న్యూఇయర్ వేళ! జనంపైకి వాహనంతో దూసుకెళ్లి, ఆపై కాల్పులు.. 12 మంది మృతి
నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో అమెరికాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. జనాలపైకి ఓ వాహనం దూసుకెళ్లడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికిపైగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. లూసియానాలోని న్యూ ఆర్లీన్స్‌లో ఘటన చోటు చేసుకుంది.
వేగంగా ఓ వాహనం దూసుకెళ్లిందని.. అనంతరం డ్రైవర్ బయటకు వచ్చి జనాలపై కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. న్యూ ఆర్లీన్స్‌లో ఉన్న కెనాల్ అండ్ బోర్బన్ స్ట్రీట్ కూడలిలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. దీంతో అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అదే సమయంలో వేగంగా ఓ వాహనం అక్కడున్నవారిపైకి దూసుకొచ్చింది.

ఆ తర్వాత అందులోనుంచి బయటకు దిగిన డ్రైవర్.. జన సమూహంపై కాల్పులు జరిపాడు. అప్పటికే వాహనంతో దూసుకోవడంతో పలువురు మృతి చెందగా.. కాల్పుల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సాయుధుడిపై కాల్పులు జరిపారు.
అయితే, నిందితుడికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రజలను అనుమతించడం లేదు. పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా? అనేదాని కోసం తనిఖీలు చేస్తున్నారు. కాల్పుల ఘటనలో గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బుధవారం తెల్లవారుజామున 3.15 గంటలకు దుండగుడు ఉద్దేశపూర్వకంగానే జనంపైకి వాహనం తీసుకెళ్లి.. ఆ తర్వాత కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, మేయర్ లాటోయా కాంట్రెల్ ఈ సంఘటనను 'ఉగ్రదాడి'గా అభివర్ణించారు. అయితే, ఎఫ్‌బీఐ అధికారులు మాత్రం దీన్ని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications