మరణించిన భర్త వీర్యంతో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ...
మరణించిన భర్త వీర్యంతో ఓ 48 ఏళ్ల మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ తల్లిబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని భీర్ భూమ్ జిల్లాలో జరిగింది. ఆ మహిళ భర్త రెండేళ్ల కిత్రం కరోనాతో మరణించారు. IVF పద్ధతి ద్వారా ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు.
కరోనాతో మరణించిన భర్త: భీర్ భూమ్ జిల్లాలో మురారై ప్రాంతానికి చెందిన సంగీత, అరుణ్ ప్రసాద్ కు సుమారు 27 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ సంగీతకు గర్భాశయంలో సమస్యలు ఉండడం వల్ల ఆమెకు సంతానం కలిగే అదృష్టం లేదని డాక్టర్లు చెప్పారు. దాంతో ఈ దంపతులిద్దరూ IVF విధానంలో పిల్లల్ని కనాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం సంగీత భర్త అరుణ్ ప్రసాద్ వీర్యాన్ని కోల్ కతాలోని ఓ ల్యాబ్ లో భద్రపరచడం జరిగింది.

అయితే అదే ఏడాది అరుణ్ కరోనా మహామ్మారి బారిన పడి మరణించాడు. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది సంగీత. భర్త చనిపోవడంతో నా అనుకునే వాళ్లు ఎవరూ లేరని భాదను దిగమింగుకోవాలనుకుంది. భర్త ప్రతి రూపాన్ని తన బిడ్డలోనైనా చూసుకోవాలని ఐవిఎఫ్ పద్ధతితో ఓ బిడ్డను కనాలనుకుంది. అనుకున్నదే తడవుగా వైద్యులను సంప్రదించింది.
ఒంటరిగా బతుకు సాగిస్తున్న సంగీత: సంగీత తన భర్త వీర్యాన్ని తన అండంలో ప్రవేశపెట్టి IVF పద్ధతి ద్వారా బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. అలా IVF పద్ధతిలో అరుణ్ ప్రసాద్ వీర్యాన్ని సంగీత అండంలోకి ప్రవేశపెట్టడం వల్ల ఆమె గర్భవతి అయ్యింది. డిసెంబరు 12న రాంపుర్ హాట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో సంగీత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
సంగీత కుమారుడు రెండున్నర కేజీల బరువుతో జన్మించాడని ఆస్పత్రి సిబ్బంది పేర్కొన్నారు. భర్త మరణం తర్వాత సంగీతను అత్తింటివారు పట్టించుకోలేదని, ప్రస్తుతం ఆమె ఒంటరిగా జీవిస్తోందని, ఇలాంటి సమయంలో కూడా ఆమె వెంట ఎవరూ లేరని స్థానికులు చెబుతున్నారు. అరుణ్ దుకాణ షాప్ నడిపేవాడని, అతడి మరణాంతరం సంగీతనే ఆ దుకాణాన్ని నడుపుతోందని స్థానికులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications