సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానం..!
ఉత్తర్ ప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు మరే రాష్ట్రంలో జరగడం లేదని సీఎం యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు.
లక్నో : సంక్షేమ పథకాల అమలులో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని అన్నారు సీఎం యోగీ ఆదిత్యనాథ్. ఉత్తర్ ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూడవ రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఊహించినదానికంటే అధిక నిధులు ఈసారి బడ్జెట్‌లో కేటాయించడం విశేషం. అయితే ఈ సారి బడ్జెట్‌లో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ నిర్మించాలని యోగీ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో మాట్లాడిన సీఎం తమ రాష్ట్రంలో జరిగే సంక్షేమం మరే ఇతర రాష్ట్రాల్లో లేదని చెప్పుకొచ్చారు. చెరుకు ఉత్పత్తిలో ఉత్తర్ ప్రదేశం రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందన్న యోగీ... ఉజ్వల స్కీమ్ కింద ఉచిత సిలిండర్లను అందజేస్తున్న రాష్ట్రాల్లో యూపీదే తొలి స్థానం అని చెప్పారు.
ఉజ్వల పథకం కింద 1.74 కోట్ల కుటుంబాలకు ఉచిత సిలిండర్లను పంపిణీ చేసినట్లు చెప్పిన యోగీ... ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్నన్ని ఎక్స్‌ప్రెస్‌వేలు మరే ఇతర రాష్ట్రంలో లేవని అన్నారు. రోడ్డు పక్కన చిరువ్యాపారస్తులకు మెయిన్‌టెనెన్స్ ఖర్చులు కూడా తమ ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. ఇక కేంద్ర పథకాలు అయిన అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో యూపీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఇక పరిశ్రమలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న యోగీ... వ్యవసాయ సంబంధిత పనిముట్లు తయారు చేసే సంస్థలకు సబ్సీడీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఆరోగ్య రంగంలో తమ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణంకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీంతో అత్యధిక మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా దేశంలోనే కొత్త చరిత్రను ఉత్తర్ ప్రదేశ్ సృష్టిస్తుందని చెప్పారు.

ఇక ఆహార రంగంలో కూడా ఉత్తర్ ప్రదేశ్ ముందంజలో ఉందని చెప్పారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో యూపీ తొలిస్థానంలో ఉందని గుర్తుచేశారు. పేదలకు టాయ్‌లెట్స్ నిర్మించడంలో కూడా ముందంజలో ఉందని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 12.77 లక్షల మందికి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చామని చెప్పారు. అంతేకాదు జంతువుల పట్ల మనిషి దురసుగా ప్రవర్తిస్తే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా చేశామన్నారు. పాల ఉత్పత్తిలో యూపీ తొలిస్థానంలో ఉండగా... రాష్ట్రంలో ఏ వర్గం పట్లకానీ ఏ వ్యక్తి పట్ల గానీ వేరుగా చూసే భావన లేదని చెప్పారు. పేదలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యపరమైన విధానాలను అమలు చేయడంలో కృతనిశ్చయంతో పనిచేస్తోందని వివరించారు.












Click it and Unblock the Notifications