జంతర్ మంతర్ వద్ద జగన్: రాంలీలా మైదానంలో అశోక్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాలు చేసేందుకు సమైక్యవాదులు సిద్ధపడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం నుంచి ఢిల్లీకి తన పార్టీ కార్యకర్తలను ఆయన తరలిస్తున్నారు.
కార్యకర్తలను ఢిల్లీకి తీసుకుని వెళ్లేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రం నుంచి ఢిల్లీకి రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసుకుంది. ఒక రైలు శనివారం ఉదయం పది గంటలకు తిరుపతిలోని రేణిగుంట నుంచి బయలుదేరగా, మరో రైలు శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు రాజమండ్రి నుంచి బయలుదేరింది.

కాగా, వైయస్ జగన్ శనివారంనాడు బిజెపి సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీని కలుసుకున్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని ఆయన జైట్లీని కోరారు. ఇంతకు ముందు ఆయన బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. విజయమ్మతో సహా పార్టీ ముఖ్య నాయకులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. రైళ్లు రేపు (ఆదివారం) సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటాయి.
కాగా, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎపిఎన్జీవోల తరఫున అశోక్ బాబు నాయకత్వంలో రామ్ లీలా మైదానంలో ఈ నెల 17వ తేదీన ధర్నా చేపట్టనున్నారు. అశోక్ బాబు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. సీమాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో సమైక్యవాదులు శనివారంనాడు బయలుదేరారు.
సమైక్యాంధ్ర కోసం ఎపిఎన్జీవోలు ఢిల్లీలో తలపెట్టిన మహాధర్నాకు తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణ మద్దతు ప్రకటించారు. సమైక్యవాదులంతా దీక్షలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications