వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గానిస్తాన్‌: ‘తాలిబాన్ల పాలనలో జరిగిన అఘాయిత్యాలు, కొరడా దెబ్బలను మహిళలు ఇంకా మర్చిపోలేదు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

తాలిబాన్లు అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత, తమ దేశ ప్రజలకు మేలు చేస్తామని, వారి జీవితాలను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడతామని అన్నారు.

women

కానీ అందుకు భిన్నంగా కాబుల్ విమానాశ్రయానికి పరుగులు పెడుతున్న వ్యక్తులు, తుపాకీ కాల్పులు, విమానం ఎక్కడానికి తోసుకుంటున్న జనాల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి చాలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి.

మహిళలు, పిల్లల పట్ల ఆందోళన

ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో తాజా పరిణామాల దృష్ట్యా మహిళలు, పిల్లల పరిస్థితి ఎలా మారుతుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

"ఈ రోజుల్లో నన్నెవరైనా 'ఎలా ఉన్నావు?' అని అడిగితే నాకు కళ్లంట నీళ్లు వచ్చేస్తున్నాయి. బాగానే ఉన్నానని చెబుతున్నాను. కానీ వాస్తవానికి మేము బాగాలేము. మేం ఇప్పుడు దుఃఖిస్తున్న పక్షుల్లా ఉన్నాం.

మా ఎదరంతా పొగమంచుతో కప్పేసి ఉంది. మా ఇళ్లు నాశనం చేశారు. జరుగుతున్నది చూస్తుండడం, గుండెలు బాదుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి" అంటూ మహిళా హక్కుల కార్యకర్త, అఫ్గానిస్తాన్ ఎన్నికల కమిషన్ మాజీ సభ్యురాలు జార్మీనా కాకర్ వాపోయారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ, అఫ్గానిస్తాన్‌లో అన్ని ప్రాంతాలవారు ముఖ్యంగా మధ్య అఫ్గానిస్తాన్‌లోని కాబుల్ ప్రాంత ప్రజలు తమ భవిష్యత్తు పట్ల తీవ్ర భయాందోళలకు గురవుతున్నారని చెప్పారు.

"అందరికన్నా ఎక్కువగా మహిళలు, యువత బాగా భయపడుతున్నారు. గత ఇరవై ఏళ్లలో ఇక్కడే పుట్టి పెరిగిన యువతీయువకులు తీవ్ర అభద్రతాభావానికి లోనవుతున్నారు. కాబుల్‌లో ఉన్న మహిళలు భయంతో అక్కడి నుంచి పారిపోతున్నారు. తాలిబాన్ల పాలనలో తమపై జరిగిన అఘాయిత్యాలు, కొరడా దెబ్బలను అఫ్గాన్ మహిళలు ఇంకా మర్చిపోలేదు"

తాలిబాన్ పాలిత ప్రాంతాల్లో మహిళలను శవపేటికల్లో దాచి పాకిస్తాన్ తరలిస్తున్నారని కాబుల్‌లో ఆశ్రయం పొందిన మహిళలు చెప్పారని ఆమె అన్నారు.

తాలిబాన్ల హామీలు

సోషల్ మీడియాలో కూడా అఫ్గానిస్తాన్‌లోని మహిళల పరిస్థితి పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే మహిళలు, పిల్లలు ఏ రకంగా కూడా భయపడాల్సిన అవసరం లేదని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షహీన్ గతంలో బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

మేము వారి గౌరవం, ఆస్తి, పని, చదువుకునే హక్కులను కాపాడేందుకు అంకితభావంతో కృషి చేస్తాం. వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు. విద్య, ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం కన్నా కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు.

ఓవైపు, తాలిబాన్లు వారి హామీలు వారు ఇస్తూనే ఉన్నారు. మరోవైపు, తమకు సహాయం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని అఫ్గానిస్తాన్‌లోని కొందరు మహిళలు అభ్యర్థిస్తున్నారు.

ఎంపీ మరియం సమా కాబుల్ నుంచి బయటపడగలిగారు కానీ, ఇంకా అక్కడే ఉన్న తన కుటుంబం గురించి తీవ్రంగా దిగులు చెందుతున్నారు.

"దేశంలోని పరిస్థితిపై మహిళలు, పిల్లలు చాలా భయపడుతున్నారు. ఇకపై తమ అస్తిత్వం పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే, వారికి చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి ఎంతమాత్రం అవకాశాలు ఉండవు. మేం మా దేశాన్ని కోల్పోతాం. ఇది చాలా బాధ కలిగించే విషయం. ప్రమాదకరమైనది కూడా.

అఫ్గాన్ పరిస్థితిపై ప్రపంచం దృష్టి సారించకపోతే తాలిబాన్లు అధికారంలోకి వస్తారు. ఆపై పరిస్థితి చేయి దాటిపోతుంది. తాలిబాన్ అంటే మా దేశాన్ని నడిపించే పాకిస్తాన్. దాంతో తీవ్రవాదం కూడా పెచ్చుమీరిపోతుంది. ప్రపంచం పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురావాలి. వారిపై ఆంక్షలు విధించాలి. ఇది చాలా త్వరగా జరగాలి. ఎందుకంటే తాలిబాన్లు అధికారంలోకి వచ్చే రోజు ఎంతో దూరం లేదనే భయం కలుగుతోంది. ఇది అఫ్గానిస్తాన్ కోసం మాత్రమే కాదు. మొత్తం ప్రపంచ భద్రతకు ఇది ముఖ్యం" అని సమా అన్నారు.

అంతటా అనిశ్చితి

అఫ్గానిస్తాన్‌లో ఉన్న జర్నలిస్టు ఫాతిమా హొసైనీ కూడా అక్కడ ఉన్న అనిశ్చితి పట్ల తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు.

ఎన్‌వన్ సీఎన్ఎన్ న్యూస్ ప్రొడ్యూసర్, యాంకర్ ఇకా ఫెర్రర్ గోటిక్‌తో ఫాతిమా మాట్లాడుతూ, మా కోసం ప్రపంచం తలుపులు తెరిచే ఉంచుతుందని ఆశిస్తున్నాం అని అన్నారు.

"ఇది చాలా దారుణమైన పరిస్థితి. మా లాంటి స్కాలర్లు, మహిళల పరిస్థితి అనిశ్చితితో నిండిపోయింది. మున్ముందు ఏం జరగబోతోందో తెలీదు. అఫ్గానిస్తాన్‌ను మర్చిపోవద్దని, మా చరిత్రను, ధైర్యవంతులైన మహిళలను, వారి గొంతులను మర్చిపోవద్దని ఒక జర్నలిస్టుగా నేను ప్రపంచాన్ని వేడుకొంటున్నాను" అని ఆమె అన్నారు.

ఫాతిమాతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లేదా నెట్‌వర్క్ కవరేజి ఏరియాలో లేదని వస్తోంది.

నమ్మకం పోయింది

అరవై, డెబ్భై ఏళ్లనాటి అఫ్గానిస్తాన్ ఫొటోలను సోషల్ మీడియాలో అనేకమంది షేర్ చేస్తున్నారు. అప్పటి మహిళల పరిస్థితిని, తాలిబాన్ పాలనలోని మహిళల పరిస్థితితో పోలుస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

స్వతంత్ర ఫిల్మ్‌మేకర్ సహ్రా కరీమీ, సినిమా ప్రేమికులను, చిత్ర పరిశ్రమను సహాయం కోసం అర్థిస్తూ ఓ లేఖ రాశారు.

"ప్రపంచం మనకు వెన్ను చూపకుండా ఉండాలని ఆశిద్దాం. అఫ్గానిస్తాన్ మహిళలకు, పిల్లలకు, కళాకారులకు, ఫిల్మ్‌మేకర్స్‌కు మీ మద్దతు, సహాయం అవసరం" అని ఆ లేఖలో కోరారు.

మేం గత కొన్నేళ్లుగా అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్నాం. తాలిబాన్ల విశ్వాసాలను మేం వ్యతిరేకిస్తాం. వారికి వ్యతిరేకంగా మేం ఎన్నోసార్లు గొంతు విప్పాం.

గత ఇరవై ఏళ్లల్లో అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధిరించడానికి మహిళలు ఎంతో పాటుపడ్డారు. ఇప్పుడు తాలిబాన్ల రాకతో మా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. తాలిబాన్లు మహిళల హక్కులను, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించరు" అంటూ జార్మీన్ కాకర్ విచారం వ్యక్తం చేశారు.

అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు క్షణ క్షణం ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. వారు పూర్తిగా నిరాశ నిస్పృహలలో మునిగిపోయారు.

"యుద్ధం చేసి, చేసి ప్రజలు అలిసిపోయారు. వారికి శాంతి కావాలి. మా సైనికుల మృతదేహాలు, ఈ భయానక పరిస్థితులు చూసి మేం విసిగిపోయాం. మా అందరి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి" అని జార్మీన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Afghanistan‌: ‘Women have not forgotten the atrocities of the Taliban regime’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X