యూపీ ఉద్యోగులకు యోగీ సర్కార్ గుడ్ న్యూస్- 4 శాతం డీఏ పెంపు...
ఉత్తర్ ప్రదేశ్ లో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఘనవిజయాలతో ఊపుమీదున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇవాళ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 19 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరబోతోంది. యోగీ సర్కార్ తాజా ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.
యూపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపచేసేలా 4 శాతం డీఏ పెంచుతూ యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు తర్వాత యూపీలో ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ, డీఆర్ లు 38 నుంచి 42 శాతానికి పెరగబోతున్నాయి. డీఏ పెంపు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా డీఏ-డీఆర్ పెంపుతో యూపీలో 16 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులు, 11.5 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

వాస్తవానికి ఈ ఏడాది మార్చి 24న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను 42 శాతానికి పెంచింది. దీంతో యూీలోనూ ఉద్యోగులు తమకు డీఏ పెంపు అమలు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీలో యోగీ సర్కార్ డీఏ పెంపు నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర ఉద్యోగులకు పెరిగిన డీఏ వారి జీపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. మే నెలలో పెరిగిన డీఏ మే నెల జీతంతో పాటు జూన్‌లో నగదు రూపంలో చెల్లిస్తారు.
యూపీలో రెండోసారి అధికారం చేపట్టిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ఉద్యోగుల విషయంలో సానుకూలంగానే ఉన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు డీఏ పెంపు నిర్ణయం కూడా అమలు చేయడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications