Israel Hamas War: గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు-182 చిన్నారులు సహా 436 మంది మృతి...
హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతిదాడులు తీవ్ర స్ధాయికి చేరుకున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ 436 మంది చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. ఇందులో 182 మంది చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో ఈ ప్రాంతం భయానకంగా మారిపోతోంది. ఇప్పటివరకూ వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్.. తాజాగా భూమార్గంలో దాడులతో పాటు తనిఖీలు చేపడుతుండటం అక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
మరోవైపు గాజాలో మరణించిన మహిళల సంఖ్య 1,119కి చేరుకుందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది.గాజాపై నిన్న రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 70 మంది మరణించారని హమాస్ అధికారులు తెలిపారు. 24 గంటల్లో పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో 320 లక్ష్యాలను ఛేదించినట్లు మిలటరీ తెలిపింది. దిగ్బంధంలో ఉన్న గాజా స్ట్రిప్‌లో హమాస్ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ దాడుల్లో 60 మందికి పైగా అమరులయ్యారని ప్రకటించింది.

అటు దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న గాజా ప్రజలకు సాయం అందించే విషయంలో ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ గాజాకు వేగంగా సహాయాన్ని అందించాలని కోరారు. హమాస్‌తో ఇజ్రాయెల్ సంఘర్షణలో మానవతావాద విరామం కోసం పిలుపునిచ్చే అంశంపై తమ కూటమి చర్చిస్తున్నట్లు చెప్పారు.

ఈజిప్ట్ నుండి గాజాలోకి అనుమతించబడిన కొన్ని డజన్ల ట్రక్కుల మానవతా సహాయం వారికి సరిపోదన్నారు. కరెంటు, త్రాగునీటిని ఉత్పత్తి చేయడానికి ఇంధనం అవసరమని పేర్కొన్నారు. మానవతా కోణంలో కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈయూ దేశాల విదేశాంగ మంత్రులు చర్చిస్తారని చర్చించబోతున్నారు.












Click it and Unblock the Notifications