వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెజాన్ అడవులు: ‘మా ముగ్గురిని కూడా ఆక్రమణదారులు చంపేస్తారు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
స్మగ్లర్లు, ఆక్రమణదారులు తమ తెగలో మిగిలి ఉన్న ముగ్గురినీ చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అడవుల నరికివేత వల్ల కొన్ని మొక్కలు, జంతువులే కాదు...మనుషుల్లోని కొన్ని జాతులు కూడా అంతరించిపోతున్నాయి. అడవులపై ఆధారపడి బతికే ఆదివాసీ జాతుల జనాభా వేగంగా తగ్గిపోతోంది. బ్రెజిల్‌లోని అమెజాన్ అడవులను నరుకుతున్న తీరు తమకు బతుకు లేకుండా చేస్తోందని అక్కడి ఆదివాసీలు అంటున్నారు.

బ్రెజిల్‌లోని పిర్‌పికుర తెగలో ముగ్గురు వ్యక్తులు మాత్రమే బతికున్నట్లు భావిస్తున్నారు. ఒకవైపు రైతులు సాగు భూమి కోసం, మరోవైపు వ్యాపారులు కలప కోసం అమెజాన్ అడవులను నరకుతూ పోతుండటం వల్ల ఇటువంటి తెగలు అంతరించి పోయే దశకు చేరుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

మిగిలిన తన వాళ్లను కూడా చంపేస్తారేమోనని, ఆ తరువాత తమ తెగ అనేదే ఉండదని భయపడుతున్నారు పిర్‌పికుర తెగకు చెందిన రీతా. ఇప్పుడు ఈ తెగలో రీతాతోపాటు ఆమె సోదరుడు బైతా, మేనల్లుడు తమండువా మాత్రమే మిగిలారు.

అక్రమంగా కలప తరలించే వ్యాపారులు తమను కూడా చంపేస్తారేమోనని సెప్టెంబరులో విడుదల చేసిన ఒక వీడియో ఇంటర్వ్యూలో రీతా చెప్పారు. బయటి ప్రాంతాల వ్యక్తులతో రీతా కాంటాక్ట్‌లోనే ఉన్నప్పటికీ ఆమె సోదరుడు, మేనల్లుడు మాత్రం బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక చోట స్థిరమైన నివాసం లేకుండా బతుకుతున్నారు.

గెలవలేని యుద్ధం

బ్రెజిల్ దేశం మాటో గ్రొసో రాష్ట్రంలో ఉండే పిర్‌పికుర రక్షిత ప్రాంతం ఆక్రమణలకు గురవుతోంది. పిర్‌పికుర జాతి నివసించే ఈ ప్రాంతాన్ని చట్టప్రకారం రిజర్వుడ్ జోన్‌గా ప్రకటించినా రైతులు, కలప వ్యాపారుల ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. కొన్ని తరాలుగా ఈ ఆదివాసీ తెగపై దాడులు జరుగుతున్నా ఇటీవల కాలంలో మరింత పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఆగస్టు 2020 నుంచి జులై 2021 మధ్య పిర్‌పికుర రక్షిత జోన్‌లో సుమారు 24 చదరపు కిలోమీటర్ల మేర అడవులను కొట్టివేసినట్లు నవంబరు ప్రారంభంలో ఎన్‌జీఓ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ చెబుతోంది. ఇతర ఆదివాసీ తెగలు కూడా ఇదే రకమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. వీటిలో పిర్‌పికుర తెగది మరీ దయనీయ స్థితి.

'పిర్‌పికుర తెగ అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది. కొద్ది రోజుల్లో వారిని చంపేస్తారు' అని ఎన్‌జీఓ సర్వైవల్ ఇంటర్నేషనల్‌కు చెందిన సారా షెంకర్ బీబీసీతో అన్నారు.

బైతా, తమండువాలు నివసిస్తున్న ప్రాంతానికి ఆక్రమణదారులు మరింత చేరువగా వస్తున్నారని బ్రెజిల్ ఆదివాసీ వ్యవహారాల విభాగానికి చెందిన మాజీ అధికారి లియోనార్డో లెనిన్ అంటున్నారు. అధికారులను సైతం చొరబాటుదార్లు బెదిరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయని లెనిన్ చెబుతున్నారు.

తమండువా, బైతా అనే ఈ ఇద్దరు మగవాళ్లే పిర్‌పికురా తెగలో జీవించి ఉన్న మగవాళ్లు

ఒంటరి జాతుల దుస్థితి

బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా జీవించే జాతుల పరిస్థితి ఎలా ఉంటుందో పిర్‌పికుర తెగను చూస్తే తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని తెగలు చిన్నచిన్న సమూహాలుగా విడిపోయి, ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా అడవుల్లో ఒంటరిగా జీవిస్తుంటాయి. వీరికి మైదాన ప్రాంతాల వారితోనూ ఎటువంటి సంప్రదింపులుండవు.

ప్రపంచవ్యాప్తంగా ఇటువంటివి 100 సమూహాల వరకు ఉంటాయని భావిస్తుండగా, వీటిలో సగానికిపైగా సమూహాలు అమెజాన్ అడవుల్లో ఉన్నాయి.

ఇలా ఒంటరిగా జీవించే వారిని ఆక్రమణదారులు సులభంగా టార్గెట్ చేసుకుంటున్నారు. ఇలాంటి దాడుల వల్లనే పిర్‌పికుర జాతి అంతరించి పోయే దశకు చేరుకుంది. 1970లలో ఈ తెగకు చెందిన చాలా మందిని ఆక్రమణదారులు చంపేశారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి సోకిన వైరస్‌ల వల్ల మరికొందరు చనిపోయారు.

గతంలో ఒక ఊచకోత నుంచి ప్రాణాలతో బయటపడ్డ రీతా, తమ బంధువుల్లో తొమ్మిది మందిని ఆక్రమణదారులు చంపినట్లు చెబుతున్నారు. బయటి నుంచి పెరిగిన దాడుల వల్ల పిర్‌పికుర తెగ జీవనశైలిలో కూడా మార్పు వచ్చింది.

'వారి భాషను చూస్తే వ్యవసాయానికి సంబంధించిన పదాలు ఉన్నాయి. అంటే గతంలో వారు కొంత మేరకు వ్యవసాయ సమాజానికి చెందినవారై ఉండాలి. కానీ 1970ల నుంచి వారు స్థిరనివాసం లేకుండా వేటాడుతూ బతుకుతున్నార'ని లెనిన్ అంటున్నారు. మనుగడ కోసం వారు ఎంచుకున్న మార్గం ఇది.

బ్రెజిల్ ఆదివాసీల వ్యవహారాలు చూసే అధికారులు 1984లో పరిశీలించినప్పుడు పిర్‌పికుర తెగలో 15 నుంచి 20 మంది మాత్రమే ఉన్నట్లు తెలిసింది. 1990ల తరువాత బైతా, తమండువాలు మాత్రమే కనిపిస్తున్నారు.

గతంలో వీరు తమ ఇతర బంధువుల కదలికల గురించి చెప్పేవారని, కానీ కొద్ది సంవత్సరాలుగా బంధువుల గురించి బైతా, తమండువా ఏమీ చెప్పడం లేదని పిర్‌పికుర తెగతో పని చేసిన ఫాబ్రిసియో ఆమోరిమ్ అంటున్నారు. చెప్పనంత మాత్రాన వారు చనిపోయారని భావించలేమని, అయినా ఈ తీరు మంచిది కాదని వివరించారు.

బయటి నుంచి వచ్చి అనేక రకాల వైరస్‌ల కారణంగా అమెజాన్ అడవుల్లోని అనేక తెగలు అంతరించిపోతున్నాయి.

'అధ్యక్షుని వ్యతిరేకత వల్లే'

అమెజాన్ అడవుల నరికివేతకు సహకరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో వల్లే పిర్‌పికుర వంటి జాతులు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయని ఆదివాసీ తెగల హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

2019లో అధ్యక్షుడు కావడానికి ముందు నుంచే ఆదివాసీల కోసం ప్రత్యేకంగా అడవులను రక్షిత జోన్లుగా ప్రకటించడాన్ని బొల్సొనారో వ్యతిరేకిస్తూ వచ్చారు.

'బ్రెజిల్ సైనికులు చేవలేని వాళ్లు. అమెరికా సైనికుల మాదిరిగా ఆదివాసులను అంతం చేయలేకపోతున్నారు' అంటూ 1998లో ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలోనే కొరియో బ్రెజిలినీస్ అనే పత్రికతో ఆయన అన్నారు. కేవలం 10 లక్షలకుపైగా ఉన్న ఆదివాసీ జనాభాకు దేశంలో 13శాతం భూమిని ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

అధ్యక్షుడు బోల్సనారో వైఖరివల్లే అమెజాన్ అడవులు ఆక్రమణదారుల పాలవుతున్నాయని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి.

న్యాయపరమైన చిక్కులు

పిర్‌పికుర రక్షిత జోన్‌కు ప్రస్తుతం ల్యాండ్ ప్రొటెక్షన్ ఆర్డర్ రూపంలో భద్రత ఉంది. కానీ ఈ ఆర్డర్‌ను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తూ ఉండాలి. ఇటీవల సెప్టెంబరులో ఆరు నెలలపాటు ఈ ఆర్డర్‌ను పునరుద్ధరించారు. గతంలో ఈ గడువు ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు ఉండేది.

ఇలా గడువు తగ్గిస్తూ పోవడం వల్ల తొందరలోనే ఈ అటవీ భూములపై తమకు హక్కులు వస్తాయనే ఆశ చొరబాటుదార్లలో కనిపిస్తోందని ఫాబ్రిసియో ఆమోరిమ్ అంటున్నారు.

గత ఏడాది డిసెంబరులో బంగారం వంటి విలువైన ఖనిజాల సమాచారంతో కూడిన మ్యాపులను బ్రెజిలియన్ జియోలాజికల్ సర్వీస్ విడుదల చేసింది. తొలి విడత విడుదల చేసిన మ్యాపుల్లో ఉత్తర మాటో గ్రొసో ప్రాంతం కూడా ఉంది. పిర్‌పికుర రక్షిత ప్రాంతం ఇందులోనే ఉంది.

కానీ, తమ ప్రాంతాన్ని రక్షించుకునేందుకు ఆ తెగ ప్రజలకు అన్నిరకాలుగా సాయం చేయడంతోపాటు ఆహార, ఆరోగ్య భద్రత కల్పిస్తామని బ్రెజిల్ ఆదివాసీల వ్యవహారాల విభాగం చెబుతోంది. కానీ ఈ మాటలు తమ జాతిని రక్షించలేవని రీతా అంటున్నారు.

ప్రస్తుతం కరిపూనా తెగలోని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని అక్కడే నివసిస్తున్నారు రీతా. అప్పుడప్పుడు పిర్‌పికుర జోన్‌లోకి వెళ్లివచ్చే ఆమె, కరోనా వల్ల కొంతకాలంగా అటు వెళ్లడం లేదు. తాను వెళ్లిన ప్రతిసారీ అక్కడ మరింత విధ్వంసాన్ని చూస్తున్నట్లు రీతా అంటున్నారు.

అక్కడున్న ఎంతో మంది ఆక్రమణదారులు తన సోదరుడు, మేనల్లుడిని సులభంగా చంపేస్తారని, చివరకు తాను ఒక్కదానినే మిగులుతానేమోనని ఆమె భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Amazon jungles: 'All three of us will be killed by invaders'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X