ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం- ఒక్కరోజులో 60 లక్షలమంది మహిళలు: రూ.14 కోట్లు లాస్
బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వారంతాపు రోజుల్లో పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని పూర్తిగా వినియోగించుకుంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు.
ఈ నెల 11వ తేదీన కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని కింద మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో ఆధార్ కార్డ్, ఓటరు కార్డు లేదా తాము కర్ణాటకలో నివసిస్తోన్నట్లు రుజువు చేసే ఏదైనా ఇతర గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది.

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌డబ్ల్యూ ఆర్టీసీ), కళ్యాణ కర్ణాటక/నార్త్ ఈస్ట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఈశాన్య ఆర్టీసీ) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. రాజహంస, వజ్ర, వాయు వజ్ర, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఎఫ్‌టి బస్, ఈవీ పవర్ ప్లస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించగా.. అదే రోజు రాత్రి 12 గంటల వరకు 5,71,023 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. కేఎస్ఆర్టీసీ- 1,93,831, బీఎంటీసీ- 2,01,215, నార్త్ వెస్ట్ కర్ణాటక ఆర్టీసీ- 1,22,354, కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ (నార్త్ ఈస్ట్ ఆర్టీసీ)- 53,623 మంది మహిళలు ప్రయాణించారు. టికెట్ల రూపంలో ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం 1,40,22,878 రూపాయలు.

ఈ నెల 24వ తేదీన అంటే శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారి సంఖ్య కోటిని దాటేసింది. మొత్తం ప్రయాణికుల సంఖ్య.. 1,06,09,835. ఇది రికార్డ్. ఇందులో 58,14,524 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇదీ రికార్డే. కేఎస్ఆర్టీసీ చరిత్రలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎప్పుడూ ప్రయాణికుల ఆక్యుపెన్సీ నమోదు కాలేదు.

శనివారం ఒక్కరోజులో ప్రయాణించిన మహిళల సంఖ్య.. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో 17,29,314, బీఎంటీసీ- 18,95,144, నార్త్ వెస్ట్ కర్ణాటక ఆర్టీసీ- 14,01,910, కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ (నార్త్ ఈస్ట్ ఆర్టీసీ)- 7,88,156. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించిన నేపథ్యంలోవారి నుంచి టికెట్ల రూపంలో ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం 13,41,21,638 రూపాయలను ఆర్టీసీ కోల్పోయినట్టయింది. దీన్ని ప్రభుత్వం రీఎంబర్స్ చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications