యూపీలో జంట హత్యలపై యోగీ సర్కార్ యాక్షన్ షురూ-సీఎం కీలక నిర్ణయం..
యూపీలో మాజీ ఎంపీ, మాజీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్ అహ్మద్ లను ప్రయాగ్ రాజ్ లో పోలీసులు తరలిస్తుండగా.. జర్నలిస్టుల ముసుగులో ఉన్న ముగ్గురు ప్రత్యర్ధులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ ఘటన యూపీతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ కూడా స్పందించింది. ఈ నేపథ్యంలోనే యూపీలో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ నష్ట నివారణ చర్యలకు దిగింది.
అతీక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ హత్యలపై విచారణ కోసం ముగ్గురు సభ్యులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. అతీక్ సోదరుల హత్య విషయం తెలియగానే సీఎం యోగీ.. యూపీ డీజీపీ, ఏడీజీపీతో సహా పోలీసు ఉన్నతాధికారుల్ని పిలిపించుకుని మాట్లాడారు. కట్టుదిట్టమైన పోలీసు భద్రతతో ఉండగానే అతీక్ సోదరుల్ని ఆగంతకులు హతమార్చడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దీంతో అతీక్ సోదరుల హత్యలపై విచారణ కోసం ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమిస్తూ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. హత్యలపై నిర్ణీత సమయంలోగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకునేందుకు యోగీ సర్కార్ సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగీ సర్కార్ ఎన్ కౌంటర్ల రికార్డుపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించిన 24 గంట్లలోనే ఈ హత్యలు చోటు చేసుకోవడంతో యూపీ పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 17మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం.. ఇతర చర్యలకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications