యూపీలో ఫిల్మ్ సిటీ- ఆరునెలల్లో మొదలు-యోగీ ఆదిత్యనాథ్ వెల్లడి..
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీని బాలీవుడ్ సినిమా షూటింగ్స్ కు కేంద్రంగా మార్చేందుకు యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ తరహాలో ఓ పెద్ద ఫిల్మ్ స్టూడియోను నిర్మించేందుకు యోగీ ఆదిత్యనాథ్ సిద్దమవుతున్నారు. వచ్చే ఆరునెలల్లో దీని నిర్మాణం మొదలుకానుందని సీఎం యోగీ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాల్ని ఆయన ప్రకటించారు.
యూపీలో ఫిలిం సిటీ ప్రాజెక్టును ఆరు నెలల్లోగా ప్రారంభించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఫిలిం సిటీ ప్రాజెక్టుపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన యోగీ.. ఉత్తరప్రదేశ్‌పై ఉన్న అభిప్రాయాలను మార్చడంలో ఫిలిం సిటీ కీలక పాత్ర పోషిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త సవాళ్లను, కొత్త దృశ్యాలను బేరీజు వేసుకుని ఫిల్మ్ సిటీ అభివృద్ధికి భరోసా కల్పించాలని ఆదిత్యనాథ్ అన్నారు.

ఫిల్మ్‌సిటీ విస్తీర్ణాన్ని యథాతథంగా ఉంచుతూనే దశలవారీగా అభివృద్ధి చేయాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారులకు సూచించారు. ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని అభివృద్ధి చేయడంతో ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల కళాకారులు కూడా ప్రదర్శనలు ఇచ్చే అవకాశం వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే ఇక్కడి ప్రజలు కూడా రాష్ట్రంలో ఉంటూనే తమ కలలను సాకారం చేసుకోగలుగుతారని యోగీ తెలిపారు.
యూపీలో ఫిల్మ్‌సిటీ నిర్మాణం ద్వారా నిర్మాతలతోపాటు సీరియల్, రియాల్టీ షో నిర్మాతలు కూడా ఆకర్షితులవుతారని యోగీ వెల్లడించారు. దీని వల్ల రాష్ట్ర సేవా రంగం, హోటల్ పరిశ్రమ, పర్యాటక రంగం, ఇతర రంగాలలో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఆయన అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లోపు ఈ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి శంఖుస్దాపన చేసేందుకు యోగీ ఆదిత్యనాథ్ సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications