180 దేశాల్లో యోగా దినోత్సవం భారత్ కు గర్వకారణం-యోగీ ఆదిత్యనాథ్ కామెంట్స్..
భారత్ కేంద్రంగా పుట్టిన యోగా నేడు ప్రపంచవ్యాప్తం కావడమే కాకుండా 180 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడం మనకు గర్వకారణమని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. యూపీలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులు, బీజేపీ నేతలతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా దినోత్సవం నిర్వహణపై యోగీ ప్రశంసలు కురిపించారు.
ఐరాసలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్ని ప్రధాని మోడీ లీడ్ చేయడం గర్వకారణమని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. యూపీలోని బల్లియా జిల్లా సితాబ్ దియారాలో రూ.3639 కోట్ల వ్యయంతో చేపట్టిన 144 అభివృద్ధి ప్రాజెక్టుల్ని శంఖుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన యోగీ.. యోగా దినోత్సవం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత సంస్కృతిలో భాగమైన యోగాను నేడు అన్నిదేశాలు అనుసరిస్తుండటంపై యోగీ హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఐరాస వేదికగా యోగా దినోత్సవం నిర్వహించే అవకాశం దక్కించుకోవడంపై యోగీ అభినందనలు తెలిపారు. యూపీలోనూ భారీ ఎత్తున యోగా దినోత్సవాన్ని నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో మదరసాలతో పాటు అన్ని చోట్లా యోగా దినోత్సవాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారు. భారత్ తో పాటు 180 దేశాలు యోగా దినోత్సవంలో పాల్గొని మనకు మద్దతు తెలిపాయని యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications