తాలిబన్లకు ఐరాస భద్రత మండలి వార్నింగ్: భారత్ సారథ్యంలో..కీలక తీర్మానం
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లిన తరువాత.. ఇదివరకట్లాగే ఆ దేశం భయానక ఉగ్రవాదులకు అడ్డగా మారే అవకాశం ఉందనే భయాందోళనలు ప్రపంచ దేశాల్లో వ్యక్తమౌతోన్నాయి. ఇస్లామిక్ స్టేట్స్, అల్-ఖైదా, జైషె మహ్మద్, లష్కర్-ఎ- తొయిబా వంటి టెర్రరిస్ట్ అవుట్ ఫిట్స్ అన్నీ తాలిబన్ల పరిపాలనలో మళ్లీ పునరుజ్జీవం పొందుతాయని, పొరుగు దేశాలపై దాడులకు పాల్పడుతాయనే ఆందోళనలు మొదటి నుంచీ వ్యక్తమౌతూనే ఉన్నాయి.

భయంభయంగా..
ఈ ఆందోళనలు, అనుమానాలకు మరింత బలాన్ని కలిగించేలా అవాంఛనీయ పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్నాయి. నివురు గప్పిన నిప్పులా ఉంటోంది రాజధాని కాబుల్. ఎప్పుడు, ఎటు నుంచి ఏ ఉగ్రదాడి జరుగుతుందో తెలియని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. మృత్యువుతో నిత్యం పోరాడే దుస్థతికి చేరుకున్నారు ఆఫ్ఘనిస్తానీయులు. ఇటీవలే కాబుల్‌లోని లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సంభవించిన మారణ హోమాన్ని కళ్లారా చూశారు. జంట పేలుళ్లతో వణికి పోయారు.

అమెరికా ఉపసంహరణతో మరింత..
అదే సమయంలో- అమెరికా సైన్యం పూర్తిగా తన బలగాలను ఉపసంహరించుకోవడం.. తాలిబన్లు, అక్కడ వేళ్లూనుకునే అవకాశం ఉందంటూ అనుమానిస్తోన్న ఉగ్రవాదులు మరింత పేట్రేగిపోవడానికి కారణమౌతుందనే అంచనాలు ఉన్నాయి. అమెరికా తన సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్న వెంటనే తాలిబన్లు పండగ చేసుకున్నారు. దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చిందంటూ బాణాసంచా పేల్చారు. అమెరికా నుంచి పూర్తి విముక్తి లభించిందని, ఇక తాము చెప్పిందే చట్టం అవుతుందని తాలిబన్లు స్పష్టం చేస్తోన్నారు.

ఉగ్ర మూకకు షెల్టర్ జోన్..
ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ అక్కడ దాడులకు తెగబడుతోంది. మానవబాంబులను తయారు చేస్తోంది. ఆత్మాహూతిదాడులకు దిగుతోంది. జంట పేలుళ్లతో కాబుల్‌ను వణికించింది కూడా. ఈ దాడి ఘటనలో 160 మందికి పైగా ఆప్ఘనిస్తానీయులు దుర్మరణం పాలయ్యారు. అల్-ఖైదా కీలక నేత అమీనుల్ హక్ కూడా ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత అతను స్వదేశానికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కీలక తీర్మానం..
ఈ పరిణామాలన్నింటినీ ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ముందే ఊహించింది. ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులకు షెల్టర్ జోన్‌గా మారకూడదని పేర్కొంది. తమ దేశ పౌరులపై గానీ.. పొరుగు దేశాలపై గానీ ఉగ్రవాద దాడులను ప్రోత్సహించేలా, టెర్రరిస్టులను ప్రేరేపించేలా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. భద్రత మండలి సమావేశానికి భారత్ సారథ్యాన్ని వహించింది.

రష్యా, చైనా దూరం..
భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఈ సమావేశానికి హాజరయ్యాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 13 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. రష్యా, చైనా మాత్రం దూరంగా ఉన్నాయి. తాలిబన్ల పరిపాలనలో ఆప్ఘనిస్తాన్.. ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకూడదని భద్రత మండలి తన తీర్మానంలో పొందుపరిచింది. అదే సమయంలో దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కల్పించాలని సూచించింది.
Recommended Video

ఆ ప్రకటనకు కట్టుబడి..
ఇప్పటికీ ఆప్ఘనిస్తాన్‌లో నివసిస్తోన్న విదేశీయులు తమ స్వస్థలాలకు సురక్షితంగా చేరుకునేలా తాలిబన్ల తక్షణ చర్యలను తీసుకోవాలని భద్రత మండలి సూచించింది. వారికి సేఫ్ ప్యాసేజ్ కల్పించాల్సిన బాధ్యత తాలిబన్లపైనే ఉందని తెలిపింది. దేశం విడిచి వెళ్లదలిచిన ఆప్ఘనిస్తానీయులను తాము అడ్డుకోబోమని, వారి కోసం సరిహద్దులను తెరిచి ఉంచుతామంటూ ఈ నెల 27వ తేదీన ఇచ్చిన ప్రకటనకు తాలిబన్లు కట్టుబడి ఉండాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications