Yogi Adityanath : ఇక అదే ప్రయారిటీ-అధికారులకు యోగీ సీరియస్ ఆర్డర్స్..
యూపీలో వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్న యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ అభివృద్ధి పనుల్ని వేగవంతం చేస్తోంది. అదే సమయంలో ప్రజా సమస్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలా అధికారుల్ని పరుగులు పెట్టిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ తన జనతా దర్శన్ కార్యక్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వారు సంతృప్తి చెందేలా పనిచేయాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల్ని అత్యంత శ్రద్ధగా, సున్నితంగా విని వాటికి సంతృప్తికరంగా పరిష్కారాలు అందించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తాజాగా గోరఖ్ పూర్ లో నిర్వహించిన జనతా దర్శన్ కార్యక్రమంలో అధికారులు, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు వారికి కచ్చితంగా అందేలా చూడాలన్నారు. గోరఖ్ నాధ్ ఆలయం కాంప్లెక్స్ లో నిర్వహించిన జనతా దర్శన్ లో యోగీ ఆదిత్యనాథ్ మొత్తం 200 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

తన హయాంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని పూర్తిస్ధాయిలో పరిష్కారం అందించాల్సిందేనని, తమకు అన్యాయం జరిగిందని ఎవరూ చెప్పడానికి వీల్లేదని యోగీ ఆదిత్యనాథ్ అధికారులకు సూచించారు. అలాగే అనారోగ్య కారణాలతో వచ్చే బాధితులకు కూడా ఆర్ధిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు యోగీ తెలిపారు. బాధితుల నుంచి వివరాలు తీసుకుని అంచనాలు ఇస్తే ప్రభుత్వం వెంటనే సదరు సాయం విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు యోగీ వెల్లడించారు.
జనతా దర్శన్ సందర్భంగా తన వద్దకు ఫిర్యాదులతో వచ్చిన బాధితులతో పాటు వచ్చిన పిల్లల్ని స్వయంగా పలకరించి వారి చదువుల గురించి తెలుసుకున్న యోగీ ఆదిత్యనాథ్.. వారికి చాక్లెట్లు ఇచ్చి పంపారు. తద్వారా ప్రజల విషయంలో తాను ఎంత ఆలోచిస్తున్నదీ తెలిసేలా చేశారు.












Click it and Unblock the Notifications