కొత్త సింప్టమ్స్: ఈ ఆరు లక్షణాలు కనిపించితే కరోనా బారిన పడినట్టే: తేల్చిన సీడీసీ
న్యూయార్క్: ఒక మనిషిలో కనిపించే దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం లక్షణాలను బట్టి అతను కరోనా వైరస్ బారిన పడినట్టుగా భావిస్తుంటారు. రక్త పరీక్షలు లేదా సెలైవాను సేకరించి పరీక్షలను నిర్వహించిన అనంతరం అతనికి వైరస్ సోకిందా? లేదా? అనేది నిర్ధారిస్తుంటారు డాక్టర్లు. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు.. ఈ మూడే ప్రస్తుతానికి కరోనా లక్షణాలుగా గుర్తించారు. ఈ మూడింట్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా అతనికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

కొత్తగా మరో లక్షణాలు..
తాజాగా- ఈ మూడింటితో పాటు మరో ఆరు లక్షణాలను కనుగొన్నారు డాక్టర్లు. ఈ ఆరు లక్షణాలు కూడా కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారించడానికి ఉపకరిస్తున్నాయనని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లపై నిర్వహించిన పరీక్షలు, ఇతర సర్వేల ఆధారంగా దీన్ని ఈ ఆరు లక్షణాలు కూడా కరోనా వైరస్ సోకిందనడానికి సంకేతాలను ఇచ్చేవిగా ఉన్నాయని పేర్కొంది.

ఆ ఆరు లక్షణాలు ఇవే..
1. చలి 2. చలి వల్ల శరీరం వణుకుతుండటం 3. కండరాల నొప్పి 4. తలనొప్పి, 5. గొంతు నొప్పి, 6 రుచి, వాసనను కోల్పోవం. ఈ ఆరు లక్షణాలు కూడా ఒక మనిషికి వైరస్ సోకిందనడానికి గుర్తుగా భావించుకోవాల్సి ఉంటుందని సీడీసీ తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆరింట్లో ఏ ఒక్క లక్షణమైనా కనపించినా కరోనా వైరస్‌కు సంకేతంగా తీసుకోక తప్పదని సీడీసీ నిపుణులు చెబుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ.. ఇప్పుడున్న వాతావరణంలో డాక్టర్లను సంప్రదించక తప్పదని అంటున్నారు.

అయిదు మంది డాక్టర్లతో కూడిన బృందం సర్వే..
వైరస్ సోకిన వారి లక్షణాలను తెలుసుకోవడానికి స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన అయిదుమంది డాక్టర్లతో కూడిన బృందం సీడీసీ తరఫున ఓ సర్వే నిర్వహించింది. డేవిడ్ కిమ్, జేమ్స్ క్విన్, బెంజమిన్ పిన్స్‌కీ, నిగమ్ హెచ్ షా, ఇయాన్ బ్రౌన్ ఈ బృందంలో సభ్యులు. వారిలో నిగమ్ హెచ్ షా భారతీయ సంతతికి చెందిన డాక్టర్. 1206 పేషెంట్లను వారు కలిశారు. వారి అభిప్రాయాలను సేకరించారు. వైరస్ సోకినట్టుగా అనుమానించడానికి ముందు వారు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారనే విషయంపై ఈ సర్వే సాగింది.

ఒక్కొక్కరు ఒక్కో లక్షణాన్ని వెల్లడించినట్లు..
ఈ సర్వే ఒక్కొక్కరు ఒక్కో లక్షణం గురించి వెల్లడించినట్లు తేలింది. ఎక్కువమంది శాస్వ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు గుర్తించారు. రెస్పిరేటరీ పాథొజెన్స్ వంటి ఇబ్బందులు తలెత్తినట్లు తెలిపారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో తమకు కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారని చెప్పారు. చలి, కండరాల నొప్పులు, తలనొప్పి వంటి సాధారణ అనారోగ్య కారణాలు కూడా కరోనా వైరస్ సోకిందనడానికి రుజువు చేస్తోందని పేర్కొన్నారు.