ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పులు- ముగ్గురు చిన్నారులు సహా ఆరుమంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అక్కడి గన్ కల్చర్ మరోసారి పేట్రేగింది. ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఆరుమంది మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడిన యువతిని పోలీసులు కాల్చివేశారు. ఈ ఘటన పట్ల అధ్యక్షుడు జో బైడెన్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
టెన్నెస్సీ స్టేట్‌లోని నాష్‌విల్లేలో ఈ దారుణం చోటు చేసుకుంది. నాష్‌విల్లే బర్టన్ హిల్స్ ప్రాంతంలోని కోవెనంట్ ప్రెస్‌బైటేరియన్ చర్చ్ సమీపంలో ఉంటుంది ఈ స్కూల్. కోవెనంట్ స్కూల్‌గా పిలుస్తుంటారు. 2100 ఉడ్‌మౌంట్ బోల్‌వార్డ్‌లోని ఉడ్‌మౌంట్ బాప్టిస్ట్ చర్చి వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రీయూనిఫికేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అదే సమయంలో 28 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు సహా ఆరుమంది మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే మెట్రో నాష్‌విల్లే పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన మహిళను కాల్చివేశారు. ఈ కాల్పుల్లో ఆమె మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె ఏ కారణంతో ఈ కాల్పులకు తెగబడిందనేది ఇంకా తెలియరాలేదు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తోన్నామని పోలీసులు చెప్పారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:10 నిమిషాలకు కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగినట్లు 10:13 నిమిషాలకు తమకు మొదటి కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్కూల్ రెండో అంతస్తులో మహిళా షూటర్ దాక్కున్నట్లు గుర్తించారు. పోలీసుల వచ్చిన తరువాత కూడా ఆమె కాల్పులు జరిపింది. దీనితో వారు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆమె మరణించింది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications