రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో పెను భూకంపం - సునామీ వార్నింగ్..!!
పోర్ట్ విలా: పసిఫిక్ మహాసముద్రం రీజియన్ లోని వనువాటులో పెనుభూకంపం సంభవించింది. చిన్న ద్వీపదేశం ఇది. ఇక్కడి తీరప్రాంతంలో 7.2 తీవ్రతతో భూమి కంపించింది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తీర ప్రాంతం మొత్తాన్నీ ఖాళీ చేయించారు. ఈ భూకంపం తీవ్రత నేపథ్యంలో- తీర ప్రాంతాలు పోటెత్తాయి. అలలు ఎగిసిపడ్డాయి.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. పోర్ట్ ఓల్రీ విలేజ్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్నీ భూకంప కేంద్రంగా గుర్తించినట్లు స్పష్టం చేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా రికార్డయింది. ఉపరితలం నుంచి 27 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు పేర్కొంది.

భూకంపం సంభవించిన వెంటనే హవాయ్ లోని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అప్రమత్తం అయింది. 7.2 తీవ్రతతో కూడుకున్న ప్రకంపనలు కావడం వల్ల సునామీ అలర్ట్ ను జారీ చేసింది. వనువాటులో కొన్ని తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకుని వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. తీరంలో అలలు సాధారణ స్థాయి కంటే మీటర్ ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉందని వివరించింది.
న్యూ కాలెడోనియా, సోలమన్ దీవులపైనా దీని ప్రభావం పడింది. ఆయా దేశాల్లో కూడా తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. అలలు పోటెత్తాయి. సాధారణ స్థాయి కంటే 0.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వనువాటు.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది. ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొంటుంటాయి. తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. క్రియాశీలక అగ్నిపర్వతాలు అధికం ఇక్కడ.
వనువాటుకు ఉత్తరదిశగా ఉన్న సొలొమన్ ఐలండ్స్‌లో కొద్దిరోజుల కిందటే తాజాగా భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రాజధాని హొనియారాకు నైరుతి దిశగా ఉన్న మలాంగోలో ఉపరితలం నుంచి 10.5 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల భూమి ప్రకంపించింది. అప్పుడు కూడా సునామీ అలర్ట్ ను జారీ చేశారు అధికారులు.












Click it and Unblock the Notifications