విదేశాల్లో భారత్ పరువు తీస్తున్నారు- రాహుల్ గాంధీపై యోగీ ఆదిత్యనాథ్ ఫైర్
అంతర్జాతీయ వేదికలపై భారత్ సత్తా చాటుకుంటుంటే, కొందరు మాత్రం విదేశీల్లో దేశం పరువు తీస్తున్నారని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ విమర్శించారు.
యూకే పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్ వర్సిటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశంలో తాజా పరిస్ధితులపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికేై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా తన నియోజకవర్గం గోరఖ్ పూర్ లో ఏర్పాటు చేసిన ఓ సెమినార్ లో తీవ్ర విమర్శలు చేశారు.
ప్రపంచ వేదికపై భారత్ ఆధిపత్యం పెరుగుతుంటే, కొందరు మాత్రం విదేశాల్లో భారత్ పరువు తీస్తున్నారంటూ యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఈ రోజు భారత ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తున్నవారు, తమకు అవకాశం దొరికినప్పుడు ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కడానికి ఎటువంటి రాయిని వదిలిపెట్టని వ్యక్తులంటూ యోగీ రాహుల్ గాంధీపై పరోక్షంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెడుతుంటే, కొంతమంది దేశ పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని యోగీ ఆరోపించారు.

"పార్లమెంటుకు భారత రాష్ట్రపతి ప్రసంగం" అనే అంశంపై జరిగిన సెమినార్‌లో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యక్తులు (రాహుల్ గాంధీ) విదేశాల్లో ఉన్నప్పుడు దేశాన్ని విమర్శించారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేరళలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్‌ను విమర్శించారని, ఢిల్లీలో ఉన్నప్పుడు కేరళపై హీనంగా మాట్లాడారని ఆయన అన్నారు. దేశంలోని బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయాలనుకునే వారి కుటుంబ వారసత్వాన్ని విభజించి పాలించే రాజకీయాలను గుర్తించాలని, వారి విధానాల్లో గెలవడానికి మనం అనుమతించకూడదని యోగీ ఆదిత్యనాథ్ సూచించారు.












Click it and Unblock the Notifications