యూపీలో ప్రాంతాలకతీతంగా పెట్టుబడులు-అపోహలు తొలగించామన్న యోగీ ఆదిత్యనాథ్..
యూపీలోని హర్డోయ్ జిల్లాలో ఉన్న శాండిలాలో బర్గర్ పెయింట్స్ యూనిట్ ను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ప్రాంతాలకతీతంగా పెట్టుబడులు పెట్టిస్తున్నట్లు ప్రకటించారు.
యూపీలో సుపరిపాలన, అభివృద్ధి మంత్రాలతో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన యోగీ ఆదిత్యనాథ్ సర్కార్.. ఈసారి పెట్టుబడులపై దృష్టిసారించింది. అంతే కాదు ఈ పెట్టుబడులు కూడా రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతంలో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకూ ఆహ్వనిస్తోంది. తాజాగా వెనుకబడిన హర్డోయ్ జిల్లాలోని శాండిలాలో బర్గర్ పెయింట్స్ ప్లాంట్ ను ప్రారంభించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తాజాగా ఒప్పందాలు జరిగిన వాటిలో వెయ్యి కోట్ల పెట్టుబడులు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
యూపీలో ప్రాంతాలకు అతీతంగా పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. తాజాగా పెట్టుబడుల సదస్సు నిర్వహణ ద్వారా భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్న ఆయన.. ఇప్పుడు వాటిలో వెయ్యి కోట్ల మేర పెట్టుబడులు రావడంపై స్పందించారు. బర్గర్ పెయింట్స్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం మొదలైందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో యూనిట్లు ప్రారంభించాలని ఈ సందర్భంగా పెట్టుబడిదారుల్ని ఆయన కోరారు.

రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాల అభివృద్ధికి ఐటీఐల్లో ప్రత్యేక కోర్సులు అమలు చేస్తున్నట్లు యోగీ తెలిపారు. వారికి ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పారిశ్రామిక వేత్తల్ని ఆయన కోరారు. దేశంలోనే యూపీ అతిపెద్ద పారిశ్రామికపెట్టుబడులు వస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందనుందని యోగీ వెల్లడించారు. రాష్ట్రంలోని 150 ఐటీఐలను అప్ గ్రేడ్ చేసేందుకు వీలుగా టాటా టెక్నాలజీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన గుర్తుచేసారు. 2017కు ముందు పెట్టుబడులన్నీ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)ను దృష్టిలో పెట్టుకుని వచ్చేవన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పరిస్ధితి మార్చి అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications