ప్రధాని నివాసంలో ఫ్యాషన్ షోలు, ఖరీదైన ఈవెంట్లు -ఆర్థిక సంక్షోభం దెబ్బకు ఇమ్రాన్ బంగళా అద్దెకు
మన ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 'న్యూ ఇండియా' తరహాలోనే దాయాది పాకిస్తాన్ లోనూ పీఎం ఇమ్రాన్ ఖాన్ 'నయా పాకిస్తాన్' నినాదమిచ్చి, దేశాన్ని అన్ని రకాలుగా గట్టెక్కిస్తానని గట్టిగా చెప్పారు. కానీ నయా పాక్ సంగతి దేవుడెరుగు, ఉన్న పాకిస్తానే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితులు దాపురించాయి.
ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ మరో దారిలేక ప్రధాన మంత్రి అధికారిక నివాసాన్ని అద్దెకు పెట్టింది. ఈ నివాసాన్ని విశ్వవిద్యాలయంగా మార్చనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం 2019 ఆగస్టులో ప్రకటించింది. ఆ తర్వాత ఆయన ఆ ఇంటిని ఖాళీ చేశారు. తాజాగా విశ్వవిద్యాలయంగా మార్చాలనే ప్రతిపాదనను విరమించుకుని, ప్రైమ్ మినిస్టర్స్ హౌస్‌ను అద్దెకు ఇవ్వాలని ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయించినట్లు పాక్ మీడియా వెల్లడించింది.

పాక్ మీడియా కథనాల ప్రకారం, ప్రైమ్ మినిస్టర్స్ హౌస్‌లో అత్యాధునిక విద్యా సంస్థను ఏర్పాటు చేస్తామని ఫెడరల్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఇటీవల జరిగిన ఫెడరల్ కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇస్లామాబాద్‌లోని రెడ్ జోన్‌లో ఉన్న ఈ ప్రాంగణంలో సాంస్కృతిక, ఫ్యాషన్, విద్యా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించేందుకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు.
ఫ్యాషన్ షోలు, ఈవెంట్లు జరిగే సమయంలో ప్రైమ్ మినిస్టర్స్ హౌస్ గౌరవ, మర్యాదలకు భంగం కలగకుండా క్రమశిక్షణతో వ్యవహరించేలా చూడాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. దీనికోసం రెండు కమిటీలను ఏర్పాటు చేశారు.
Recommended Video
ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన బని గల నివాసంలో ఉంటున్నారు. అధికారిక కార్యకలాపాల కోసం ప్రధాన మంత్రి కార్యాలయాన్ని వినియోగిస్తున్నారు. ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాక్ ఆర్థిక వ్యవస్థ 19 బిలియన్ డాలర్లు పతనమైంది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడానికి ఆయన అనేక పొదుపు చర్యలను అమలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications