
షాకింగ్: రక్షణ మంత్రి ఇంటి వద్ద పేలుడు -తుపాకితో లోపలికి దూరిన దుండగుడు -సైన్యం వెనుకంజ
భారత్ తో సరిహద్దును పంచుకునే అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనలు పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత అక్కడి పరిస్థితి ఇంకాస్త దిగజారింది. దేశంపై పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న తాలిబన్లు అంతకంతకూ పేట్రేగుతున్నారు. వాళ్లను నిలువరించడంలో సైన్యం దాదాపు వెనుకంజ వేస్తున్నది. ఈ క్రమంలో అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి..
అఫ్గానిస్థాన్ రక్షణ శాఖ మంత్రి బిస్మిల్లా ఖాన్ మోహ్మదీ ఇంటి వద్ద భారీ పేలుడు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. శక్తిమంతమైన పేలుడు తర్వాత అనుమానిత ఉగ్రవాది ఒకడు మంత్రి ఇంట్లోకి జొరబడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

అఫ్గాన్ రక్షణ మంత్రి ఇంటి వద్ద పేలుడు జరిగిన ప్రదేశంలోనే పలు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల నివాస సముదాయాలు, వివిధ దేశాల విదేశాంగ కార్యాలయాలు ఉండటంతో ఆందోళన రెట్టింపైంది.
అమెరికా సేనలు వెళ్లిపోయిన తర్వాత అఫ్గాన్ పై పట్టుకోసం తాలిబన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల భీక పోరాటం జరుగుతోంది. అఫ్గానిస్థాన్‌లో సైన్యం, తాలిబన్ల మధ్య ఘర్షణల్లో రోజుకు 40 మంది పౌరులు మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.
Recommended Video
తాలిబన్ల అరాచకాలు పెరగడంతో ప్రజలంతా ప్రాణాలు అరచేత పట్టుకొని భయం భయంగా బతుకుతున్నారు. తాజాగా కాందహార్‌లో తాలిబన్లు మరోసారి పేట్రేగిపోయారు. కాందహార్ విమానాశ్రయంపై తాలిబన్లు రాకెట్లతో విరుచుకుపడ్డారు. మూడు రాకెట్లతో దాడి చేయగా.. ఎయిర్ పోర్టు రన్ వేను తాకి తీవ్రంగా దెబ్బ తిన్నది. దీంతో కాందహార్ ఎయిర్‌పోర్టుకు విమాన రాకపోకలను నిలిపివేసి రన్ వే మరమ్మతులు చేస్తున్నారు.