చెట్టుకు వేలాడుతూ యువదంపతుల శవాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. రాష్ట్రంలోని డోయెరా జిల్లాలో గురువారం యువదంపతుల శవాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారిద్దరు కూడా 20 ఏళ్ల వయస్సు గలవారిగా కనిపిస్తున్నారు.
బహర్భూమికి వెళ్లిన పిప్రా గ్రామస్థులు చెట్టుకు వేలాడుతున్న శవాలను చూసినట్లు పోలీసులు చెప్పారు. అవి పరువు హత్యలు కావచ్చునని అనుమానిస్తున్నారు. పురుషుడు జీన్స్, టీ షర్ట్ ధరించి ఉన్నాడు. మహిళ సాల్వార్ దుస్తుల్లో ఉంది. వారిద్దరు పెళ్లి చేసుకుని ఉంటారని అనిపించే గుర్తులున్నాయి. వారి పెళ్లి కుటుంబ సభ్యులకు నచ్చి ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.

వారిద్దరి నోళ్లలోనూ దుస్తులు కుక్కి ఉన్నాయి. మృతులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డోయెరా జిల్లా కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా నియోజకవర్గంలో ఉంది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోలీసులపై, అధికారులపై నియంత్రణ కోల్పోయారని, దాంతో ఉత్తరప్రదేశ్‌లో నేరాలు, ముఖ్యంగా మహిళలపైనా, పిల్లలపైనా నేరాలు పెరిగాయని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ విమర్శించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, దాని గురించి ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications