మహిళపై గ్యాంగ్ రేప్: 7గురు దోషులకు మరణశిక్ష
కాబూల్: బలవంతంగా పొలాల్లోకి తీసుకుని వెళ్లి మహిళపై అత్యాచారం చేసిన కేసులో ఏడుగురు దోషులకు మరణశిక్ష విధిస్తూ అఫ్గనిస్తాన్ కోర్టు ఆదివారం తీర్పు చెప్పింది. మహిళపై అత్యాచారంతో పాటు దోపిడీకి పాల్పడిన ఈ సంఘటనను అత్యంత అరుదైన కేసుగా పరిగణించి కోర్టు వారికి మరణశిక్ష విధించింది. దేశంలో ఇటువంటి నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే మరిన్ని సంఘటనలు ఇటువంటివి జరిగే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
అఫ్గనిస్తాన్‌లోని పగ్మన్ జిల్లాలో గత నెల వివాహానికి హాజరై వాహనాల్లో తిరిగివస్తున్న పలు కుటుంబాలకు చెందినవారిపై పోలీసు దుస్తులు ధరించి కొందరు వ్యక్తులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేస్తూ వాహనాల్లో ఉన్నవారిపై దాడి చేసి బంగారం, నగదు దోచుకెళ్లారు. అంతేకాకుండా ఓ మహిళను సమీపంలోని పొలాల్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు.

ఈ సంఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగించారు. సామూహిక అత్యాచారం చేసినవారిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దాంతో నిందితులను విచారించి, కోర్టు వారికి మరణ శిక్ష విధించింది.
మారువేషంలో ఇలా దాడి సామూహిక అత్యాచారం జరిపిన దోషులకు శిక్ష పడడం కాబూల్ చరిత్రలో ఇంతకు ముందు తాను చూడలేదని కాబూల్ నగర పోలీసు ఉన్నతాధికారి జహీర్ చెప్పారు.












Click it and Unblock the Notifications