Yogi Adityanath : యోగీ రూటే వేరు- మాజీ డాన్ భూమిలో ఇళ్లు నిర్మించి పంచేసిన వైనం..
యూపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో రాష్ట్రంలో గ్యాంగ్ స్టర్లను తుదముట్టిస్తున్న యోగీ ఆదిత్యనాథ్.. ఆ తర్వాత వారి ఆస్తుల్ని కూడా పేదలకు పంచేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కు చెందిన భూమిలో నిర్మించిన ఫ్లాట్లను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఓ కేంద్ర ప్రభుత్వ పథకం కింద లబ్దిదారులకు పంచేశారు. దీంతో ఈ వ్యవహారంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న ప్రయాగ్‌రాజ్‌లో గతంలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ నుండి జప్తు చేసిన భూమిలో నిర్మించిన 76 ఫ్లాట్ల తాళాలు లబ్దిదారులకు అందజేశారు. రెండు నెలల క్రితం పోలీసు కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్ హత్యకు గురయ్యాడు. అనంతరం జప్తు చేసిన ఆయన భూమిలో నిర్మించిన రెసిడెన్షియల్ సొసైటీని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేశారు. ఈ ఫ్లాట్లను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించారు.

ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. 2017కు ముందు ఏ మాఫియా అయినా పేదల భూములను కబ్జా చేసేదని, వారిని ప్రభుత్వం నిస్సహాయంగా వదిలివేసేదని అన్నారు. కానీ ఇప్పుడు అలాంటి మాఫియాలు, రౌడీల నుంచి విముక్తి పొందిన భూముల్లో ఫ్లాట్‌లు నిర్మిస్తున్నారని అన్నారు. తద్వారా పేదలకు లబ్ది చేకూరుస్తున్నట్లు యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు.
తాజాగా మాజీ డాన్ అతీక్ అహ్మద్ నుంచి జప్తు చేసిన భూమిలో ఒక్కో ఫ్లాట్ 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దీని రేటు రూ.7.5 లక్షలు. అయితే లబ్ధిదారులు PMAY పథకం కింద 3.5 లక్షలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకం కింద 6,000 మందికి పైగా ప్రజలు ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో 1600 మందికి లాటరీ విధానంలో యూపీ ప్రభుత్వం ఫ్లాట్ కేటాయించింది.












Click it and Unblock the Notifications