నీతో పనేంటి- ఆర్టీసీ బస్ నుంచి కండక్టర్‌ను గెంటేసిన మహిళా ప్రయాణికులు
బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు.
ఈ నెల 11వ తేదీన కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని కింద మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో ఆధార్ కార్డ్, ఓటరు కార్డు లేదా తాము కర్ణాటకలో నివసిస్తోన్నట్లు రుజువు చేసే ఏదైనా ఇతర గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది.

ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తరువాత అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటోన్నాయి. ప్రత్యేకించి- బస్ కండక్టర్ల పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా తయారవుతోంది. బస్సు మొత్తాన్ని మహిళా ప్రయాణికులు ఆక్రమించేసుకోవడంతో ఇక మిగిలిన వారికి టికెట్లు ఇవ్వలేని దుస్థితిని ఎదుర్కొంటోన్నారు. సంయమనాన్ని కోల్పోతున్నారు. ధార్వాడ జిల్లాలోని హుబ్లీలో ఓ ప్రయాణికురాలిపై మహిళా కండక్టర్ చేయి చేసుకోవడం.. దీనికి నిదర్శనం.
కుండ్గోల్ నుంచి హుబ్లీకి బయలుదేరిన బస్సులో సీట్ల విషయంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో ఓ ప్రయాణికురాలు.. మహిళా కండక్టర్‌తో గొడవపడ్డారు. ఇద్దరి మధ్యా మాటమాట పెరిగింది. దీనితో మహిళా కండక్టర్ ఆ ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించారు. దీనితో తోటి ప్రయాణికులు..కండక్టర్‌తో గొడవ పడ్డారు. చివరికి డ్రైవర్ కొన్ని నిమిషాల పాటు బస్సును నిలిపివేసి, వారిని సర్దిచెప్పాల్సి వచ్చింది.

సరిగ్గా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. కొందరు మహిళలు- ఏకంగా కండక్టర్‌ను బస్సులో నుంచి బయటికి పంపించేశారు. టికెట్ తీసుకోవాల్సిన అవసరమే లేనప్పుడు నీతో మాకు ఏం పని అంటూ నిలదీశారు. టికెట్ తీసుకోవాల్సిందేనని, ఎంతమంది ప్రయాణించారనేది డిపో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుందంటూ కండక్టర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.

ఒకదశలో ప్రయాణికులు.. కండక్టర్‌ను డోర్ నుంచి బయటికి గెంటివేయడం కనిపించింది. తనపై మహిళ ప్రయాణికులు దౌర్జన్యానికి దిగడంతో ఆగ్రహానికి లోనైన కండక్టర్ కూడా వారిపై చెయ్యి చేసుకున్నాడు. ఆ సమయంలో డ్రైవర్ బస్సును నిలిపివేసి, వారిని సర్దిచెప్పారు. ఇలాంటి విపరీత పరిణామాలు కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో నిత్యకృత్యమైపోతున్నాయి. కొద్దిరోజుల కిందటే మహిళలు ఆర్టీసీ బస్ డోర్‌ను విరగొట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications