త్వరలో భారత్ కు గ్రోత్ ఇంజన్ గా యూపీ-యోగీ ఆదిత్యనాథ్ ఆశాభావం..
యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. కీలక ప్రకటన చేశారు. యూపీ త్వరలోనే భారత్ కు గ్రోత్ ఇంజన్ గా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కైలాష్ మఠ్ లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన టిఫిన్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న యోగీ ఆదిత్యనాథ్.. యూపీ అభివృద్ధిలో ఎలా పరుగులు తీస్తోందో కార్యకర్తలకు వివరించారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో యూపీ గతంలో ఉన్న బీమారూ స్టేట్ (అనారోగ్య రాష్ట్రం) నుంచి ఇప్పుడు అభివృద్ధి రాష్ట్రంగా పరుగులు తీస్తోందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ బీజేపీ కార్యకర్తలకు తెలిపారు. ప్రస్తుతం యూపీ అభివృద్ధికీ, భద్రతకు, సుపరిపాలనకు మోడల్ గా మారిందని యోగీ వెల్లడించారు. త్వరలో భారత్ కే గ్రోత్ ఇంజన్ గా మారబోతోందని యోగీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహాయజ్ఞంలో కలిసి రావాలని ప్రజల్ని కూడా కోరారు.

ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో యూపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టిఫిన్ పే చర్చా మీటింగ్స్ నిర్వహిస్తున్నట్లు యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు. బీజేపీ భావజాలాన్ని, విజన్ ను కార్యకర్తల ద్వారా ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఈ టిఫిన్ పే చర్చ ఉపయోగపడుతుందని యోగీ తెలిపారు. తాను కూడా కాశీలో టిఫిన్ పే చర్చ భేటీలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత తొమ్మిదేళ్లుగా భారత్ ముఖచిత్రం మారుతోందని, 2014కు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా పరిస్ధితి ఉందని యోగీ పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రతిరోజూ నిరసనలు, ధర్నాలు జరిగేవని, అలాగే అవినీతి కేసులు కూడా భారీగా నమోదయ్యేవని యోగీ గుర్తుచేశారు. దేశ భద్రతకు అంతర్గతంగా, బయటి నుంచి ముప్పు పొంచి ఉండేదన్నారు. కానీ తొమ్మిదేళ్లుగా ఈ పరిస్ధితుల్లో మార్పు వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications