వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారులోంచి తల బయటకు పెట్టిన యువతి మృతి - ప్రెస్‌రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కారు

చల్లగాలి కోసం వాహనం నుంచి తల బయటకు పెడితే విద్యుత్తు స్తంభం తగిలి యువతి దుర్మరణం పాలైన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో శనివారం చోటుచేసుకుందని 'ఈనాడు’ కథనం తెలిపింది.

''పోలీసులు, యువతి స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం..ఎనిమిది మంది స్నేహితులు పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం నుంచి ఒక కారులో శనివారం మారేడుమిల్లి విహార యాత్రకు బయలుదేరారు.

మధురపూడి విమానాశ్రయం గేటు-బూరుగుపూడి గ్రామం మధ్య ప్రయాణిస్తున్న సమయంలో వల్లభనేని లోహిత్‌ రాణి(25) చల్లగాలి కోసం కారు కిటికీ నుంచి తల బయటకు పెట్టారు.

అదే సమయంలో కారు రోడ్డు అంచు దిగడంతో పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభానికి ఆమె తల బలంగా తగిలింది.

స్నేహితులు వెంటనే అదే కారులో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందారు. కోరుకొండ ఎస్సై కట్టా శారదాసతీష్‌ సంఘటన వివరాలను సేకరించారు.

వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది స్నేహితులు రావులపాలెంలో జరిగే స్నేహితురాలి వివాహం కోసం వచ్చారు. వీరు వల్లభనేని లోహిత్‌ రాణి స్వగ్రామం గౌరీపట్నంలో బస చేశారు.

లోహిత్‌ రాణితో పాటు మరో ఆరుగురు చెన్నైలో సీఏలుగా పనిచేస్తున్నారు. మరో ఇద్దరు బీటెక్‌ చేశారు. మృతురాలి తల్లిదండ్రులు సర్వేశ్వరరావు, అనంతలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరికి లోహిత్‌ రాణి ఒకరే సంతానం’’ అని ఆ కథనంలో వెల్లడించారు.

దిల్లీకి కేసీఆర్

వ్యవసాయ చట్టాల విషయంలో మోదీ సర్కారు వెనక్కి తగ్గిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూకుడు పెంచారని 'ఆంధ్రజ్యోతి’ కథనం రాసింది.

''కేసీఆర్ శనివారం అందుబాటులో ఉన్న మంత్రుల్ని, పార్టీ ఎంపీలను ఆగమేఘాల మీద ప్రగతి భవన్‌కు పిలిపించి సమావేశయ్యారు. వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలానికి పైగా పట్టువదలకుండా పోరాటం చేసిన రైతులను కొనియాడారు. అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు.

దిల్లీ కేంద్రంగా సుదీర్ఘంగా సాగిన పోరాటంలో అసువులు బాసిన 700 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున రూ.22 కోట్లు సహాయం ఇస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే ఈ సహాయాన్ని మంత్రులు నేరుగా బాధిత కుటుంబాలను కలిసి అందిస్తారని చెప్పారు.

అవకాశాన్ని బట్టి తానుకూడా బాధిత కుటుంబాలను కలిసే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రజాగ్రహాన్ని అర్థం చేసుకొని వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సారీ చెప్పి తప్పుకుంటే సరిపోదని, రైతు ఉద్యమ నేతలు డిమాండ్‌ చేసినట్లుగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

వారి పోరాటంతో టీఆర్‌ఎస్‌ చేయి కలుపుతుందని, పార్లమెంటు సహా అన్ని వేదికల మీద ఈ డిమాండ్‌ సాధనకు కృషి చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు.

అంతేకాకుండా, ఉద్యమానికి కారణమైన చట్టాలనే రద్దు చేసినందున, ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన దుర్మార్గపు కేసులను కూడా మోదీ సర్కారు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున సహాయం అందించాలని కోరారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో చర్చకు రానున్న విద్యుత్‌ బిల్లును కూడా మోదీ సర్కారు వెనక్కి తీసుకోవాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చే రాష్ట్రాలను బలవంతంగా సాగు మోటర్లకు మీటర్లు పెట్టించే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ చట్టాల విషయంలో చేసినట్లే కేంద్రం విద్యుత్‌ బిల్లు విషయంలో మొండిగా ముందుకు వెళితే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని, రైతులు మరోసారి వీధుల్లోకి వస్తారని హెచ్చరించారు.

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్రం దాటవేత వైఖరిని అవలంబిస్తోందని కేసీఆర్‌ మండిపడ్డారు. ఎంత కొంటారనే విషయమై కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానం రాబట్టేందుకే ఆదివారం దిల్లీకి వెళుతున్నట్లు సీఎం ప్రకటించారు. తనతోపాటు మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు వస్తారన్నారు’’ అని ఆ కథనంలో తెలిపారు.

Darshan Nalkande: నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీలో భాగంగా శనివారం విదర్భ, కర్ణాటక మధ్య జరిగిన సెమీఫైనల్లో మ్యాచ్‌లో విదర్భ బౌలర్‌ దర్శన్‌ నల్కండే నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడని 'సాక్షి’ కథనం తెలిపింది.

''ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌ వేసిన దర్శన్‌ నల్కండే.. తొలి బంతికి అనిరుద్ద జోషిని వెనక్కిపంపాడు. తర్వాత వరుస బంతుల్లో శరత్‌ బీఆర్‌, జగదీష్‌ సుచిత్‌లు పెవిలియన్‌ చేర్చి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.

ఇక చివరగా నాలుగో బంతికి ఇన్‌ఫాం బ్యాటర్‌ అభినవ్‌ మనోహర్‌ను ఔట్‌ చేసి నాలుగో వికెట్‌ సాధించాడు.

ఈ నలుగురిలో అభివన్‌ మనోహర్‌ వికెట్‌ పెద్దది. దీంతో దర్శన నల్కండే అద్భుత ప్రదర్శనపై ట్విటర్‌లో ప్రశంసలు లభిస్తున్నాయి.

అయితే ఈ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కర్ణాటక చేతిలో విదర్భ పరాజయం పాలైంది. ఇక ఫైనల్‌ చేరిన కర్ణాటక నవంబర్‌ 22న తమిళనాడుతో అమితుమీ తేల్చుకోనుంద’ని ఆ కథనంలో రాశారు.

కైకాల ఆరోగ్య పరిస్థితి విషమం

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారని 'నమస్తే తెలంగాణ’ కథనం వెల్లడించింది.

''తీవ్ర అస్వస్థత కారణంగా శనివారం ఉదయం ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.

'ప్రస్తుతం ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. అవయవాల వైఫల్యం వల్ల పరిస్థితి సీరియస్‌గా మారింది. నిపుణులైన డాక్టర్ల బృందం ఆయన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఆయన అనుకున్న విధంగా చికిత్సకు స్పందించడం లేదు. కోలుకునే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి' అని హెల్త్‌బులెటిన్‌లో పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమలో అసమాన అభినయంతో నవరస నటసార్వభౌమగా కైకాల సత్యనారాయణ గుర్తింపును తెచ్చుకున్నారు.

దాదాపు ఎనిమిదివందల చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో మెప్పించారు. 2019 తర్వాత ఆయన మరే తెలుగు చిత్రంలో నటించలేదు. 'ఎన్టీఆర్‌ కథానాయకుడు', 'మహర్షి' చిత్రాల తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నార’’ని ఆ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Young woman killed after putting her head out of a car
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X