టర్కీ-సిరియాలో మరోసారి భూకంపం: 6.3 తీవ్రత నమోదు, వణికిపోయిన జనం
అంకారా: ఇప్పటికే భారీ భూకంపంతో అతలాకుతలమైన టర్కీ-సిరియా దేశాలను ఆ తర్వాత కూడా భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. తాజాగా, మరోసారి టర్కీ-సిరియా దేశాల మధ్య భారీ భూకంపం సంభవించింది. టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో రెండు కిలోమీటర్ల లోతులో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్కోలాజికల్ సెంటర్ వెల్లడించింది.
తాజా భూకంపంతో మరోసారి ఈ రెండు దేశాల ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే, తీవ్రత కొంత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని కొందరు సాక్షలు తెలిపారు. సహాయక బృందాలు హుటాహుటిన ఆయా ప్రాంతాలకు తరలివెళ్లాయి.

భూకంపం వచ్చినప్పుడు తాను సెంట్రల్ అంటక్యాలోని ఒక పార్కులో టెంట్‌లో ఉన్నానని మునా అల్ ఒమర్ అనే స్థానికులు తెలిపారు. 'నా పాదాల క్రింద భూమి చీలిపోతుందని నేను అనుకున్నాను అంటూ తన ఏడేళ్ల కొడుకును పట్టుకున్న మహిళ కన్నీటిపర్యంతమైంది. ఇంకా భూకంపాలు సంభవిస్తాయా? అని ఆమె ఆందోళనగా అడిగింది.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ ఆగ్నేయ, పొరుగున ఉన్న సిరియాలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ పెను భూకంపం కారణంగా 45,000 మందికి పైగా మరణించారు. మిలియన్ల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల కోట్లలో ఆర్థిక నష్టం జరిగింది. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత్ తోపాటు ప్రపంచ దేశాలు.. టర్కీ, సిరియాలకు అన్ని రకాలుగా సహాయ సహకరాలు అందిస్తున్నాయి.












Click it and Unblock the Notifications