• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిదంబరం అరెస్టయితే వైసీపీ శ్రేణుల సంబరాలెందుకు..? సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది..?

|

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. తనకు ఏ పాపం తెలియదని అరిచి గీ పెడుతున్నప్పటికీ... ఈడీ అధికారులు మాత్రం ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఎలాగైనా సరే అరెస్టు నుంచి బయటపడాలని చేసిన ప్రతి ప్రయత్నం బెడిసి కొట్టడంతో అజ్ఞాతంలో ఉన్న చిదంబరం బయటకు రాక తప్పలేదు. వెంటనే సీబీఐ అధికారులు రంగంలోకి దిగి అరెస్టు చేయడం జరిగింది. అయితే చిదంబరం అరెస్టు అయ్యారన్న సంగతి తెలుసుకున్న వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకీ చిద్దూ అరెస్టుకు వైసీపీ శ్రేణుల సంబరాలకు సంబంధం ఏముంది..?

చిదంబరం అరెస్టుతో సంబరాల్లో వైసీపీ శ్రేణులు

చిదంబరం అరెస్టుతో సంబరాల్లో వైసీపీ శ్రేణులు

అది 2011వ సంవత్సరం. ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని విచారణ పేరుతో పిలిచిన సీబీఐ ఆయన్ను అరెస్టు చేయడం జరిగింది. ఒక్కసారిగా వైసీపీ అభిమానులు, రాజశేఖర్ రెడ్డి అభిమానులు షాక్‌కు గురయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ వెళ్లిపోయాక... ఆ కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. కొన్నేళ్ల పాటు కాంగ్రెస్‌కు సేవలందించిన కుటుంబాన్ని అదే కాంగ్రెస్ అధినాయకత్వం ముప్పు తిప్పలు పెట్టింది. ఇది జీర్ణించుకోలేక బయటకొచ్చి కొత్త పార్టీ ఏర్పాటు చేశారు జగన్. ఇక అప్పటి నుంచి ఆయనకు సీబీఐ కేసులు. నాడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ డైరెక్షన్ మేరకు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శంకర్రావుతో కేసులు వేయించారని వైసీపీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. అంతేకాదు చట్టం తనపని తాను చేసుకుపోతుందంటూ నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు జగన్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. చిదంబరం విషయంలో కూడా ఇప్పుడు చట్టం తనపని తాను చేసుకుపోతోందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారు.

 వైయస్ కుటుంబంను ఇబ్బంది పెట్టిన వారు ఇప్పుడెక్కడా..?

వైయస్ కుటుంబంను ఇబ్బంది పెట్టిన వారు ఇప్పుడెక్కడా..?

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైయస్ జగన్‌పై కేసులు బనాయించిందని , అవి రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమే అని వైయస్ కుటుంబం నాడు ఎంతగా వేడుకున్నప్పటికీ కనికరించలేదని వైసీపీ శ్రేణులు గుర్తుచేసుకుంటున్నారు. అయితే వైయస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరూ నేడు సంతోషంగా లేరని వారి జాబితాను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ముందుగా కేసు వేసిన కాంగ్రెస్ నేత శంకర్రావు పరిస్థితి ఏమైందో ఎవరికీ తెలియదని చెబుతున్న వైసీపీ శ్రేణులు... కేసు వేయించిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయారని చెబుతున్నారు. ఇక ఒకప్పుడు వైయస్ కుటుంబంపై ఆరోపణలు గుప్పించిన బొత్స తిరిగి జగన్ పంచన చేరాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు.

 తెలుగు రాష్ట్రాల్లో అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీ

తెలుగు రాష్ట్రాల్లో అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీ

ఇక వైయస్ కుటుంబంను ప్రజల్లో చెడ్డ చేయాలని చూసిన సోనియాగాంధీకి తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఊసే లేకుండా పోయిందని వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నారు. ఇక రాహుల్ గాంధీ కంటే జగన్ చరిష్మానే ఎక్కువగా ఉందని చెప్పడంలో మొన్నటి ఫలితాలే నిదర్శనమని చెబుతున్నారు. సొంత నియోజకవర్గంలో రాహుల్ ఓడిపోవడమంటే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని రాజకీయవిశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు వైయస్ కుటుంబంపై చేసిన ఆరోపణలకు సమాధానమే 23 సీట్లు అని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

పవన్‌కు ఒక సీటు... రాజకీయాల్లో సీబీఐ మాజీ జేడీ అట్టర్ ఫ్లాప్

పవన్‌కు ఒక సీటు... రాజకీయాల్లో సీబీఐ మాజీ జేడీ అట్టర్ ఫ్లాప్

2014లోనే జగన్ అధికారంలోకి రావాల్సి ఉన్నప్పటికీ... పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. అయితే 2019 వచ్చేసరికి అలాంటి పవన్ కళ్యాణ్ పార్టీ ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇక జగన్‌ను అరెస్టు చేసి తెలుగురాష్ట్రాల్లో తనకంటూ ఒక ఇమేజ్‌ను తెచ్చుకుని రాజకీయాల్లోకి ప్రవేశించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఘోర ఓటమి చవిచూశారు. విశాఖ నుంచి ఎంపీగా బరిలో దిగిన ఆయన ఓడిపోయారు. ఒకప్పుడు ఇదే సీటు నుంచి విజయమ్మ ఓటమిపాలయ్యారు. వైసీపీ ఓడిపోతోందంటూ తప్పుడు లెక్కలు కట్టిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎక్కడున్నారో కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి.

 పత్రికల ద్వారా చంద్రబాబు యుద్ధం...జనంలో ఉండి జగన్ యుద్ధం

పత్రికల ద్వారా చంద్రబాబు యుద్ధం...జనంలో ఉండి జగన్ యుద్ధం

రెండు పత్రికలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు జగన్‌పై విజయం సాధిద్దామని చాలా ప్రయత్నం చేశారని చెబుతున్న వైసీపీ శ్రేణులు ఆ తర్వాత యుద్ధంలో ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు.జగన్ ప్రజల మధ్య ఉండి యుద్ధం చేశారని వారు చెబుతున్నారు. ఇక వైయస్ అంటే ఉవ్వెత్తున లేచే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సైతం బీసీ రిజర్వేషన్ల అంశంపై జగన్‌ను కలవాలని భావించారు. మొత్తానికి వైయస్ ఫ్యామిలీని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారంతా నేడు అవే ఇబ్బందులకు గురవుతున్నారని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు జరుపుకుంటున్నారు.

English summary
With the arrest of former union Minister Chidambaram, YCP cadre had celebrated his arrest on social media. It was an act of Political Vendetta when AP CM Jagan was arrested in 2011 says the YCP fans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X