మరో 7 రోజుల్లో ఆఫ్ఘన్ పూర్తిగా తాలిబన్ల నియంత్రణలోకి... ఏ క్షణమైనా అధ్యక్షుడు రాజీనామా చేసే ఛాన్స్...
ప్రభుత్వం నిస్సహాయంగా చేతులెత్తేసిన వేళ...ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దురాక్రమణ,హింసకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇప్పటికే 18 ప్రావిన్సులను ఆక్రమించేసిన తాలిబన్లు... మరో వారం రోజుల్లోగా రాజధాని కాబూల్ సహా దేశం మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాజీనామాకు ప్రజలు డిమాండ్ చేస్తుండటం... పరిస్థితులు చేయి దాటుతుండటంతో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఆష్రఫ్ గనీ రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. నేడో,రేపో ఆఫ్ఘన్ ప్రజలను ఉద్దేశించి తన చివరి ప్రసంగం చేయనున్న ఆష్రఫ్ గనీ... ఏ క్షణమైనా అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఆష్రఫ్ ఘనీ రాజీనామా చేస్తే తదుపరి అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడుతారనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లను నియంత్రించడం అసాధ్యంగానే కనిపిస్తోంది. అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం కరువవడంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజల రోదన అరణ్య రోదనగానే మారింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఆఫ్ఘన్ ప్రజలను వారే రక్షించుకోవాలని ఇదివరకే ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఆఫ్ఘన్‌లోనే రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ సహా హెరత్,ఘాజ్నీ,హెల్మండ్,లోగర్ వంటి ప్రముఖ నగరాలను తాలిబన్లు ఇప్పటికే ఆక్రమించేశారు. దేశంలో మూడింట రెండొంతుల భూభాగం ఇప్పటికే వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. కాందహార్ సెంట్రల్ జైలుపై దాడి చేసిన తాలిబన్లు... వందలాది తాలిబన్ ఖైదీలను విడుదల చేశారు.కాబూల్‌కు ప్రస్తుతం వారు 90కి.మీ దూరంలో ఉన్నారు. మరికొద్దిరోజుల్లో ఆ దురాక్రమణ కూడా పూర్తయితే ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమవుతుంది.
మరోవైపు తాలిబన్లతో అధికారాన్ని పంచుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసినట్లుగా కథనాలు వచ్చాయి. అయితే దీనిపై తాలిబన్ల నుంచి ఇంకా ఎటుంటి స్పందన రాలేదు. దాదాపుగా దేశం మొత్తాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్న స్థితిలో ఇక అధికారాన్ని పంచుకోవడంపై తాలిబన్లు అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. దేశాన్ని పూర్తిగా ఆక్రమించాక ఇస్లామిక్ రాజ్య స్థాపనపై ప్రకటన చేయవచ్చు. తాలిబన్ల అరాచకాలతో అక్కడి ప్రజల జీవితాలు అత్యంత దయనీయంగా మారాయి. వేలాది మంది ప్రజలు ఇళ్లు వదిలి పారిపోతున్నారు. సరిహద్దులు దాటి ఇతర దేశాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి,సుస్థిరత స్థాపనకు రెండు దశాబ్దాల పాటు అక్కడి ఉగ్రవాదంపై పోరు చేసిన అమెరికా,నాటో దళాలు ఇటీవలే అక్కడినుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌ను పట్టి పీడిస్తున్న తాలిబన్,అల్‌ఖైదా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు రెండు దశాబ్దాల క్రితం అమెరికా,నాటో దళాలు ఆఫ్ఘన్ గడ్డపై అడుగుపెట్టాయి. అప్పటినుంచి ఉగ్రవాదులతో ఆ సైన్యం పోరు జరుపుతూనే ఉంది. ఓవైపు సాయుధ పోరు జరుపుతూనే మరోవైపు తాలిబన్లతో చర్చలపై అమెరికా దృష్టి సారించింది. ఫలితంగా గతేడాది మే 1న దోహాలో అమెరికా,తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటామని అమెరికా ప్రకటించింది. ఈ సెప్టెంబర్ 11వ తేదీలోగా సైన్యం ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. కానీ అంతకు రెండు నెలలు ముందు గానే అక్కడి నుంచి అమెరికా,నాటో దళాలు పూర్తి స్థాయిలో నిష్క్రమించాయి. అమెరికా తమ దళాలను ఉపసంహరించుకోవడమే ఆలస్యం తాలిబన్లు రెచ్చిపోతున్నారు. రక్తపుటేరులు పారిస్తూ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications