మధుర అభివృద్ధి పట్టని గత ప్రభుత్వాలు-విపక్షాలపై యోగీ ఆదిత్యనాథ్ విమర్శలు..
యూపీలో వరుసగా రెండోసారి అధికార పీఠం అందుకున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ఒక్కొక్కటిగా అభివృద్ధి ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్ధులపై మాటల దాడి కూడా పెంచుతున్నారు. తాజాగా మధురలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తున్న సీఎం యోగీ.. గత ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. మధుర అభివృద్ధిని గత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు.
గత ప్రభుత్వాలు మధుర అభివృద్ధిని విస్మరించాయని, ద్వాపర యుగంలో మథుర వైభవాన్ని, దైవత్వాన్ని పునరుజ్జీవింపజేయడానికి బీజేపీ ప్రభుత్వం రూ.32 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిందని యోగీ తెలిపారు. మథురలో రాబోయే మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగీ ఆదిత్యనాథ్ .. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వివిధ ప్రభుత్వాల హయాంలో ఉన్న అవినీతి, పేదరిక వ్యవస్థ మథుర అభివృద్ధిని నిలిపివేసిందని ఆరోపించారు.

2017లో మథుర బృందావన్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు, ఆ తర్వాత బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ మథురలో సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాయని యోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. మధుర బృందావన్ మున్సిపల్ కార్పొరేషన్‌ను తమ ప్రభుత్వం 2017లో స్థాపించడం తన అదృష్టమన్నారు. బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు యోగీ వెల్లడించారు.
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలను యోగీ ఆదిత్యనాథ్ కోరారు.గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 సందర్భంగా యూపీకి రూ.35 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, ఈ పెట్టుబడితో బ్రజ్ ప్రాంతంలో 50,000 మంది యువతకు ఉపాధి లభిస్తుందని యోగీ తెలిపారు. ఇవాళ దేశం మారిపోయిందని, మనం ఈ మార్పు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.
విమానాశ్రయాలు, ఐఐటీలు, ఎయిమ్స్ వంటి ప్రధాన మౌలిక సదుపాయాలు, నిర్మాణ ప్రాజెక్టులు సకాలంలో పూర్తయినట్లు యోగీ వెల్లడించారు. కాశీ, అయోధ్య, కేదార్‌నాథ్, మహాకాల్ వంటి ప్రదేశాలు గౌరవప్రదంగా పునరుజ్జీవింపబడ్డాయన్నారు.ఇది కొత్త భారతదేశానికి నిదర్శమని యోగీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications