కిరాతకం: స్త్రీని వివస్త్రను చేసి గాడిద పైన ఊరేగించారు
జైపూర్: రాజస్థాన్‌లో అత్యంత సిగ్గుచేటయిన సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని రాజ్సమంద్ జిల్లాలోని గిరిజన ప్రాంతంలో కమ్యూనిటీ పంచాయతీ సభ్యులు ఓ మహిళ ముఖానికి బొగ్గు పూసి, వివస్త్రను చేసి ఆమెను గాడిదపై ఊరేగించారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది.
తన సమీప బంధువును మహిళ చంపిందని ఆరోపిస్తూ కమ్యూనిటీ పంచాయతీ ఆమెకు ఆ శిక్ష విధించింది. ఈ సంఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు 30 మందిని అరెస్టు చేశారు. వారిలో 9 మంది బాధితురాలి కుటుంబానికి చెందినవారే.

మహిళను తాత్కాలికంగా శరణాలయానికి మార్చినట్లు, ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తుర్వాల్ అనే గ్రామంలో చోటు చేసుకుంది. నవంబర్ 2వ తేదీన వర్దీ సింగ్ అనే వ్యక్తి మరణించాడు. అయితే, అతని మరణానికి కారణాలేమిటనేది తెలియదు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా అతని శవానికి అంత్యక్రియలు నిర్వహించారు.
వర్ధి సింగ్ భార్య బాధితురాలిపై ఆరోపణ చేసింది. ఆ ఫిర్యాదుతో ఆమె స్థానిక కమ్యూనిటీ పంచాయతీ వద్దకు వెళ్లింది. దాంతో గ్రామంలో సమావేశం పెట్టి ఆరోపణలు ఎదుర్కుంటున్న మహిళనే అతన్ని చంపిందని కమ్యూనిటీ పంచాయతీ తీర్పు చెప్పింది. గ్రామం మధ్యలో మహిళను వివస్త్రను చేసి గాడిదపై ఊరేగించారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications