మోడీ పోటీ చేయట్లేదు: ట్విస్ట్, ఓటమి అంగీకారమా? బీజేపీ గెలుస్తుందని సర్వే
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేలు అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఢిల్లీ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు రెఫరెండం కాదని బీజేపీ చెబుతోంది. తద్వారా బీజేపీయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని పరోక్షంగా అంగీకరిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం నాడు ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఏమాత్రం రెఫరెండం కాదన్నారు. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి కోసం జరుగుతున్నాయని, ప్రధాని కోసం కాదన్నారు. నరేంద్ర మోడీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ఇతర పార్టీలే అని చెప్పారు.

ట్విస్ట్.. బీజేపీకే మొగ్గు: ఐబీఎన్ సర్వే
ఢిల్లీ అసెంబ్లీ సర్వేల్లో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు బీజేపీదే పీఠం అని సర్వేలు చెప్పాయి. ఈ రోజు సర్వేలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పింది. తాజాగా మరో ట్విస్ట్. ఐబీఎన్ సర్వేలో కమలం గెలుస్తుందని చెప్పింది. ఐబీఎన్ 7, డేటా మెనేరియా సర్వేలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 36, ఏఏపీ 27, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుస్తాయని చెప్పింది.












Click it and Unblock the Notifications