యూపీ స్ధానిక పోరులోనూ బీజేపీ జైత్రయాత్ర ! యోగీ ఆదిత్యనాథ్ ధీమా వెనుక ?
యూపీలో ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ జైత్రయాత్రను స్ధానికసంస్ధల ఎన్నికల్లోనూ కొనసాగించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే స్దానిక సంస్ధల ఎన్నికల్లో ఓబీసీ కోటాను పట్టుబట్టి సాధించుకున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ఇప్పుడు దాని ఆధారంగా ఎన్నికల్లో గరిష్ట ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు అభివృద్ధిని కూడా అజెండాగా మార్చుకుంటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తమ జైత్రయాత్ర కొనసాగుతుందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తాజాగా ఆశాభావం వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధి పనులే తమను గట్టెక్కిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో మేయర్, పరిషత్ ఎన్నికలపై రివ్యూ నిర్వహించిన యోగీ.. ఇక్కడ 11 నగర పంచాయతీల్ని ఎలాగైనా గెలవాలని నేతలకు టార్గెట్ పెట్టేశారు.

స్ధానిక సంస్ధల ఎన్నికల్ని ఈసారి క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ నేతల్ని కోరుతున్న యోగీ ఆదిత్యనాథ్.. అందుకు తగ్గ ప్రణాళికల్ని కూడా వారికి అందిస్తున్నారు. అలాగే భారీ ఎత్తున నిధుల్ని కూడా కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల ఆదరణ దక్కించుకున్నామని, ఇప్పుడు స్ధానిక పోరులోనూ జైత్రయాత్ర కొనసాగిస్తే తమకు ఎదురు ఉండదని యోగీ చెబుతున్నారు.
యోగీ ఆదిత్యనాథ్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పలు అభివృద్ధి ప్రాజెక్టుల్ని తెరపైకి తెచ్చారు. వీటి ద్వారా స్దానిక సంస్ధల ఎన్నికల్లో గరిష్టంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు డెడ్ లైన్లు కూడా పెడుతున్నారు. ఇందుకోసం భారీగా నిధుల్ని కూడా కేటాయిస్తామని తాజాగా హామీ ఇచ్చారు. తద్వారా ప్రజలకు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరబోతున్నారు.












Click it and Unblock the Notifications