వివాహేతర సంబంధం: నగ్నంగా మహిళ ఊరేగింపు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జస్పూర్‌లోని ఫర్సాబాహర్ ప్రాంతంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో ఓ మహిళ(32)ను చితకబాదిన గ్రామస్తులు, ఆమె దుస్తులను విప్పించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ దారుణ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బాధితురాలు తన నివాసంలో ఉన్న సమయంలో శనివారం రాత్రి తన ఇంటికి వచ్చిన పది మందికిపైగా గ్రామస్తులు, ఓ మహిళా వెంట తెచ్చుకున్న కర్రలతో ఆమెను చితకబాదారు. బాధితురాలు చెప్పేది వినకుండా జట్టు పట్టుకుని బయటికి లాగారు. ఆ తర్వాత ఆమెను చితకబాదుతూ బట్టలు ఊడదీసిన గ్రామస్తులు, ఆమెను వీధుల వెంట పరుగెత్తించారు.

రెండు గంటలపాటు ఘటన కొనసాగింది. చివరకు గ్రామ పెద్ద వద్దకు వరకు విషయం వెళ్లింది. కాగా, ఆ గ్రామ సర్పంచ్ పంఖీర తిర్కీ కథనం ప్రకారం.. రావత్ కులానికి చెందిన బాధిత మహిళ.. మరో కులానికి చెందిన వివాహితుడైన వ్యక్తితో శరీరక సంబంధం ఏర్పర్చుకుంది. బాధిత మహిళ భర్తకు, కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసినప్పటికీ వారు ఆ మహిళను ఏమి అనలేదు.
కాగా, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి భార్య మాత్రం వీరి అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించి బాధిత మహిళపై దాడి చేసింది. బాధిత మహిళను ఆమె భర్త రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అతనిపై కూడా గ్రామస్తులు దాడి చేశారని గ్రామ పెద్ద తెలిపాడు. ఇది గ్రామానికి సంబంధించిన అంశమని పోలీసులకు, మీడియాకు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. అయితే ఈ విషయం పోలీసుల వరకు వెళ్లిందని తెలిపాడు. బాధిత మహిళ, అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అంగీకరిస్తే వారికి వివాహం జరిపిస్తామని అతడు చెప్పాడు. కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదు.












Click it and Unblock the Notifications