• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ ఏనుగుల దినోత్సవం: ఇక్కడ మనుషులతో కలిసి గజరాజులు ఎలా హాయిగా జీవిస్తున్నాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గణేశన్

కొన్నేళ్ల కిందట 'తర్ష్ థెకీకరా' భారతదేశంలోని ఒక కొండమార్గంలోంచి తన కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక భారీ ఏనుగు కనిపించింది. దంతాలు లేని ఆ మగ ఏనుగు ఆయనవైపే నడుచుకుంటూ వస్తోంది.

''అక్కడ 'యు' టర్న్ తీసుకోవడానికి సరిపడా స్థలం లేదు. నేను వెంటనే కారు నుంచి బయటకు దూకి వెనక్కు పరుగెత్తాను'' అని తర్ష్ ఆనాటి ఘటనను బీబీసీతో చెప్పారు.

'ఏనుగుకు సమీపంలోకి వెళ్తే దాడి చేస్తుంది. వాహనంలోనే ఉంటేనే దాడి చేస్తానన్నట్లుగా బెదిరిస్తుంది''

కానీ, అప్పుడు తర్ష్ భయం చూసి అక్కడ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పిల్లలు నవ్వారు.

'భయపడకండి.. ఈ ఏనుగు ఆవులాంటిది. ఏమీ అనదు. అది నీరు తాగడానికి వస్తోంది. మిమ్మల్నేమీ చేయదు'' అన్నారు ఆ పిల్లలు.

వారు చెప్పింది నిజమే అది నన్నేమీ అనకుండా నీరు తాగడానికి వెళ్లిపోయింది.

అప్పటికే ఏనుగులపై అధ్యయనం చేస్తున్నతర్ష్‌కు ఆ ఏనుగు ప్రవర్తన భిన్నంగా అనిపించి మరింత లోతుగా అధ్యయనం చేయాలనుకున్నారు.

తమిళనాడులోని నీలగిరి జిల్లా గుడలూరులో తర్ష్‌కి ఈ అనుభవం ఎదురైంది.

ఏనుగులు పట్టణాల్లోకి వచ్చేసి ఉంటున్నాయి

తర్ష్‌కి ఎదురుపడిన ఆ ఏనుగును అక్కడి పిల్లలు గణేశన్ అని పిలుస్తారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఏనుగులు తిండి, నీరు కోసం మనుషులు నివసించే ప్రాంతాల్లోకి వస్తుంటాయి.

అడవులకు సమీపంలోనే ఉండే పట్టణాల్లోకి కూడా ఏనుగులు వస్తుంటాయి. అవి మనుషులతో కలిసి జీవించడానికి అలవాటుపడుతున్నాయి. ఏడాదిలో ఎక్కువ కాలంలో పట్టణాల్లో గడపడానికి ఇష్టపడుతున్నాయి.

రోడ్డు పక్కన పడుకున్న గణేశన్

గుడలూరు, దాని చుట్టుపక్కల పల్లెల్లో సుమారు 2,50,000 జనాభా నివసిస్తారు. ఈ ప్రాంతం చుట్టూ 500 చదరపు కిలోమీటర్ల మేర అడవులున్నాయి. ఆ అడవుల్లోనే టీ, కాఫీ తోటలున్నాయి. సుమారు 150 ఏనుగులకు ఆవాసం ఆ అడవి.

వాటిలో కొన్ని పట్టణాల్లోకి రావడానికి అలవాటుపడ్డాయి. గణేశన్ లాంటి ఏనుగులైతే వాటిని తరమడానికి బాణసంచా కాల్చినా, పెద్దపెద్ద శబ్దాలు చేసినా కూడా బెదరవు, ఎవరినీ ఏమీ అనవు.

ఇదంతా తర్ష్‌కు కొత్తగా ఉంది. ఏనుగులపై ఆయన అధ్యయనం చేస్తున్నప్పటికీ ఇలాంటి ఏనుగులు అంతవరకు ఆయనకు తారసపడలేదు.

దీంతో వాటి నుంచి పారిపోవాలని కానీ వాటితో పోరాడాలని కానీ ఆయన అనుకోలేదు. వాటి గురించి మరింత తెలుసుకోవాలనుకున్నారు.

అడవి ఏనుగులను మచ్చిక చేసుకోవడం, వాటికి శిక్షణ ఇవ్వడాన్ని అనేక జంతు హక్కుల సంఘాలు ఖండిస్తాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి శిక్షణలు, మచ్చిక చేసుకోవడాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇందుకు నెలల తరబడి సమయం పడుతుంది. మచ్చిక చేసుకునే, శిక్షణ ఇచ్చే ప్రక్రియలో భాగంగా నెలల తరబడి వాటిని ఏకాంతంగా ఉంచడం, హింసించడం వంటివి చేస్తుంటారు. మావటి లేదా శిక్షకుడికి ఏనుగు విధేయంగా ఉండేంతవరకు దానికి ఈ శిక్షలు, శిక్షణలు తప్పవు.

అయితే, తర్ష్ చూసిన ప్రకారం అడవి ఏనుగులు వాటంతట అవే మనుషులతో సహజీవనం చేయడం నేర్చుకోగలవని అర్థమవుతుంది.

గణేశన్

అన్నీ ముసలి మగ ఏనుగులే..

'గుడలూరు ఎలిఫెంట్ మానిటరింగ్ ప్రాజెక్ట్' ప్రధాన అధ్యయనకర్తగా తర్ష్ ఈ ప్రాంతంలోని అన్ని ఏనుగులను అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మనుషుల మధ్య తిరుగుతున్న అయిదు ఏనుగులు సహా మొత్తం 90 అడవి ఏనుగులను ఆయన నిశితంగా గమనించారు.

ఇందులో భాగంగా ఆయన ఒక ముఖ్యమైన విషయం గుర్తించారు. పట్టణాల్లోకి వస్తున్నవన్నీ వయసు మళ్లిన మగ ఏనుగులేనని తర్ష్ గుర్తించారు.

తిండి, నీరు సులభంగా సంపాదించడం కోసం అవి జనావాసాల్లోకి వచ్చి మనుషులలో కలుస్తున్నట్లు తెలుసుకున్నారు.

ఒక్క గణేశన్‌నే మూడేళ్ల పాటు ట్రాక్ చేయగా ఆ ఏనుగు అస్సలు అడవిలోకి వెళ్లలేదని గుర్తించారు. పూర్తిగా ప్రజల మధ్యే ఉంది. రోజూ రోడ్ల పక్కనే నిద్ర పోవడం.. ఆ మార్గంలో వచ్చే బస్సులు, ట్రక్కులలోకి తన తొండం చాపి ఆహారం అడగడం చేస్తుంది. అప్పుడప్పుడు 'టుక్ టుక్'(చిన్న మూడు చక్రాల వాహనాలు)లు, కార్ల అద్దాలు ధ్వంసం చేయడం వంటివి మాత్రం చేసింది.

ఇళ్ల వద్ద ఏర్పాటు చేసుకునే నీటి తొట్టెలు, ట్యాంకుల నుంచి కూడా నీరు తాగడం గణేశన్‌కు అలవాటు.

ఒక్కోసారి అది టీ ఎస్టేట్‌లలో పనులకు ఆటంకం కలిగిస్తుంది. ట్రాఫిక్‌కూ అంతరాయం కలిగిస్తుంది. దుకాణాల నుంచి పండ్లు, కూరగాయలు ఎత్తుకెళ్తుంది. కానీ, ఎవరినీ గాయపరచడం వంటివి మాత్రం చేయలేదు.

గుడలూరు అటవీ రేంజ్ మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న బయోస్పియర్ రిజర్వ్‌లో భాగం. ఆ మొత్తం రిజర్వ్ ఏరియాలో ఏనుగుల సంఖ్య 6 వేల కంటే ఎక్కువే ఉంటుంది.

భారత్‌లోని రక్షిత అభయారణ్యాలలో ఒకటైన గుడలూరు రేంజ్‌లో పులులు కూడా ఉంటాయి.

తర్ష్ అంచనా ప్రకారం దక్షిణ భారతదేశంలో సుమారు 20 ఏనుగులు ఇలా పట్టణాలలో నివసిస్తున్నాయి.

రివాల్డో అనే మరో ఏనుగు ఇలాగే ఊటీలో నివసిస్తోంది.

రివాల్డో ఓ వ్యక్తి నుండి చికెన్ బిర్యానీని లాక్కొని తింటున్న వీడియో కొద్దికాలం కిందట వైరల్‌గా మారింది.

దీనికి గల కారణాలను ఏనుగుల పరిశోధకుడైన తర్ష్ వివరించారు.

''ఏనుగులు అన్నం, ఉప్పును ఇష్టపడతాయి. అందుకే ఆ ఏనుగు బిర్యానీ పొట్లం లాక్కుంది. అయితే, శాకాహారి అయిన ఏనుగు లాక్కున్న ఆ బిర్యానీలో చికెన్ ఉండడం యాదృచ్ఛికం'' అన్నారు తర్ష్.

మామూలుగా అయితే అడవుల్లో ఏనుగులు నీరు, ఆహారం వెతుక్కోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ, పట్టణాలల్లో వాటికి కావాల్సినవి సంపాదించడానికి రెండు గంటల కంటే తక్కువ సమయమే పడుతోందని తర్ష్ చెప్పారు.

పంటలు, వండిన ఆహారాన్ని తినడం వల్ల ఎక్కువ కేలరీలు అందుతాయి.. అందువల్ల తరచుగా తినాల్సిన అవసరం వాటికి రాదని తర్ష్ అంటారు.

అయితే, ఇలాంటి ఆహారంలో పోషక విలువలు సరిపడా ఉండకపోవడం, ఆహారం కోసం ఈ ఏనుగులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకపోవడం.. రోజంతా రోడ్ల పక్కన కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గి పరిమాణంలో అడవి ఏనుగుల కంటే పెద్దవిగా ఉంటున్నాయని ఆయన చెప్పారు.

ఏనుగు

మనుషులు కూడా సర్దుకుపోవాలి

మనుషుల మధ్య తిరుగుతున్న తరువాత ఏనుగులు ఎలా అయితే మారాయో తామూ అలాగే మారాలని స్థానికులు గ్రహించారు.

భరదాన్ అనే ఓ పెద్ద ఏనుగు గుడలూరు ప్రాంతంలోని తొరపల్లిలోని ఓ రెస్టారెంట్‌కి క్రమం తప్పకుండా వస్తుంది.

ఇప్పుడా రెస్టారెంట్ వారు తమ వద్ద మిగిలిన ఆహారమంతా ప్రత్యేకంగా ఈ ఏనుగు కోసమే ఉంచుతారు. అది రాగానే అందిస్తారు.

అక్కడి మిగతా రెస్టారెంట్ యజమానులు కూడా కూరగాయల వ్యర్థాలు, భోజనాలు వడ్డించిన అరటి ఆకులను ఆ ఏనుగు కోసం ఉంచుతున్నారు.

తొరపల్లిలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా తొలిసారి భరదాన్‌ను చూసినప్పటి సంగతిని తర్ష్ గుర్తు చేసుకున్నారు.

రెస్టారెంట్ దగ్గర భరదాన్

''ఏనుగు తినడం ప్రారంభించగానే దాని చుట్టూ జనం గుమిగూడారు. కొందరు ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. ఆ గుంపులోని ఓ కొంటె యువకుడు మంచి ఫొటో పట్టాలన్న తాపత్రయంతో ఏనుగు తనవైపు తిరిగేలా చేయడానికి దాని తోక లాగాడు. కానీ, అది తిరగలేదు. తన వెనక కాలిని మాత్రం విసిరింది. మళ్లీ తిండి తినడంలో మునిగిపోయింది. అదే ఇంకెక్కడైనా అయితే అలా ఏనుగు తోక లాగితే ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలియదు''

భరదాన్ శాంత స్వభావం వల్ల దానికి మంచి పేరు వచ్చింది. స్థానికులు దాన్ని తమ పెంపుడు జంతువులా చూస్తారు.

అయితే, ఆ తరువాత మరో రెండు చిన్న మగ ఏనుగులు దానితో కలిశాయి. అవి భరదాన్‌లా కాకుండా తిండి కోసం దుకాణాల షట్టర్లు ఎత్తడం, కిటికీలు పగలగొట్టడం, ప్రజలను వెంబడించడం వంటివి చేస్తూ భయం సృష్టించాయి.

రివాల్డో

ఏనుగులు పట్టణంలోకి వస్తే ప్రజల ప్రాణాలకు ఏమైనా అవుతుందేమోనని స్థానిక అటవీ సిబ్బంది భయపడ్డారు. ఊటీలో తిరుగుతున్న రివాల్డోను మళ్లీ అడవిలోకి పంపించాలనుకున్నారు.

అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.

ఓ వ్యక్తి పనస పండు ఇవ్వడంతో రివాల్డోకి ఊటీలోకి రావడం అలవాటైంది. పనస పండు తిన్న తరువాత కూడా అది అక్కడి నుంచి కదిలేది కాదు.

మెల్లమెల్లగా అక్కడి రిసార్టుల యజమానులు కూడా రివాల్డోకు తిండి పెట్టేవారు. ఏనుగు కనిపిస్తే పర్యటకులకు ఆకర్షణగా ఉంటుందన్నది వారి ఆలోచన. ఇవన్నీ కలిసి రివాల్డో ఊటీలో తిష్ఠ వేసేలా చేశాయి.

మెల్లమెల్లగా ఏనుగు, స్థానికులు కూడా ఒకరంటే ఒకరికి ఉన్న భయం పోగొట్టుకున్నారు.

కానీ, అటవీ సిబ్బంది మాత్రం అడవి ఏనుగులు తమ సహజ స్వభావంతో ఎప్పుడైనా మనుషులపై దాడి చేసే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన నిత్యం రివాల్డోను అడవిలోకి పంపించే ప్రయత్నం చేస్తుంటారు.

ఏనుగులను తరమడంలో శిక్షణ పొందిన మరికొన్ని ఏనుగులను ఉపయోగించి వారు రివాల్డోను పదేపదే అడవిలోకి పంపిస్తుంటారు. కానీ, అది మళ్లీమళ్లీ వచ్చేస్తుంటుంది.

ఒకసారి అడవిలో బాగా దూరం తీసుకెళ్లి విడిచిపెట్టారు. కానీ, అది 24 గంటల్లోనే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఊటీలోకి వచ్చేసింది.

రివాల్డో గత 15 ఏళ్లుగా ఊటీలోనే ఉంటోందని తర్ష్ చెప్పారు.

నీలగిరి అటవీ ప్రాంతంలో ఏనుగులు

ఏనుగుల దాడిలో పోతున్న ప్రాణాలు

అడవి ఏనుగులు సాధారణంగా మనుషులపై దాడి చేస్తుంటాయి. గుడలూరు అటవీ రేంజ్‌లో ఏనుగుల దాడిలో 75 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ, పట్టణవాసానికి అలవాటు పడిన ఏనుగుల వల్ల మాత్రం ఒక మరణమే నమోదైంది.

అలా మరణానికి కారణమైన పట్టణ ఏనుగు పేరు జేమ్స్ లారిస్టన్. అది కూడా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా ప్రజలు చెబుతారు. అది ఉద్దేశపూర్వకంగా దాడి చేసి చంపలేదంటారు.

భారతదేశంలో సుమారు 27,000 ఏనుగులు ఉన్నాయి. వాటిలో చాలావరకు రక్షిత అటవీ ప్రాంతాల వెలుపల కూడా నివసిస్తున్నాయి.

భవిష్యత్తులో ఏనుగులు, మనుషుల సహజీవనం మరింత పెరుగుతుందని.. ఏనుగులు, మనుషులు కలిసి జీవించే విధానం వివిధ జీవజాతుల మనుగడకు తోడ్పడుతుందని తర్ష్ అంటారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న తర్ష్ మరిన్ని ఏనుగులు అడవుల నుంచి జనజీవనంలోకి రావడం పెరుగుతుందని అంటున్నారు.

తర్ష్‌కి తొలిసారి తారసపడిన ఏనుగు గణేశన్ ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారిపడి మరణించింది.

దాన్ని అటవీ సిబ్బంది ఖననం చేశారు. తమతో పాటు ఎనిమిదేళ్లు కలిసి జీవించిన గణేశన్‌కు స్థానిక ప్రజలు మనుషులకు చేసినట్లే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
World Elephant Day: How do elephants live comfortably with humans here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X