కాబుల్ ఎయిర్‌పోర్ట్ మూసివేత: పాకిస్తాన్ సరిహద్దులకు తరలుతున్న ఆప్ఘన్లు
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్.. కరడుగట్టిన మత ఛాందసవాదులుగా గుర్తింపు పొందిన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి అక్కడ రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత రోజూ వార్తల్లో నిలుస్తోంది కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. తాలిబన్ల పరిపాలనకు భయపడి దేశం విడిచి వెళ్లడానికి అందుబాటులో ఉన్న వనరు అదొక్కటే కావడం వల్ల వేలాదిమంది రోజుల తరబడి కాబుల్ విమానాశయం వద్ద పడిగాపులు పడ్డారు.
అదే అదనుగా తీసుకుని ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్.. అదే ఎయిర్ పోర్ట్ వద్ద ఆత్మాహూతిదాడికీ పాల్పడ్డారు. ప్రాణాలకు ఏ మాత్రం గ్యారంటీ లేని పరిస్థితుల్లోనూ ఆఫ్ఘనిస్తానీయులు కాబుల్ ఎయిర్‌పోర్ట్‌ను వీడటానికి ఇష్ట పడలేదు. తెగించి అక్కడే రోజుల తరబడి నివసిస్తూ వచ్చారు. అలాంటి కాబుల్ ఎయిర్‌పోర్ట్.. ఇక మూత పడింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనిక బలగాల తరలింపు ప్రక్రియ ముగిసిన రెండోరోజే.. ఆ కాబుల్ విమానాశ్రయం నిద్రావస్థలోకి వెళ్లింది.

కాబుల్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆ వెంటనే తాలిబన్ ఫైటర్లు ఎయిర్‌పోర్ట్ వద్ద మోహరించారు. అక్కడున్న ఆప్ఘనిస్తానీయులందరినీ వెనక్కి పంపించేస్తోన్నారు. కాబుల్ విమానాశ్రయం మూత పడినప్పటికీ- దేశం వదిలి వెళ్లే ప్రయత్నాలను మాత్రం వారు కొనసాగిస్తూనే వస్తోన్నారు. విమానాశ్రయాన్ని వీడిన వేలాది మంది ఆఫ్ఘనిస్తానీయులు దేశ సరిహద్దులకు బయలుదేరుతున్నారు. అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనాల ద్వారా సరిహద్దులకు చేరుకుంటోన్నారు.
పాకిస్తాన్, ఇరాన్, తజకిస్తాన్.. వంటి సరిహద్దుల వద్ద బారులు తీరి నిల్చుంటున్నారు. ఈ క్రమంలో నగదును విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకుల ముందు కూడా వారు పడిగాపులు పడుతున్నారు. అమెరికా సైనిక బలగాలు పూర్తిగా దేశాన్ని వదిలి వెళ్లిన తరువాత తాలిబన్లు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులపై దృష్టి సారించారు. ఇప్పటికే బ్యాంకుల్లో లావాదేవీలను నిలిపివేసినట్లు వార్తలొచ్చాయి. ఆసుపత్రులు కూడా దాదాపు స్తంభించిపోయినట్టు తెలుస్తోంది.
ఇదిలావుండగా.. పాకిస్తాన్-ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని టోర్ఖామ్, ఇరాన్‌తో బోర్డర్‌ను పంచుకుంటోన్న ఇస్లామ్ ఖలా పాయింట్ వద్ద జనం తాకిడి పెరిగింది. హెరాత్ మీదుగా ఇస్లామ్ ఖలా సరిహద్దులకు కాలినడకన బయలుదేరుతున్నారు. ఈ పాయింట్‌ను దాటుకుంటే వారు ఇరాన్‌లో అడుగు పెడతారు. టేబాద్ చేరుకుంటారు. తమ దేశానికి శరణార్థులుగా తరలివచ్చే ఆప్ఘనిస్తానీయుల కోసం ఇరాన్, పాకిస్తాన్ ప్రభుత్వాలు కొన్ని సౌకర్యాలను కల్పించినట్లు వార్తలు రావడంతో ఈ రెండు పాయింట్ల వద్ద పెద్ద ఎత్తున జనం గుమికూడుతున్నారు.
అదే సమయంలో జలాలాబాద్ సమీపంలో ఉన్న టోర్ఖమ్ బోర్డర్ వైపు కూడా ఆప్ఘనిస్తానీయులు గుంపులు గుంపులుగా తరలి వెళ్తోన్నారు. టోర్ఖామ్ బోర్డర్‌ను దాటుకుంటే వారు పాకిస్తాన్‌లోని పెషావర్ నగరానికి చేరుకుంటారు. ఈ రెండు పాయింట్ల వద్ద ఇదివరకటి కంటే కూడా జనం తాకిడి భారీగా పెరిగిందని అక్కడి మీడియా చెబుతోంది. కాబుల్ విమానాశ్రయం ఇక పూర్తిస్థాయిలో నిద్రావస్థలో ఉంచడం వల్ల రాకపోకలు ఉండబోవని వారు భావిస్తోన్నారు.












Click it and Unblock the Notifications