జగన్‌కు టిపై మమత బెనర్జీ హామీ, తమ్ముడన్న దీదీ
కోల్‌కతా/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. జగన్‌కు మమత నుండి హామీ లభించింది.
కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ విభజనపై ఏకపక్షంగా వెళ్తోందని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే వ్యతిరేకించాలని కోరారు. అదే సమయంలో జగన్ మాట్లాడుతూ.. విభజనకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అని చెప్పారు. ఆర్టికల్ 3ని సవరించాలని చెప్పారు. రాష్ట్రాలను ఇష్టం వచ్చినట్లుగా వుభజిస్తే కుదరదని, విభజనకు ఓ ప్రాతిపదిక ఉండాలని జగన్ అన్నారు.

జగన్ తమ్ముడిలాంటి వారు: మమత
వైయస్ జగన్ తనకు తమ్ముడిలాంటి వారని మమతా బెనర్జీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తానెప్పుడు సమైక్యంగా ఉండాలనే కోరుకుంటానని చెప్పారు. అందరూ కలిసి ఉండాలన్నదే తన భావన అన్నారు. కావాలంటే కొన్నిచోట్ల మరిన్ని జిల్లాలు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని, అంతే తప్ప విభజిస్తూ పోతే మాత్రం సమస్య పరిష్కారం కాదన్నారు.

కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకొని కోల్‌కతా, లక్నోలో పర్యటిస్తున్నారు. ఈ రోజు కోల్‌కతాలో మమతను కలిసిన జగన్ గురువారం యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలుసుకోనున్నారు.












Click it and Unblock the Notifications