విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

WIMA విశాఖపట్నం: 'బైక్స్ నడపడం మగవాళ్ల హక్కా? మేమూ రైడ్ చేస్తాం... దేశాన్ని చుట్టేస్తాం'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బైకులపై వీమా గ్రూప్

ఒక అమ్మాయి బుల్లెట్ మీద దూసుకెళ్తుంటేనే, చాలామంది ఆశ్చర్యంగా చూస్తారు. అలాంటిది 20 మంది మహిళలు 20 మోటార్ సైకిళ్లపై ఒకేసారి వెళ్తుంటే ఎలా ఉంటుంది? విశాఖలో అలా వెళ్లే ఒక మహిళల గ్రూప్ ఉంది.

ఈ గ్రూపులో లాయర్, టీచర్, డాక్టర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఇలా వివిధ రంగాలకు చెందినవారితోపాటూ, ఒక క్యాన్సర్ పేషెంట్, ఐఏఎస్ కావాలనుకునే ఒక యువతి కూడా ఉన్నారు. వీరంతా మోటార్ బైక్‌లపై ఇండియా టూర్‌కు సిద్ధమవుతున్నారు.

వీమా గ్రూప్

సరదాగా మొదలై...సేవగా మారింది

పుణెకు చెందిన 53 ఏళ్ల రిటైర్డ్ టీచర్ వైశాలి కులకర్ణి మోరేకు చిన్నతనం నుంచి బైక్ రైడింగ్ అంటే ఇష్టం. భారత నౌకాదళంలో ఉన్న ఆమె భర్త హరీశ్ మోరే ప్రస్తుతం విశాఖలో స్థిరపడ్డారు.

17 ఏళ్లపాటు టీచరుగా పనిచేసిన వైశాలి, వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని, గత ఐదేళ్లుగా మోటార్ సైకిల్ మీద వివిధ ప్రాంతాలు తిరుగుతూ, రకరకాల అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు.

53 ఏళ్ల వయసులో కూడా ఉత్సహంగా బైక్‌పై ప్రయాణిస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్న వైశాలిని చూసిన కొంతమంది యువతులు ఆమెకు తోడయ్యారు.

వీమా గ్రూప్

'ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మోటార్‌ సైకిల్‌ అసోసియేషన్‌ (వీమా) అనే అంతర్జాతీయ సంస్థలో తాను సభ్యురాలినని, విశాఖలో దాని బ్రాంచ్ ప్రారంభించానని వైశాలి బీబీసీకి చెప్పారు. అందులో 18 నుంచి 53 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఉన్నారని తెలిపారు.

"మేం ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుని కలిసికట్లుగా అనేక ప్రాంతాలకు బైకులపై వెళ్తుంటాం. వారానికి ఒక ప్రాంతానికి వెళ్తూ...అక్కడ సేఫ్ డ్రైవింగ్, క్యాన్సర్ అవేర్‌నెస్, స్వచ్ఛభారత్, చదువు, పొదుపు అవశ్యకత ఇలా రకరకాల అంశాలపై అవగాహన కల్పిస్తుంటాం. అలా మా సరదాతో పాటు, కొందరికైనా సేవ చేసినట్లు అవుతుంది" అన్నారు.

వైశాలి కులకర్ణి ఇప్పటివరకూ 33 వేల కిలోమీటర్లు తిరిగిన సోలో బైక్ రైడర్ గుర్తింపు పొందారు.

వీమా గ్రూప్

వద్దన్న పెదనాన్నే... ఎన్‌ఫీల్డ్ కొనిచ్చారు

వీమా గ్రూపులో ఉన్న మహిళలందరికి బైక్ రైడింగ్ మీద ఆసక్తితోనే అందులో చేరారు. అవి కూడా మామూలు మోటార్ సైకిళ్లు కాదు. ఈ మహిళలు ఎన్‌ఫీల్డ్, అవెంజర్, జావా లాంటి భారీ బైకులపై దూసుకెళ్తుంటారు.

ఈ గ్రూపులో ఉన్న కొందరికి మొదట్లో "బైక్‌ల మీద ఊళ్లు తిరగడమేంటి" అని కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైంది.

వీమా గ్రూప్

ఈ ఏడాదిలో మొత్తం ఇండియా అంతా తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్నామని బీబీసీకి చెప్పిన గ్రూప్ సభ్యురాలు నిత్య ఇంట్లో తనను మొదట బైక్ తాకనివ్వలేదన్నారు. నిత్య ప్రస్తుతం ఎంబీఏ చేస్తున్నారు.

"మా ఇంట్లో బైక్ తీస్తే కోప్పడేవారు. మా పెదనాన్నైతే బైక్ ముట్టుకుంటే సీరియస్ అయ్యేవారు. కానీ, మా ఉద్దేశం, మేం చేసే కార్యక్రమాలు ఆయనకు చెప్పాను. దాంతో, ఆయనే నాకు ఎన్‌ఫీల్డ్ కొనిచ్చారు. మేం ఏదో టూర్ వెళ్లినట్లు కాకుండా, ఎక్కడికి వెళ్తే అక్కడ వారికి ఏదైనా ఉపయోగపడేలా రకరకాల అంశాలపై అవగాహన కల్పిస్తాం" అంటున్న నిత్య తన బైక్‌ను గర్వంగా చూపిస్తారు.

వీమా గ్రూప్

'వై షుడ్ బాయ్స్ హావ్ ఆల్ ది ఫన్'

మహిళలు మోటార్ బైక్ నడుపుతుంటే, ముఖ్యంగా హెవీ బైక్స్ మీద వెళ్తుంటే చాలామంది వింతగా చూస్తుంటారు. అది మాకు ఇంకా విచిత్రంగా ఉంటుంది. బైక్ నడపడం ఏమైనా రాకెట్ సైన్సా అంటారు ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతున్న జయశ్రీ.

"బైక్ నడపడం అంటే మగవాళ్ల హక్కా...? మేం నడపలేమా...? ఇది బైకే కదా..మా అవసరాలు, సరదా కోసం రైడింగ్ చేస్తుంటాం. అబ్బాయిలు స్కూటీ నడిపితే మేం వింతగా చూస్తామా...? మరి మేం హెవీ బైకులు నడిపితే వాళ్లు అలా చూడ్డం ఎందుకు? బైక్ రైడింగ్ విషయమే కాదు, అన్నిటిలో వారి దృక్పథం మారాలి. అది మహిళలను చిన్నచూపు చూసినట్టే అనిపిస్తుంటుంది" అన్నారు.

బైక్ మీద వెళ్లి కరాటే శిక్షణ

తమకు తెలిసింది పంచుకుంటారు

బైక్ రైడింగ్ అంటే ఆసక్తి కొద్దీ ఈ గ్రూపులో చేరినా, తర్వాత గ్రూప్ సేవా కార్యక్రమాలు చూసి స్ఫూర్తి పొందానని, తనకు తెలిసిన కరాటేను అందరికీ నేర్పిస్తున్నానని బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ బీబీసీకి చెప్పారు.

"ఈ రోజుల్లో మహిళలకు ఆత్మరక్షణ చాలా అవసరం. నాకు కరాటే వచ్చు. నాకు తెలిసిన దానిని మా గ్రూప్ సభ్యులకు నేర్పించడంతోపాటూ, మేం వెళ్లే ప్రతి చోటా ఆసక్తి ఉన్న వారికి నేర్పిస్తుంటాను. అలాగే, మా గ్రూప్‌లో డాక్టర్ దగ్గర ఫస్ట్ ఎయిడ్, హెల్త్ టిప్స్ లాంటివి నేర్చుకున్నా. అలా మాలో ఒకరికి తెలిసినవాటిని ఇంకొకరం నేర్చుకుంటాం.. మరికొందరికి నేర్పుతాం" అంటారు రమ్యశ్రీ.

బైక్ మీద వెళ్తూ క్యాన్సర్ అవగాహన

ప్రయాణంలో క్యాన్సర్ అవగాహన

ఈ గ్రూపు మెంబర్ సుప్రియకు కూడా దేశమంతా బైక్ మీద ప్రయాణించిన అనుభవం ఉంది. ఆమె క్యాన్సర్‌ను జయించారు. క్యాన్సర్ గురించి, దాన్నుంచి ఎలా బయటపడ్డానో అందరికీ ఒక అవగాహన కల్పించడానికి బైక్ రైడింగ్ తనకు చాలా ఉపయోగపడిందని చెప్పారు.

"మూడేళ్ల క్రితం నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలియగానే... ఏం అర్థం కాలేదు. చికిత్స సమయంలో క్యాన్సర్ ఆలోచనల నుంచి బయటపడ్డానికి ఒక మార్గంగా బైక్ రైడింగ్ ఎంచుకున్నాను. విశాఖ నుంచి కన్యాకుమారి, గోవా వెళ్తూ... మధ్యలో ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు అవగాహన కల్పించాను. ఇది కొనసాగిస్తూనే ఉన్నాను. బైక్ రైడింగ్ అనేది నేను ఒక చెల్లిగా, తల్లిగా, భార్యగా కాకుండా సుప్రియగా నాకు నన్ను కొత్తగా పరిచయం చేస్తుంది" అన్నారు.

వీమా గ్రూప్

ఆర్థికసాయం కూడా చేస్తారు

వీమా గ్రూప్ తాము వెళ్లే ప్రతిదగ్గరా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటుంది. వారికి అసవరమైతే ఆర్థిక సాయం కూడా చేస్తుంది.

మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య ఎక్కువగా ఉందని, అందుకే తాము వెళ్లే చోట స్థానికులకు రోడ్ సెప్టీ గురించి అవగాహన కల్పిస్తున్నానని ఇదే గ్రూపులో ఉన్న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సృజన చెప్పారు.

"మా ప్రయాణం మధ్యలో అక్కడక్కడా ఆగి ప్రధానంగా రోడ్ సెఫ్టీ, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ గురించి వాహనదారులకు వివరిస్తుంటాం. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పొగొట్టుకోకుండా సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని చెబుతాం. మేం బైక్ రైడింగ్ చేసేటప్పుడు కూడా అన్ని నిబంధనలు పాటిస్తాం" అన్నారు.

టార్గెట్ ఇండియా టూర్

టార్గెట్ ఇండియా టూర్

బైక్ రైడింగ్ సరదాను తీర్చుకుంటూనే, సమాజానికి ఎంతోకొంత చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు వీమా సభ్యులు.

"ప్రస్తుత మా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ...ఈ ఏడాదిలో అందరం కలిసి ఇండియా టూర్ వెళ్లబోతున్నాం. విశాఖ మారుమూల పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాం. మా గ్రూపులో అందరం మాకు తెలిసిన పద్ధతిలో సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం. మాకు చేతనైన సాయం చేస్తున్నాం" అని మరో సభ్యులు చెప్పారు.

వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలపై ఉన్న ఆసక్తితోనూ వివిధ ప్రాంతాలకు వెళ్లడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్న ఈ మహిళా బృందం.. ఇలాంటి ప్రయాణాలు, సేవా కార్యక్రమాలతో తమకు కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం అందిస్తోందని చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
women ride bikes and say that they will travel around the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X