమ్మడం లేదా?

కాపుల రాజకీయ ఎదుగుదల కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఫలించడం లేదు. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ రూపంలో కాపుల రాజకీయ ప్రయోగం జరిగింది. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీకి 18 సీట్లు మాత్రమే వచ్చాయి. నాడు రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన చిరంజీవి, తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు.

మొత్తం మీద ఆ ఎన్నికల్లో సుమారు 16శాతం ఓట్లు సాధించింది ప్రజారాజ్యం. కానీ ఎక్కువ రోజులు నిలబడలేక కాంగ్రెస్‌లో కలిసి పోయింది.

నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో యూత్ వింగ్ సారథిగా పని చేసిన పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పోటీ చేసిన తరువాత సరిగ్గా పదేళ్లకు పవన్ కల్యాణ్ పార్టీ 2019 ఎన్నికల బరిలో దిగింది. కానీ పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. జనసేనకు మొత్తానికి వచ్చింది ఒక్క సీటు మాత్రమే.

ప్రజారాజ్యం పార్టీపై ఆశలు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన యువత, ఇతర పార్టీల నుంచి వచ్చిన అనేక మంది కార్యకర్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం చేయకుండా ఉంటే చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యుండే వారని కాపులు ఇప్పటికీ నమ్ముతారు.

''పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి గట్టిగానే పోరాటం చేస్తున్నారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటాన్ని హర్షించాల్సిందే. కానీ కచ్చితమైన యాక్షన్ ప్లాన్ జనసేనకు లేనట్లుగా కనిపిస్తుంది. ఎన్నికల్లో తాను గెలవడం కంటే టీడీపీ అధికారంలోకి వచ్చేందుకే ఎక్కువ సహాయపడింది జనసేన’’ అని ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ రవి విశ్లేషించారు.

రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలనే 2019లో జనసేన ఒకే సీటుకు పరిమితమైందని, దీంతో జనసేనపై కూడా కాపుల్లో పెద్దగా ఆశలు కనిపించడం లేదని ప్రొఫెసర్ రవి అన్నారు.

''అందుకే ప్రత్యమ్నాయ వేదిక ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. విశాఖలో ఏర్పాటైన ఫోరంను ఆ కోణంలోనే చూడొచ్చు. ఇది నిలదొక్కుకుంటే భవిష్యత్తులో పొలిటికల్ పార్టీ అయ్యే అవకాశం కూడా ఉంది'' అని ప్రొఫెసర్ రవి అభిప్రాయపడ్డారు.

కొత్త కాపు పార్టీ పుట్టుకొస్తుందా?

'2014, 2019 ఇలా ఎన్నికల సమయంలో కాపు నాయకుల సమావేశాలు జరుగుతూ ఉండేవి. అప్పుడు కాపులు ఏకమవుతున్నారు. అధికారంలోకి కాపుల పార్టీ వస్తుందనే అందరూ అనుకునే వారు. కానీ అదంతా సులభం కాదని కాపులకు అర్థమైందని విశాఖ కాపు సమావేశంలో పాల్గొన్న నాయకుడు ఒకరు అన్నారు.

''పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనను కాపులు తమ పార్టీయే అని చెప్పుకుంటారు. మరి జనసేన ఉండగా మరో పార్టీ అవసరమా అనే ప్రశ్న వస్తుంది. కాకపోతే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్టా రాజకీయ పార్టీగా కాకుండా ముందుగా ఒక ఫోరంగా పని చేసి తర్వాత రాజకీయ పార్టీ కోసం ఆలోచిస్తాం. 2024లో లేదా అంతకంటే ముందే ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో జనసేనతో వెళ్లాలా లేక కాపుల కోసం మరో రాజకీయ పార్టీ పెట్టాలా అనే అంశంపై చర్చించాల్సి ఉంది. అయితే కాపులను బలోపేతం చేయాల్సిన అవసరమైతే ఉంది'' అని రాష్ట్ర కాపు సంఘం ప్రతినిధి ఒకరు చెప్పారు.

'సోషల్ ఇంజినీరింగ్ జరగాలి'

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పడిన 'ఫోరం ఫర్ బెటర్ ఏపీ' సంస్థ, భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారుతుందని కాపు నేతలు అంటున్నారు. కానీ పార్టీగా మారే ముందు అందుకు అవసరమయ్యే సోషల్ ఇంజినీరింగ్ చేయాలని ఫోరం ఫర్ బెటర్ ఏపీ చైర్మన్ నండూరి సాంబశివరావు అంటున్నారు.

విశాఖలోని జరిగిన కాపుల సమావేశానికి గంటా, వట్టి వంటి నేతలు హాజరైనా మీడియా ముందు మాట్లాడలేదు. ఆ బాధ్యతలు సాంబశివరావుకే ఇచ్చారు.

''రాష్ట్రంలో సోషల్ ఇంజినీరింగ్ జరగాల్సిన అవసరం ఉంది. కాపులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు సంబంధించి ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదల చాలా ముఖ్యం. కాపులు మాత్రమే కాదు బహుజనులు, అగ్రవర్ణాల పేదలతో కలిసి ఫోరం అడుగులు వేస్తుంది. ఈ ఫోరం భవిష్యత్తులో పొలిటికల్ టర్న్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే రాజ్యాంగంలో చెప్పిన విధంగా అందరి రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎదుగుదలకే ఇది పని చేస్తుంది'' అని సాంబశివరావు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Will the Kapu leaders put a seperate party putting aside Janasena
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X