ఈసీ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ -ఆ ఎంపీ సీటు నేరుగా బీజేపీ ఖాతాలోకి..
135ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గడిచిన అర దశాబ్దకాలంగా ఘోరమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హస్తం గుర్తు పార్టీకి తాజాగా మరో బిగ్ షాక్ తప్పేలా లేదు. ఎన్నికల సంఘం(ఈసీ) తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ తన ఖాతాలోని రాజ్యసభ సీటును కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి కారణంగా ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఇప్పుడు బీజేపీ వశంకాబోతున్నది.
ఇటీవల గుజరాత్‌లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు విడి విడిగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సమాయత్తం కావడంతో.. కాంగ్రెస్ ఓటమి దాదాపు ఖరారైంది. గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 71 ఏళ్ల అహ్మద్ పటేల్ గత నెల నవంబర్ 25న కన్నుమూశారు. ఆయన పదవీకాలం 2023 ఆగస్టు 18 వరకు ఉంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు అభయ్ భరద్వాజ్ ఈ నెల 1న మృతి చెందారు. ఆయన పదవీకాలం 2026 జూన్ 21 వరకు ఉంది. ఈ ఇద్దరూ కరోనా అనంతర ఆరోగ్య సమస్యల కారణంగానే మృతి చెందారు.

ఈ ఇరువురు నేతల మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు విడివిడిగా ఉపఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించగా... ఇది బీజేపీకి ఉపకరించేలా, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి శరాఘాతంలా ఉండటం గమనార్హం. గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 111 మంది ఎమ్మెల్యేలు ఉండగా... కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అభ్యర్థుల విజయం కోసం 50 శాతం ఓట్లు... అంటే 88 మంది ఎమ్మెల్యేలు అవసరం.
రెండు రాజ్యసభ స్థానాలకు విడివిడిగా ఉపఎన్నికలు జరగనుండడంతో.. బీజేపీ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకేనని చెబుతున్నారు. అయితే సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటుతో దామాషా పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగితే గుజరాత్‌లో రెండు స్థానాలకు గానూ ఒక స్థానాన్ని కచ్చితంగా తిరిగి సాధించుకునే అవకాశం ఉండేదని కాంగ్రెస్ వర్గాలు వాదిస్తున్నాయి.












Click it and Unblock the Notifications