టర్కీ-సిరియా భూకంపం: మూడ్రోజుల ముందే హెచ్చరించిన డచ్ పరిశోధకుడు
టర్కీ, సిరియాల్లో తీవ్ర భూకంపం సంభవిస్తుందని నెదర్లాండ్‌కు చెందిన ఓ పరిశోధకుడు మూడు రోజుల ముందే హెచ్చరించారు.
అంకారా: టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు కుప్పకూలాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటి వరకు 2 వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. అయితే, ఈ తీవ్ర భూకంపం సంభవిస్తుందని ఓ పరిశోధకుడు మూడు రోజుల ముందే హెచ్చరించడం గమనార్హం.
మూడు రోజుల ముందే టర్కీ, సిరియా భూకంపం హెచ్చరిక
భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే సంస్థకు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్.. తాజా విపత్తును ముందే అంచనా వేశారు. త్వరలోనే దక్షిణ మధ్య టర్కీ, జొర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉంది అని ఫిబ్రవరి 3నే ఓ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా, ఆయన అంచనాలు నిజమయ్యాయి. ఫిబ్రవరి 6న ఉదయం టర్కీ, సిరియాల్లో పెను భూకంపం సంభవించి భారీ విలయం సృష్టించింది.
భూకంపం విలయంపై విచారం వ్యక్తం చేసిన ఫ్రాంక్ హూగర్ బీట్స్
ఈ క్రమంలో భూకంపం సృష్టించిన విలయంపై తాజాగా ఫ్రాంక్ హూగర్ బీట్స్ స్పందించారు. ఈ సంఘటన తనను ఎంతో కలిచివేసిందన్నారు. త్వరలోనే భూకంపం వస్తుందని ముందుగానే చెప్పానని.. అది 115 ఏళ్ల క్రితం వచ్చిన మాదిరిగానే ఉంటుందని చెప్పారు. గ్రహ సంబంధిత సంక్లిష్ట రేఖా గణితం ఆధారంగా వీటిని ముందుగానే అంచనా వేసినట్లు ఆయన తెలిపారు.
స్థానికంగా ఇప్పటి వరకు సంభవించిన భూకంపాల్లో ఇదే అత్యంత తీవ్రమైనదని.. అంతేగాక, మరిన్ని ప్రకంపనలు కూడా వచ్చే అవకాశం ఉందని బీట్స్ తెలిపారు. అయితే, ఈయన చెప్పినట్లుగానే టర్కీ, సిరియాల్లో భారీ భూకంపం అనంతరం రెండు మూడుసార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాజాగా, మరోసారి కూడా ప్రకంపనలు వచ్చాయి.

భూకంపంపై ముందే హెచ్చరించినా ఎవరూ నమ్మలేదు!
అయితే, మొదట ఫ్రాంక్ బీట్స్ హెచ్చరించిన సమయంలో ఆయన ట్వీట్లను ఎవరూ నమ్మలేదు. విమర్శలు కూడా చేశారు. భూకంపాలను ఎవరూ అంచనా వేయలేరని కొట్టిపారేశారు. కానీ, ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే భారీ భూకంపం సంభవించడంతో ఫ్రాంక్ బీట్స్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆయన ట్వీట్ ను చాలా మంది రీట్వీట్ చేస్తున్నారు. ఆయన హెచ్చరించిన క్రమంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు కొందరు నెటిజన్లు. కానీ, జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది.












Click it and Unblock the Notifications