వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గానిస్తాన్: తమకు శిక్షలు విధించిన మహిళా జడ్జిలను వెంటాడుతున్న తాలిబాన్లు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అఫ్గానిస్తాన్: వందలమంది మహిళా న్యాయమూర్తులు ప్రాణభయంతో బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.

గతంలో వాళ్లంతా అఫ్గానిస్తాన్‌ మహిళల హక్కులకు రక్షణ కవచంలా నిలిచారు. తమ దేశంలో అణగారిన వర్గంగా మారిన మహిళలకు చట్టంతో రక్షణ కల్పించారు. కానీ, పరిస్థితులు తలకిందులయ్యాయి. తాలిబాన్‌లు పాలన చేపట్టడంతో ప్రాణభయంతో వీరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

అయితే, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసేవారు, మాఫియా ముఠాలే తమ ప్రధాన శత్రువులని, మహిళా న్యాయమూర్తులను భయపెట్టే ఉద్దేశం లేదని తాలిబాన్‌ల ప్రతినిధులు అంటున్నారు.

తాలిబాన్‌లు అధికారం చేపట్టిన తర్వాత 220 మంది మహిళా జడ్జిలు ఇప్పుడు కనిపించకుండా పోయారు. వారిలో ఆరుగురు జడ్జిలు రహస్య ప్రాంతం నుంచి బీబీసీతో మాట్లాడారు. వారి భద్రత దృష్ట్యా అందరి పేర్లను మార్చి రాశాం.

ఒక న్యాయమూర్తిగా తన కెరీర్‌లో అనేక తీర్పులు ఇచ్చారు మసూమా. ముఖ్యంగా అత్యాచారం, హత్య, హింస, మహిళలకు వేధింపులకు సంబంధించి వందలమందిని ఆమె దోషులుగా నిర్ధారించారు.

కానీ, తాలిబాన్లు ఆమె నివసిస్తున్న నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కొద్ది రోజుల తర్వాత పాత నేరస్తులంతా జైలు నుండి విడుదలయ్యారు. అప్పటి నుంచి ఆమెను హత్య చేస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి.

టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ నోట్స్, ఇంకా గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఆమె ఫోన్‌కు కాల్స్ వరద మొదలైంది.

"తాలిబాన్లు ఖైదీలందరినీ జైలు నుండి విడుదల చేశారని మాకు అర్ధరాత్రి సమయంలో తెలిసింది. ఇల్లూ వాకిలి వదిలి వెంటనే పారిపోయాం" అని మసూమా చెప్పారు.

గత 20 ఏళ్ల కాలంలో 270 మంది మహిళలు అఫ్గానిస్తాన్‌లో న్యాయమూర్తులుగా పని చేశారు. దేశంలో అత్యంత శక్తివంతమైన, ప్రముఖ మహిళలుగా వారు గుర్తింపు పొందారు.

"కారులో ప్రయాణిస్తున్నప్పుడు బుర్ఖా ధరించాను. దీంతో ఎవరూ నన్ను గుర్తించలేదు. అదృష్టవశాత్తూ మేము అన్ని తాలిబాన్ చెక్‌పోస్టులను ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటిపోగలిగాము. " అన్నారు మసూమా.

ఇల్లు వదిలి బయటకు వచ్చిన కాసేపటికే ఆమె ఇంటికి కొందరు తాలిబాన్ సభ్యులు వచ్చి వెళ్లారని పొరుగింటి వారు మసూమాకు మెసేజ్ చేశారు.

వాళ్లు ఎందుకు వచ్చారో తనకు అర్ధమైందని మసూమా అన్నారు. తాలిబాన్‌ల ఆక్రమణకు కొన్ని నెలల ముందు ఆ గ్రూప్‌కు చెందిన ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మసూమా తీర్పునిచ్చారు.

భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో అతడు నిందితుడు. ఆయనకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు మసూమా.

"నాకు ఇప్పటికీ ఆ అమ్మాయి ముఖం గుర్తుకు వస్తుంటుంది. అది చాలా ఘోరమైన హత్య'' అన్నారామె.

కేసు విచారణ పూర్తయ్యాక సదరు నిందితుడు మసూమాకు ఎదురయ్యారు. ''నేను జైలు నుంచి బైటికి వచ్చిన తర్వాత నా భార్యను చంపినట్లే నిన్ను కూడా చంపుతా'' అని హెచ్చరించాడని మసూమా గుర్తు చేసుకున్నారు.

"అప్పుడు నేను అతడిని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత అతను నాకు చాలాసార్లు ఫోన్ చేసాడు. నా వివరాలన్నీ కోర్టు నుంచి తీసుకున్నానని చెప్పాడు'' అన్నారు మసూమా.

''నువ్వెక్కడున్నా వెతికి ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించాడు'' అని వెల్లడించారామె.

తాలిబాన్: కొత్త ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదంటూ విలపిస్తున్న ఓ మహిళ

బెదిరింపుల పర్వం

కనీసం 220 మంది మాజీ మహిళా న్యాయమూర్తులు ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో అజ్ఞాతంలో ఉన్నారని బీబీసీ దర్యాప్తులో తేలింది. వివిధ ప్రావిన్సుల నుండి ఆరుగురు మాజీ న్యాయమూర్తులతో బీబీసీ మాట్లాడింది. గత ఐదు వారాలుగా సాగిన ఈ సంభాషణలు దాదాపు ఒకేలా ఉన్నాయి.

గతంలో తాలిబాన్‌లను జైలుకు పంపిన మహిళా జడ్జిలందరికీ బెదిరింపులు వచ్చాయి. భార్యలను చంపిన కేసుల్లో శిక్షను ఎదుర్కొన్న కొందరు నిందితుల పేర్లను నలుగురు న్యాయమూర్తులు చెప్పగలిగారు.

బెదిరింపు కాల్స్ కారణంగా వీరిలో చాలామంది ఫోన్ నంబర్లను మార్చుకున్నారు. తెలిసిన వారి ఇళ్లకు మారుతూ వారు ప్రాణాలు రక్షించుకుంటున్నారు. వీరిలో చాలామంది జడ్జిల ఇళ్లను ఇప్పటికే తాలిబాన్ సభ్యులు తనిఖీ చేసి వారి ఆచూకీ గురించి వాకబు చేశారు.

అయితే ఈ ఆరోపణలపై తాలిబాన్‌ల అధికార ప్రతినిధి బిలాల్ కరీమీ స్పందించారు.

''మహిళా న్యాయమూర్తులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. వారిని ఎవరైనా బెదిరించినట్లు ఫిర్యాదులు వస్తే, అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటాం'' అని బీబీసీతో అన్నారు కరీమీ.

అఫ్గానిస్తాన్‌ అంతటా తమకు వ్యతిరేకంగా పని చేసిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ క్షమాభిక్ష పెట్టిన విషయాన్ని కరీమీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఖైదీల విడుదల సమయంలో తాలిబన్లతో సంబంధం లేని చాలా మంది నేరస్తులు కూడా బైటికి వచ్చారు.

మహిళా న్యాయమూర్తుల భద్రత గురించి ప్రశ్నించినప్పుడు "మేం మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు, మాఫియా సభ్యుల విషయంలోనే కఠినంగా ఉంటాం'' అన్నారు కరీమీ

ఉన్నత విద్యావంతులైన ఈ మహిళా న్యాయమూర్తులు. వారే కుటుంబానికి ప్రధాన ఆధారం. కానీ ఇప్పుడు వారి జీతాలు నిలిపేయడం, బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేయడంతో వారంతా అప్పులు చేసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాలిబాన్: తాలిబాన్ల అణచివేత ధోరణికి నిరసనగా ఆందోళన నిర్వహిస్తున్న అఫ్గాన్ మహిళలు

మహిళల హక్కులపై తీర్పులు

మూడు దశాబ్దాలకు పైగా జడ్జిగా పని చేసిన సనా, మహిళలు, పిల్లలపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు. ఆమె దగ్గరకు వచ్చిన కేసుల్లో నిందితులు చాలామంది తాలిబాన్, ఐసిస్‌లో సభ్యులు. వారిలో చాలామందికి శిక్షలు పడ్డాయి.

"విడుదలైన ఖైదీల నుండి నాకు 20కి పైగా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి" అన్నారు సనా. ప్రస్తుతం ఆమె తన డజనుకు పైగా కుటుంబ సభ్యులతో అజ్ఞాతంలో ఉన్నారు.

ఒకసారి ఆమె కుటుంబంలోని మగ వ్యక్తి ఒకరు ఇంటికి తిరిగి వచ్చి, దుస్తులు సర్దుతుండగా తాలిబాన్‌ కమాండర్లు వచ్చారు. "నేను తలుపు తెరిచాను. ఇది న్యాయమూర్తి ఇల్లు కాదా అని వారు నన్ను అడిగారు" అని ఆయన చెప్పారు.

"ఆమె ఎక్కడుందో నాకు తెలియదని నేను చెప్పగానే నన్ను వారు మెట్ల మీద నుంచి తోశారు. ఒకరు నన్ను తుపాకీ మడమతో కొట్టారు. నా ముక్కు నుంచి, నోటి నుంచి రక్తం వచ్చింది'' అని ఆయన వివరించారు. తాలిబాన్లు వెళ్లిన తర్వాత ఆయనను సనా బంధువు ఒకరు ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

"మనం ఇంటిని తరచూ మారుస్తూ ఉండాలి. ఇంతకన్నా వేరే మార్గం లేదు. పాకిస్తాన్ కు వెళ్లినా మనకు రక్షణ లేదు'' అని అతని బంధువు వివరించారు.

తాలిబాన్ గార్డులు

మహిళల దుస్థితి

ప్రజలు నివసించడానికి అత్యంత కష్టతరమైన దేశాలలో ఒకటిగా అఫ్గానిస్తాన్ దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం, 87% మహిళలు, బాలికలు తమ జీవితకాలంలో హింసను అనుభవిస్తున్నారు.

అయితే, ఈ మహిళా న్యాయమూర్తులు వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ఎన్నో కేసులను క్షుణ్నంగా విచారించారు. నిందితులకు శిక్షలు విధించారు. తద్వారా మహిళలపై జరిగే హింసను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అత్యాచారం, హింస, బలవంతపు వివాహాలతోపాటు, మహిళల ఆస్తి హక్కును నిరోధించిన వారికి కూడా శిక్షలు విధించారు. తమ కెరీర్‌లో ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నామని ఈ ఆరుగురు మహిళా న్యాయమూర్తులు ఇంతకు ముందే వెల్లడించారు.

"నేను నా దేశానికి సేవ చేయాలనుకున్నాను. అందుకే నేను న్యాయమూర్తి అయ్యాను" అని అస్మా అనే న్యాయమూర్తి ఓ రహస్య ప్రదేశం నుంచి బీబీసీకి వివరించారు.

ఫ్యామిలీ కోర్టులో ఎక్కువగా విడాకుల కేసులు, లేదంటే తాలిబాన్ సభ్యుల నుంచి విడిపోవాలనుకునే మహిళలకు సంబంధించిన కేసులను తాను తీర్పులు ఇచ్చినట్లు అస్మా వెల్లడించారు.

"అదే మాకు శాపంగా మారింది. ఒకసారి, తాలిబాన్లు కోర్టు దగ్గర రాకెట్లను కూడా ప్రయోగించారు. మా స్నేహితురాలైన ఓ న్యాయమూర్తిని కోల్పోయాం. ఆమె ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు అదృశ్యమైంది. తర్వాత ఆమె శరీరం మాత్రమే దొరికింది" అన్నారు అస్మా.

అదృశ్యమైన న్యాయమూర్తి హత్యకు సంబంధించి ఎవరిపైనా కేసులు పెట్టలేదు. ఆ సమయంలో, స్థానిక తాలిబాన్ నాయకులు తమ ప్రమేయం లేదని ఖండించారు.

తాలిబాన్ ఆక్రమణకు ముందు పాఠశాలల్లో అఫ్గాని బాలికలు

కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది?

మహిళల హక్కుల విషయంలో అఫ్గానిస్తాన్ కొత్త నాయకత్వం ఎంత సీరియస్‌గా ఉంటుందో ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. కానీ ఇప్పటి వరకు వారి ప్రవర్తన మాత్రం సానుకులంగా కనిపించడం లేదు.

ప్రస్తుత మంత్రి వర్గంలో అందరూ పురుషులే ఉన్నారు. మహిళా హక్కుల వ్యవహారాల కోసం ఎవరినీ నియమించలేదు. మగ ఉపాధ్యాయులు, విద్యార్థులు స్కూళ్లకు రావాలని ఆదేశించారు కానీ, మహిళలకు ఇంత వరకు అనుమతి లభించ లేదు.

తాలిబాన్ల పాలనలో మళ్లీ మహిళా న్యాయమూర్తులు కనిపిస్తారా అన్న ప్రశ్నకు '' మహిళలకు ఉద్యోగాలు, అవకాశాల గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి'' అని కరీమీ అన్నారు.

ఇప్పటి వరకు లక్షమందికి పైగా ప్రజలు దేశం నుండి వెళ్లి పోయారు.

బీబీసీతో మాట్లాడిన ఆరుగురు న్యాయమూర్తులు కూడా తాము ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నామని, కానీ తమ దగ్గర డబ్బు లేదని, కుటుంబ సభ్యులందరికీ పాస్‌పోర్టులు కూడా లేవని వెల్లడించారు.

మాజీ మహిళా న్యాయమూర్తులందరినీ తక్షణమే విదేశాలకు తరలించాలని ప్రస్తుతం యూకేలో ఉంటున్న అఫ్గానిస్తాన్ మాజీ రాయబారి మార్జియా బాబాఖర్‌హైల్ అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారికి రక్షణ రక్షణ అవసరమని ఆమె అన్నారు.

"ఓ గ్రామీణ ప్రాంతం నుంచి ఒక మహిళా న్యాయమూర్తి నాకు చేసిన కాల్ నా గుండెలను పిండేసింది. మేం ఇంకెక్కడికి వెళ్లాలి, సమాధుల్లోకే అని ఆమె అన్నారు'' అని మార్జియా వెల్లడించారు.

"ఈ న్యాయమూర్తులలో చాలామందికి పాస్‌పోర్ట్ లేదా సరైన పేపర్‌వర్క్ లేదు. కానీ, వారంతా పెను ప్రమాదంలో ఉన్నారు'' అన్నారామె.

న్యూజీలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా అనేక దేశాలు తాము కొంత వరకు సహకారం అందిస్తామని తెలిపాయి. అయితే ఈ సహాయం ఎప్పుడు వస్తుంది లేదా ఎంతమంది న్యాయమూర్తులను వీరు తీసుకోగలరనేది ఇంకా స్పష్టం కాలేదు.

ఇలాంటి సహాయాలు సమయానికి అందుబాటులోకి రావడం లేదని మసూమా అంటున్నారు. "ఒక్కోసారి నేను చేసిన నేరమేంటి, చదువుకోవడమే తప్పా, మహిళలకు న్యాయం చేసినందుకు మమ్మల్ని శిక్షిస్తున్నారా అనిపిస్తుంది'' అని మసూమా వ్యాఖ్యానించారు.

"నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. కానీ ఇప్పుడు నేను ఖైదీని. మా దగ్గర డబ్బు లేదు. మేము ఇల్లు వదిలి వెళ్ళలేము'' అన్నారామె.

"మేం మళ్లీ స్వేచ్ఛగా ఉండే రోజు కోసం నేను ప్రార్థించడం మాత్రమే నేను ఇప్పుడు చేయగలిగింది'' అన్నారు మసూమా.

(అదనపు సమాచారం అహ్మద్ ఖలీద్ నుంచి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Afghanistan: Talibans hunt women judges who sentenced them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X