Women Bill : మహిళా బిల్లుపై కేంద్రానికి చుక్కలు-కోటా తెరపైకి తెచ్చిన విపక్షం-తక్షణ అమలుకూ..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం ద్వారా విపక్షాలకు ఏమాత్రం మైలేజ్ దక్కకుండా చేయాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఇవాళ ఉభయసభల్లో ఎదురుదెబ్బలు తప్పలేదు. కేంద్రం లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్దమవుతుండగా.. విపక్షాలు మాత్రం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు లేకుండా ఎలా అని ప్రశ్నిస్తున్నాయి. అలాగే మహిళా బిల్లు వెంటనే అమలు చేయాలని కోరుతున్నాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో కొనసాగుతున్న చర్చలో ప్రతిపక్ష పార్టీలు ఇందులో ఓబీసీ కోటా కల్పించాలనే డిమాండ్ తో పట్టుబట్టాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయం చర్చను ప్రారంభించిన సోనియా గాంధీ.. ఈ బిల్లును అమలు చేయడంలో ఎలాంటి జాప్యం చేయకూడదని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కూడా ఇందులో ప్రత్యేక కోటా కల్పించాల్సిందేనని కోరారు. ఇందుకోసం కులగణన కూడా నిర్వహించాలని కోరారు. అలాగే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో బిల్లును వ్యతిరేకించారు. దీన్ని ఓ ప్రత్యేక, ముస్లిం వ్యతిరేక చట్టమని పేర్కొన్నారు.

జనాభా గణన తర్వాత, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం కోటా అమలువుతుందనని కేంద్రం పేర్కొనడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జాప్యాన్ని శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తప్పుబట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వస్తుందని తెలియగానే చిగురించిన ఆశలు కాస్తా 24 గంటల్లో గల్లంతు అయ్యాయన్నారు. టీఎంసీ ఎంపి మహువా మోయిత్రా కూడా ప్రభుత్వం ఈ లెక్కల కోసం బిల్లు అమలును ఆలస్యం చేస్తారా అని ప్రశ్నించారు.

డీఎంకే ఎంపి కనిమొళి కూడా మహిళా బిల్లు విషయంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. బిల్లుపై ఏకాభిప్రాయం ఏర్పడిందని, ఏ చర్చలు జరిగాయో తాను తెలుసుకోవాలనుకుంటున్నానని కేంద్రానికి తెలిపారు. ఈ బిల్లును గోప్యంగా ఉంచారని విమర్శించారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూడా తన పార్టీ తరపున బిల్లుకు మద్దతుగా నిలిచారు. అయితే బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా ఉండాల్సిందేనన్నారు. దీని కోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని ప్రతిపాదించారు.












Click it and Unblock the Notifications