ఒకే వేదికపై మోడీ, ప్రధాని: పటేల్ అయి ఉంటే..
అహ్మదాబాద్: బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సోమవారం ఒకే వేదికపై దర్సనమిచ్చారు. వేదికను పంచుకున్నారు. భారత తొలి హోం మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్‌కు మ్యూజియాన్ని అంకితం చేసే కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. దేశ సమగ్రత అవసరాన్ని నరేంద్ర మోడీ నొక్కి వక్కాణించారు. హింసను వ్యతిరేకించారు.
ప్రధాని మన్మోహన్ సింగ్‌ను వేదిక మీదికి అహ్వానిస్తూ, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ తొలి ప్రధాని అయి ఉంటే దేశ పరిస్థితి భిన్నంగా ఉండి ఉండేదని మోడీ అన్నారు. పటేల్ భారత తొలి ప్రధాని అయి ఉంటే దేశ ముఖచిత్రం, పరిస్థితి వేరే విధంగా ఉండి ఉండేదని ఆయన అన్నారు. గుజరాత్‌లో కౌన్సిలర్‌గా ఉన్నప్పుడే 1919లో పటేల్ మహిళకు రిజర్వేషన్ల గురించి, పట్టణ ప్రణాళిక గురించి మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.

సుపరిపాలనకు గుజరాత్‌కు అవార్డులు ఇచ్చినందుకు కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కఠిన శ్రమ చేయడానికి ఆ అవార్డులు స్ఫూర్తినిచ్చినట్లు తెలిపారు. దేశ సమగ్రత కోసం పటేల్ అవిశ్రాంత కృషి చేశారని మోడీ ప్రశంసించారు. ఉగ్రవాదం లేదా మావోయిజం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని, అయితే ఆ ప్రయత్నాలు ఫలించవని ఆయన అన్నారు. గాంధీ, పటేల్ భూమిలో తుపాకులు, బాంబులు పనిచేయవని ఆయన అన్నారు.
తప్పుడు పంథాలోకి వెళ్లినవారు తిరిగి వచ్చి దేశ అభివృద్ధికి, పెరుగుదలకు కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications