యోగీ ఆదిత్యనాథ్ బిగ్ ప్లాన్ ! యూపీ స్ధానిక పోరుతో సార్వత్రిక ఎన్నికలకు రోడ్ మ్యాప్..!
ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికలు ఇప్పుడు యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కు కీలకంగా మారిపోయాయి. ఈ ఎన్నికలను ఎలాగైనా బీసీ కోటాతో నిర్వహించందుకు ఏడాది కాలంగా పలు ప్రయత్నాలు చేసిన యూపీ సీఎం యోగీ.. ఎట్టకేలకు తన పంతం నెరవేర్చుకున్నారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి బీసీ కోటాపై ఆదేశాలు తెచ్చుకున్న యోగీ సర్కార్.. ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక పోరుకు దీన్ని రోడ్ మ్యాప్ గా మార్చుకోవాలని భావిస్తున్నారు.
యూపీలో త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికల కోసం అజెండా సెట్ చేసిన యోగీ ఆదిత్యనాథ్.. దీని ఆధారంగా ఘన విజయం సాధించి ఇప్పటి నుంచే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు రోడ్ మ్యాప్ గా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం యూపీలో చెత్త తొలగింపు నుంచి మొదలుపెట్టి మాఫియా అంతం వరకూ ప్రతీ అంశాన్ని వాడుకుంటున్నారు. గత వారం రోజులుగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను 2024 లోక్‌సభ ఎన్నికలకు నాందిగా మార్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

చెత్తతో పాటు మాఫియాను సైతం ప్రక్షాళన చేస్తానని యోగీ ఇస్తున్న హామీలు చూస్తుంటే .. ఇవి కచ్చితంగా స్ధానిక పోరు గెలిచేందుకు మాత్రమే కాదనేది సగటు ఓటరుకు సైతం అర్ధమవుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ హత్య తర్వాత యోగీ.. ఏడు రోజుల్లో 19 బహిరంగ సభల్లో బీజేపీ ప్రచారానికి దీన్ని వాడుకున్నారు. అలాగే తన ప్రభుత్వం "మాఫియా" "అపరాధి", "దంగా", "గుండా", "తమంచ" సంస్కృతిని ఎలా తుడిచిపెట్టిందో గుర్తుచేస్తున్నారు. అలాగే గత సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంతో ఇవన్నీ ఎలా పెనవేసుకుపోయాయో కూడా ఓటర్లకు హైలెట్ చేస్తున్నారు.
యూపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మే 4, మే 11 న రెండు దశల్లో నిర్వహించనున్నారు. అలాగే మే 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు అవసరమైన ఊపు తీసుకురావాలని యోగీ ఆశిస్తున్నారు. పరిస్ధితులు కూడా సానుకూలంగా కనిపిస్తుండటంతో యోగీ ప్లాన్స్ కు ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications