పాకిస్తాన్‌లో నరమేధం: మసీదులో పేలుడు: శుక్రవారం ప్రార్థనల సమయంలో: 30 మందికి పైగా మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. పెషావర్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే శుక్రవారం నాడు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో 30 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఫలితంగా- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆత్మాహూతి దాడిగా..
ఈ పేలుడుకు ఉగ్రవాదులే కారణమని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలాానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాంబుపేలుడు సంభవించిన అనంతరం సంఘటనా స్థలం అంతా రక్తసిక్తమైంది. తెగని శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. పోలీసు వాహనాలు, అంబులెన్సుల సైరన్ మోతలతో భీతావహ వాతావరణం నెలకొంది.

షియా మసీదులో..
పెషావర్‌లోని కుచా రిసాల్దార్ మసీదులో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఇది షియా ముస్లింలకు చెందిన మసీదు. శుక్రవారం ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. ప్రార్థనలను చేస్తోన్న సమయంలోనే శక్తిమంతమైన పేలుడు చోటు చేసుకుంది. ప్రార్థనలు కొనసాగుతోన్న సమయంలో ఓ వ్యక్తి- హఠాత్తుగా మసీదు లోనికి దూసుకుని రావడానికి ప్రయత్నించాడని, అతణ్ని అడ్డుకోవడానిక భద్రతసిబ్బంది ప్రయత్నిస్తోన్న సమయంలోనే తనను తాను పేల్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షుల్లో ఒకడైన హరూన్ రహీద్ అనే పోలీస్ పేర్కొన్నారు.

అంబులెన్సుల్లో..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. గాయపడ్డ వారిని పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్సులు, ప్రైవేటు వాహనాలు, స్కూటర్లు, బైక్‌ల మీద వారిని ఆసుపత్రికి తరలించడం కనిపించింది. 60 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి ప్రతినిధి మహ్మద్ ఆసిమ్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. గాయపడ్డ వారికి అత్యాధునిక చికిత్సను అందిస్తున్నామని అన్నారు.
Recommended Video

అత్యవసర పరిస్థితి..
పేలుడు సంభవించిన వెంటనే పెషావర్ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ దారుణ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నామని అన్నారు. ఇది ఆత్మాహూతి దాడిగా ప్రాథమికంగా నిర్ధారించామని పెషావర్ పోలీస్ కమిషనర్ మహ్మద్ సజ్జద్ ఖాన్ తెలిపారు. ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందజేయాలని ఆదేశించారు. ఈ దాడి తమ పనేనంటూ ఇప్పటిదాకా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.












Click it and Unblock the Notifications